సాక్షి, నల్లగొండ క్రైం: వివాహేతర సంబంధం పెట్టుకొని తన పరువు తీసిందనే కోపంతో భార్యను ఉరేసి హత్య చేసిన భర్తను నల్లగొండ టూటౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాలోని శౌకత్‌పల్లి గ్రామానికి చెందిన మాడవత్ శంకర్ మునుగోడు మండలం కొరటికల్ సమీపంలో రోడ్డు పనిలో కూలీగా చేస్తున్నాడు. శంకర్, మెదక్ జిల్లా ఎస్ కొండాపురం గ్రామానికి చెందిన రాతుల సరిత అలియాస్ శిరీష(21) ఏడేళ్లుగా ప్రేమించుకొని ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు రెండు నెలలపాటు మంచిగానే కలిసి ఉన్నారు.
ఉగాది పండుగకు ఏప్రిల్ 1న తల్లిగారింటికి వెళ్లిన సరిత అదే గ్రామానికి చెందిన గుగులోతు సురేష్‌తో వివాహేతర సంబంధం ఉండడంతో అతనితో వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు మెదక్ జిల్లాలోని శంకరంపేట పోలీస్ స్టేషన్‌లో సరిత కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఏప్రిల్ 18న సరిత, సురేష్‌ను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇరువర్గాల పెద్ద మనుషుల సమాక్షంలో కౌన్సెలింగ్ చేశారు. అయినప్పటికీ శిరీష సురేష్‌తోనే వెళ్లిపోయింది.
కొన్నిరోజుల తర్వాత సరిత తన ప్రియుడు సురేష్ ఫోన్ నుంచి భర్త శంకర్‌కు కాల్ చేసి ‘నీతో పాటు వస్తాను నన్ను తీసుకెళ్లు’ అని చెప్పింది. ఆ తర్వాత తన తల్లిగారింటికి చేరకున్న సరిత ఈ నెల 10న మరోసారి తండ్రి పూలసింగ్ ఫోన్ నుంచి భర్త శంకర్‌కు కాల్ చేసి తనను తీసుకెళ్లమని కోరడంతో సరే అన్నాడు. పూలసింగ్ తన పెద్ద అల్లుడు ముడావత్ బాబుకు విషయం చెప్పగా.. అతడు హైదరాబాద్‌లో శంకర్‌కు సరిత అప్పగించి వెళ్లిపోయాడు.
సంబంధిత వార్త: వివాహమైన మూడు నెలలకే భార్యపై అనుమానం.. లాడ్జీకి పిలిపించి..
పరువు తీసిందనే కోపంతో..
తనను మోసం చేసి మరొకరితో లేచిపోయి తన పరువు తీసిందని మనసులో పెట్టుకున్న మాడవత్ శంకర్ ఎలాగైనా సరితను హత్య చేయాలని భావించాడు. ఈ నెల 13న తనతో పాటు సరితను నల్లగొండకు తీసుకొచ్చిన శంకర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న పున్నమి లాడ్జిలో దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో రగిలిపోతున్న శంకర్ భార్య సరిత మెడకు చున్నీతో చుట్టి అదే గదిలో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. సరిత చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాతనే శంకర్ లాడ్జి నుంచి బస్టాండ్‌కు వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శంకర్ సోమవారం నల్లగొండకు వచ్చి మునుగోడు బస్సు ఎక్కేందుకు ఎదురు చూస్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment