ఆదివారం రాత్రి గట్టుప్పల్ రోడ్‌షోలో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చండూరు: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కార్పొరేట్ కమలానికి, గరీబోళ్ల గులాబీ పార్టీకి మధ్య జరుగుతోందని, ఈ ఎన్నికలో కార్పొరేట్లు గెలవాల్నా.. గరీబోళ్లు గెలవాల్నా అని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరారు. ఆయన ఆదివారంరాత్రి నియోజకవర్గంలోని గట్టుప్పల మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. ‘ఓటుకు తులం బంగారం ఇస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. అవి గుజరాత్ దొంగల పైసలు. దబాయించి తీసుకొని టీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి’అని పేర్కొన్నారు. 2018లో గెలిచిన రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటూ బీజేపీ కోవర్టుగా మూడున్నరేళ్లు పనిచేశాడని, చివరికి రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు.
ఇది కోవర్టు రాజకీయం కాదా..
మునుగోడు నియోజకవర్గ సమస్యలను రాజగోపాల్‌రెడ్డి తనకుగానీ, ఉమ్మడి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికిగానీ చెప్పిన దాఖలాలు లేవని కేటీఆర్ పేర్కొన్నారు. ఉపఎన్నికలు బీజేపీ కుట్రలో భాగమేనని, ప్రజలు కోరుకున్నవి కావన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కోవర్టులేనని, రాజగోపాల్‌ను గెలిపించాలని ఆయన అన్న కాంగ్రెస్ ఎంపీగా ఉండి ఇతరులకు ఫోన్ చేస్తున్నారని, ఇక్కడున్న కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి పంపేందుకు యత్నిస్తున్నారని అన్నారు.
ఇది కోవర్టు రాజకీయం కాదా అని ప్రశ్నించారు.‘మాది ఓ చిన్న కంపెనీ అని చెప్పిన రాజగోపాల్.. అదే నోటితో రూ.18 వేల కాంట్రాక్టు వచ్చిందని చెప్పారని, చిన్న కంపెనీకి రూ.18 వేల కాంట్రాక్టు ఎలా తెచ్చుకున్నారని ప్రశ్నించారు. అది ఇచ్చిన పెద్దలు ఎవరు .. గుజరాత్ గద్దలు ఎవరని అన్నారు. జన్‌ధన్ ఖాతాలో పేదలకు రూ.15 లక్షల చొప్పున పడాల్సిన డబ్బులన్నీ కోమటిరెడ్డి ఖాతాలో జమ అయ్యాయని ధ్వజమెత్తారు.
ఓట్లు వేసిన మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ‘చేనేత సమస్యలను విస్మరించారు.. డబ్బులు పెట్టి ప్రజలను అంగడి సరుకులు లాగా కొందామని కుట్ర చేస్తున్నారు’అని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చామని.. రైతన్నలు ఓటేసేటప్పుడు ఓసారి ఆలోచించాలని కోరారు.
ఫ్లోరైడ్‌ను సీఎం కేసీఆర్ తరిమికొట్టారు
శాశ్వతంగా ఫ్లోరైడ్‌ను తరిమికొట్టింది ముఖ్యమంత్రి కేసిఆర్ అని అన్నారు. జానారెడ్డి, పాల్వాయి గోవర్దన్ రెడ్డిలు మంత్రులుగా ఉండి కూడా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించ లేదన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటి నల్లా ఇవ్వడంతోపాటుగా సాగు నీరు అందించేందుకు శివన్నగూడెం, లక్ష్మణా పురం ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. పాలమూరు–డిండి ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా దూసుకుపోతోందన్నారు.
అందుకే బీజేపీ వాళ్ళ కన్ను కుట్దింది.. కుట్రలు మొదలు పెట్టారన్నారు. దళిత బంధులాగా భవిష్యత్తులో అన్ని వర్గాలకు బంధు పథకం అందిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నరేంద్ర మోదీ మోసం చేశాడన్నారు. రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేస్తే సిలిండర్ ధర రెండు వేలవుతుందని చెప్పారు. చేనేతలకు సబ్సిడీలు అందిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్‌రెడ్డి , శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు , మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment