సాక్షి, హైదరాబాద్: మహానగర దాహార్తిని తీరుస్తున్న కృష్ణా, గోదావరి జలాలను వందల కిలోమీటర్ల దూరం నుంచి తరలించేందుకు అందుబాటులో ఉన్న పంప్‌హౌస్‌లకు ముంపు ముప్పు పొంచి ఉంది. రాజధానికి సుమారు 110 కి.మీ దూరంలో.. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి కృష్ణా జలాలు, గ్రేటర్‌కు సుమారు 185 కి.మీ దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి గోదావరి జలాలను గ్రేటర్ నగరానికి తరలిస్తున్నారు. ఈ జలాలను తరలించేందుకు మార్గమధ్యలో పంప్‌హౌస్‌లు, నీటిశుద్ధి కేంద్రాలు సుమారు 20 వరకు ఉన్నాయి.
వీటి వద్ద తరచూ సాంకేతిక సమస్యలు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో నగర తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతుండడం గమనార్హం. తాజాగా గోదావరి జలాలను సిటీకి తరలిస్తున్న మల్లారం పంప్‌హౌస్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో 9 పంపులు నీట మునిగాయి. రెండు రోజులపాటు నగర తాగునీటి సరఫరాకు ఇక్కట్లు తప్పలేదు. ఈ నేపథ్యంలో పలు పంపుహౌస్‌లకు ముంపు కష్టాలు వెంటాడుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
చదవండి: పాము కాటు విషపూరితమైనదా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ముందు జాగ్రత్త చర్యలే కీలకం..
► గ్రేటర్ సిటీకి మంజీరా, సింగూరు జలాలను పరిమితంగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో జంట జలాశయాలు, కృష్ణా, గోదావరి జలాలే ఆదరువయ్యాయి. ఈ జలాశయాల నుంచి నిత్యం జలమండలి 430 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సేకరించి శుద్ధి చేసి నగరవ్యాప్తంగా సుమారు పది లక్షల నల్లాలకు సరఫరా చేస్తోంది.
► ఈ నీటిని సిటీకి తరలించేందుకు జలమండలి భగీరథ ప్రయత్నాలే చేస్తోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తరలించేందుకు పంప్‌హౌస్‌లు, నీటిశుద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. నీటిని పంపింగ్ చేసేందుకు ప్రత్యేక విద్యుత్ ఫీడర్లున్నాయి. పంప్‌హౌస్‌లలో తరచూ మోటార్లు మొరాయించడం, ప్రత్యేక ఫీడర్లు ట్రిప్ అవుతుండడంతో విద్యుత్ సరఫరా ఆకస్మికంగా నిలిచిపోతోంది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోంది.
చదవండి: అసత్య ప్రచారం, బెదిరింపులు: తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు
► తరచూ సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పక్షంలో.. సిటీలో సుమారు 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఫీడర్లు, మోటార్లు, పంప్‌హౌస్‌ల నిర్వహణను మరింత అప్రమత్తంగా నిర్వహించాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
► తాజాగా మల్లారం పంప్‌హౌస్ నీట మునిగేందుకు సమీపంలో ఉన్న పల్లె చెరువు వరద నీరే కారణమవడంతో పంప్‌హౌస్ చుట్టూ పెద్ద పరిమాణంలో ప్రహరీ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఇదే తరహాలో భారీ వర్షాలు, వరదలు సంభవించినపుడు జలాశయాలు, ప్రాజెక్టులకు సమీపంలో ఉన్న పంప్‌హౌస్‌లు, నీటిశుద్ధి కేంద్రాల చుట్టూ ఎత్తైన, పటిష్టమైన ప్రహరీలు నిర్మించాల్సి ఉందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సూచిస్తున్నారు.
కొనసాగుతున్న మరమ్మతులు..
గ్రేటక్‌కు గోదావరి జలాలను తరలించే మల్లారం పంప్ హౌస్ నీట మునగడంతో జలమండలి అధికారులు మరమ్మతులు ముమ్మరం చేశారు. నీట మునిగిన 9 పంపుల్లో బుధవారం నాలుగింటికి మరమ్మతులు చేపట్టి నీటిని పంపింగ్ చేశామని..మరో 5 పంపులకు మరమ్మతులను గురువారం నాటికి పూర్తి చేస్తామని జలమండలి అధికారులు తెలిపారు. గోదావరి జలాల లభ్యత తగ్గిన కారణంగా సింగూరు, మంజీరా, జంట జలాశయాల నుంచి నగర అవసరాలకు అదనంగా తాగునీటిని సేకరిస్తున్నామని.. కొరత ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment