సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కువ సంఖ్యలో సాంకేతిక ఆధారిత (టెక్) ఉద్యోగాలను సృష్టించడం ద్వారా హైదరాబాద్ ‘టెక్ పవర్‌హౌజ్’గా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఎలక్ట్రానిక్స్, విమానయాన, అంతరిక్ష, రక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్, రవాణా, వస్త్రోత్పత్తి రంగాలకు తెలంగాణ నిలయంగా ఉందన్నారు.
యూకే పర్యటనలో భాగంగా కేటీఆర్ శుక్రవారం లండన్‌లో భారత హైకమిషనర్ విక్రమ్ కె. దొరైస్వామి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. వివిధ రంగాలకు చెందిన పెట్టుబడిదారులు పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను కేటీఆర్ వివరించారు.
పుంజుకున్న పారిశ్రామికీకరణ
రాష్ట్రంలో ప్రాథమిక సమస్యలన్నింటిపైనా దృష్టి సారించి వాటి పరిష్కారానికి ప్రయత్నించామని కేటీఆర్ చెప్పారు. ఆవిష్కరణలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీంతో వ్యవసాయం, ఐటీ మొదలుకొని అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధ్యమైందని, పారిశ్రామికీకరణ కూడా వేగం పుంజుకుందని తెలిపారు. ‘టీఎస్‌ఐపాస్ ద్వారా పారిశ్రామిక అనుమతుల విధానంలో పారదర్శకత, వేగం పెరిగాయి.
హైదరాబాద్‌లోని ఆవిష్కరణల వాతావరణం, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, ప్రపంచ ప్రసిద్ధ కంపెనీల మూలంగా ఆయా రంగాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకొచ్చే సంస్థలకు సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’అని కేటీఆర్ వెల్లడించారు. యూకే విద్యాసంస్థలు కింగ్స్ కాలేజ్, క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వంటి ప్రసిద్ధ సంస్థలతో తెలంగాణ చేసుకున్న భాగస్వామ్యాలను ఆయన ప్రస్తావించారు.
భారత హై కమిషనర్ విక్రమ్ కే. దొరైస్వామి మాట్లాడుతూ.. భారీ యంత్రాలు, వైమానిక, రక్షణ, వినోద, విద్యారంగాల్లో యూకే కంపెనీలతో తెలంగాణ భాగస్వామ్యానికి అనేక అవకాశాలు ఉన్నాయని స్పష్టంచేశారు. తెలంగాణలో నూతన సచివాలయం, అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటుతో సహా తొమ్మిదేళ్లుగా సాధించిన ప్రగతిని బ్రిటిష్ భారత వ్యాపారవేత్త బిల్లీమోరియా ప్రస్తావించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment