సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్‌ఎస్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలిశారు. కాంగ్రెస్ పార్టీ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన్ను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించేందుకు గచ్చిబౌలిలోని నాగం నివాసం వద్దకు వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మంత్రుల వెంట పలువురు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.
కాగా నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సీనియర్ నేతగా పేరున్న ఆయనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన అనుచరుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఆదివారం తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో జరిగిన అవమానాలను, కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలను ఈ లేఖ ద్వారా తన అనుచరులకు, ప్రజలకు వివరించారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రులు ఆయన్ను కలవడం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment