సాక్షి, ఆదిలాబాద్/కైలాస్‌నగర్: ‘‘విదేశాల్లో ఉన్న మనవాళ్లు ఇక్కడ ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు రావాలి. రాష్ట్రంలోని ఐటీ పార్కుల్లో కంపెనీలు పెట్టాలి. వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నిరకాల ప్రోత్సాహకాలు ఇస్తాం..’’ అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ద్వితీయశ్రేణి నగరాలకూ ఐటీ పరిశ్రమలను విస్తరించాలన్నది ప్రభుత్వ విధానమని.. ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతంలో ఐటీ కంపెనీ ఏర్పాటవడం హర్షించదగ్గ విషయమని చెప్పారు.
సోమవారం మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఇటీవల మాతృమూర్తిని కోల్పోయిన ఎమ్మెల్యే జోగు రామన్న నివాసానికి వెళ్లి పరామర్శించారు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీడీఎన్‌టీ ల్యాబ్ ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సెమినార్‌లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రూరల్ టెక్నాలజీ పాలసీ అమలు సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని కేటీఆర్ చెప్పారు.
ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదని, అటువంటి పరిస్థితి నుంచి ఐటీ మ్యాప్‌లోకి వచ్చిందని పేర్కొన్నారు. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ తదితర ద్వితీయశ్రేణి పట్టణాల్లోనూ ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని.. స్థానిక యువతకు అవకాశాలు కల్పిస్తే హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలతో పోటీపడతారని చెప్పారు.
ఎమ్మెల్యే జోగు రామన్న విజ్ఞప్తి మేరకు ఆదిలాబాద్‌లో ఐటీ పార్క్‌ను ఐదెకరాల్లో ఏర్పాటు చేస్తామని, త్వరలో దానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. గుట్టలు, వాగులు, వంకలు, పచ్చని మైదానాలు, జలపాతాలు, అద్భుత సాంస్కృతిక సంపదలు ఆదిలాబాద్ సొంతమని.. ఇక్కడి ప్రదేశాలను ప్రమోట్ చేయడంపై దృష్టిపెట్టాలని పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరుతున్నానని చెప్పారు.
సిమెంట్ కార్పొరేషన్‌పై స్పందించట్లేదు
ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను తిరిగి తెరిపించేందుకు చాలా ప్రయత్నాలు చేశామని, కానీ స్పందన లేదని కేటీఆర్ చెప్పారు. సీసీఐని తెరిపించేందుకు జోగు రామన్న నాయకత్వంలో జేఏసీ ఉద్యమం చేసిందని గుర్తు చేశారు. అంతకుముందు ఆదిలాబాద్‌లో చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కాగా ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రులకు నిరసన సెగ తగిలింది. 317 జీవో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు మంత్రుల కార్యక్రమ వేదిక ఎదుట ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకునే యత్నం చేశారు. తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఆరు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment