హాలియా : త్రిపురారం మండలంలోని అంజనపల్లి గ్రామానికి చెందిన నగేష్(27) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే నగేష్ దారుణ హత్యకు గురయ్యాడని తేల్చారు. ఘాతుకానికి ఒడిగట్టిన దంపతులను అరెస్టు చేశారు. హాలియా పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి మిర్యాలగూడ డీఎస్పీ పనకంటి వెంకటగిరి కేసు వివరాలు వెల్లడించారు. త్రిపురారం మండలంలోని అంజనపల్లి గ్రామానికి చెందిన నగేష్(27) గొర్రెలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన రాత్రి సతీష్ అతని తమ్ముడు ఎర్రగొర్ల నగేష్ ఇద్దరూ భోజనం చేసిన తరువాత ఒకే చోట పడుకున్నారు. అదే రోజు రాత్రి సుమారు 11 సమయంలో ఎర్రగొర్ల నగేష్ సెల్‌ఫోన్‌కి కాల్ వచ్చింది. ఆ తరువాత ఉదయం ఎర్రగొర్ల సతీష్ చూడగా నగేష్ కనిపించలేదు. ఈనెల 6వ తేదీ నుంచి నగేష్ కనబడలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో నగేష్ సోదరుడు ఎర్రగొర్ల సతీష్ త్రిపురారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ నెల 7న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..
నగేష్, కంచుగంట్ల శ్రీనివాస్ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఒకరింటికి ఒకరు వచ్చిపోతుండేవారు. శ్రీనివాస్ లేని సమయంలో కూడా నగేష్ ఇంటికి వచ్చి వెళ్తూ అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నగేష్ తన భార్యతో చనువుగా ఉంటూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని శ్రీనివాస్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో పలుమార్లు నగేష్‌ని హెచ్చరించినా తీరు మార్చు కోలేదు. నగేష్‌తో స్నేహంగా ఉంటూనే అతనిపై శ్రీనివాస్ కక్ష పెంచుకున్నాడు. అదును చూసి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
భార్యతో ఫోన్ చేయించి..
పథకం ప్రకారం ఈనెల 5వ తేదీ రాత్రి శ్రీనివాస్ తన భార్య మీనాక్షితో నగేష్‌కి ఫోన్ చేయించి తన ఇంటికి వచ్చేవిధంగా పథకం పన్నాడు. అదే రోజు రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన నగేష్‌ను శ్రీనివాస్ కత్తితో మెడపై నరికాడు. నగేష్‌కి బలమైన గాయాలు అయి మంచంపై పడిపోగా శ్రీనివాస్ భార్య మీనాక్షి ఇంట్లో ఉన్న కర్రతో నగేష్ తనపై బలంగా మోదింది. దీంతో మరో మారు కత్తితో శ్రీనివాస్ నగేష్‌ని పొడిచాడు. అతని ప్రాణం ఇంకా పోలేదని భావించిన శ్రీనివాస్, అతని భార్య మీనాక్షి ఇద్దరూ కలిసి నైలానుతాడుతో నరేష్ మెడకు రెండు సార్లు చుట్టి హత్య చేశారు. అనంతరం పశువుల కొట్టం వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంక్ మూత పగలగొట్టి నగేష్ మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడవేశారు. దీంతో పాటు నగేష్ చెప్పులు, సెల్‌ఫోన్‌తో పాటు రక్త మరకలు అంటిన తమ దుస్తులను సెఫ్టిక్ ట్యాంకులో వేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని తన ఇంట్లోని వడ్ల బస్తాల వెనుక దాచిపెట్టినట్లు పోలీసులు సమక్షంలో కంచుగంట్ల శ్రీనివాస్, భార్య మీనాక్షి ఒప్పుకున్నారు.
అనుమానంతో అదుపులోకి తీసుకుని..
ఇటీవల నగేష్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు త్రిపురారం పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా కంచిగట్ల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తన భార్యతో కలిసి నగేష్‌ను హత్య చేసి తన ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని పడవేసినట్లు నేరం అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని కేసులో నిందితులైన శ్రీనివాస్‌తో పాటు అతని భార్య కంచిగట్ల మీనాక్షిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటగిరి వివరించారు. కేసును ఛేదించిన హాలియా సీఐ గాంధీనాయక్, త్రిపురారం ఎస్‌ఐ శోభన్‌బాబు, సిబ్బంది రవి, శ్రావన్‌కుమార్, శ్రీని వాస్, రాము, శ్రీనును అభినందించినట్లు డీఎప్పీ తెలిపారు. కార్యక్రమంలో హాలియా ఎస్‌ఐ క్రాంతికుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment