‘‘ఆస్పత్రిలో ఏం చేస్తావ్‌? నీ మొగుడు చూసుకుంటాడులే’’ | Hyderabad Cyber Crime Woman Inspector Faces Action After Harassment Allegations, Shifted Following Probe | Sakshi
Sakshi News home page

‘‘ఆస్పత్రిలో ఏం చేస్తావ్‌? నీ మొగుడు చూసుకుంటాడులే’’

Mar 25 2026 7:46 AM | Updated on Mar 25 2026 12:03 PM

malkajgiri police woman inspector misconduct

సాక్షి,హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి పోలీసు కమిషనరేట్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగంలోని ఓ మహిళా ఇన్‌స్పెక్టర్‌ సహచర సిబ్బందితో అమానవీయంగా, అసభ్యకర రీతిలో ప్రవర్తించిన వైనం వెలుగులోకి వచ్చింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లతోనే కాదు ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ వారితోనూ ఆమె తీరు ఇలాగే ఉంటుందని పలువురు సిబ్బంది ‘సాక్షి’తో వాపోయారు. 

రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమెను చూసుకునేందుకు సెలవు అడగ్గా... కుదరదని చెప్పడంతో పాటు ‘‘ఆస్పత్రిలో ఏం చేస్తావ్‌? నీ మొగుడు చూసుకుంటాడులే’’ అని మాట్లాడిందని ఓ మహిళా పోలీసు ‘సాక్షి’ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఏమాత్రం సానుభూతి లేకుండా ప్రతి విషయంలోనూ మానసిక, శారీరక వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. 

పోలీస్‌ యూనిఫాంలో ఠాణాకు రాకపోవడం వంటి విమర్శలకు తోడు, ఇటీవల పోక్సో కేసులో స్టేట్‌మెంట్‌ రికార్డ్‌కు వచ్చిన స్థానిక పోలీసు సిబ్బందితో విపరీతంగా ప్రవర్తించడంతో.. వారు తీవ్రంగా కుంగిపోయారు. విషయాన్ని ఉన్నతాధికారులు, కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అంతర్గత విచారణకు ఆదేశించారు. ఆరోపణలు వాస్తవమేనని కమిషనర్‌కు నివేదిక అందజేశారు. దీంతో మహిళా ఇన్‌స్పెక్టర్‌ను మల్టీ జోన్‌–2కు సరెండర్‌ చేశారు. సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో హోదాతో సంబంధం లేకుండా అందరూ విధిగా యూనిఫామ్‌లో డ్యూటీ నిర్వహించాలని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement