
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నల్లగొండ: భార్య కాపురానికి రావడం లేదని అత్తింటిని, రెండు బైక్‌లను ఓ అల్లుడు కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటన నల్లగొండ పట్టణ శివారులోని మర్రిగూడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్‌ఐ రాజ శేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన వంగూరి సైదులుకు, మర్రిగూడ గ్రామానికి చెందిన సుమలతతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. సైదులు తాగుడుకు బానిస కావడంతో భార్య సుమలత ముగ్గురు పిల్లలతో కలిసి మూడేళ్ల నుంచి మర్రిగూడలోని తల్లిదండ్రులకు చెందిన మరో ఇంట్లో ఉంటోంది. ఇకపై తాగనని, సరిగ్గా ఉంటానని చెప్పిన సైదులు నెల రోజుల కిందట భార్య వద్దకు వచ్చి ఉంటున్నాడు.
కానీ, ఆ తర్వాత కూడా డబ్బులివ్వాలని, లేదంటే బిడ్డను చంపుతానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తలుపులకు గడియ పెట్టి, బయట ఉన్న రెండు బైక్‌లపై, ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. బైక్‌ల పెట్రోల్ ట్యాంకులు భారీ శబ్దంతో పేలడంతో ఇంట్లో ఉన్న సుమలత, పిల్లలను తీసుకుని వెనుక తలుపు నుంచి తప్పించుకుంది. ఈ ఘటనలో వాహనాలు పూర్తిగా కాలిపోగా, పూరి గుడిసె ముందుభాగంలో కొంత కాలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment