మా కాలేజీలో చేరండి..! | Management Forces On Faculty For Admissions In Engineering‌ Courses | Sakshi
Sakshi News home page

మా కాలేజీలో చేరండి..!

Published Thu, Aug 20 2020 8:56 AM | Last Updated on Thu, Aug 20 2020 9:16 AM

Management Forces On Faculty For Admissions In Engineering‌ Courses - Sakshi

బాబూ.. ఏ కాలేజీలో బీటెక్‌ చేయాలనుకుంటున్నావు. ఎంసెట్‌లో సీటు వచ్చినా, రాకున్నా మా కాలేజీలో చేరితే అన్నీ మేమే చూసుకుంటాం. అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్‌. వెంటనే రూ.10 వేలు చెల్లించి నీకు నచ్చిన కోర్సులో అడ్మిషన్‌ తీసుకో.. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థితో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ లెక్చరర్‌ ఫోన్‌  సంభాషణ ఇది. 

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌–20 పరీక్ష ఇంకా నిర్వహించలేదు. ర్యాంకులు వెలువడలేదు. ఏయే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఎన్ని సీట్లున్నాయో తెలియదు. ఏ కాలేజీలో ఏ కటాఫ్‌ ర్యాంక్‌ ఉంటుందో కూడా స్పష్టత లేదు. ఇంత గందరగోళంలో ఉన్నా కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్ల కోసం ప్రచారకార్యక్రమాలు మొదలుపెట్టాయి. కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీపై అడ్మిషన్‌  టార్గెట్లు విధిస్తున్నాయి. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధిస్తేనే వేతనాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో లెక్చరర్లు క్షేత్రస్థాయిలో అడ్మిషన్ల నిమిత్తం విద్యార్థుల కోసం వేట మొదలుపెట్టారు. 

అడ్వాన్స్‌ బుక్‌ చేస్తే సరి... 
ఎంసెట్‌ పరీక్ష జరగనప్పటికీ మాక్‌ టెస్ట్‌ల ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. ఈ క్రమంలో వచ్చే మార్కులను అంచనా వేసి ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలుంటాయనే దాన్ని సైతం అంచనా వేయొచ్చు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ముందస్తుగానే సీటు రాదని భావించి మేనేజ్‌మెంట్‌ కోటావైపు అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితిని యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మరోవైపు కాలేజీల్లో బోధన సిబ్బంది ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఎంసెట్‌ కోసం ఎన్‌ రోల్‌ చేసుకున్న విద్యార్థుల వివరాలతో కూడిన జాబితాను సంపాదించి వారిని సంప్రదిస్తున్నారు. కొందరైతే నేరుగా ఇంటికి వెళ్లి మరీ విద్యార్థి తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ కోసం రూ.10 వేలు తీసుకుని రిసిప్ట్‌ ఇస్తున్నారు. ఒకవేళ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో కోరిన చోట సీటు వస్తే డబ్బులు తిరిగిచ్చేస్తామని, లేకుంటే తమ కాలేజీలో అడ్మిషన్‌  పక్కా అని హామీ ఇస్తున్నారు.  

గవర్నర్‌ ఆగ్రహం 
కాలేజీ యాజమాన్యాల అడ్మిషన్ల వ్యవహారంపై ఇంజనీరింగ్‌ కాలేజీ ఫ్యాకల్టీ అసోసియేషన్‌  గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. కోవిడ్‌–19 తీవ్రత ఉన్నప్పటికీ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి లెక్చరర్లు విధులకు వెళ్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేఎన్‌టీయూహెచ్‌కు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాకల్టీతో అడ్మిషన్ల ప్రక్రియకు ఉసిగొల్పిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జేఎన్‌టీయూ తక్షణమే స్పందించి అడ్మిషన్లు, ఫ్యాకల్టీ విధులపై పలు హెచ్చరికలు జారీ చేశాయి. ఉత్తర్వులను వర్సిటీ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు.  

విద్యార్థులు, అధ్యాపకులపై ఒత్తిడి చేయొద్దు..  
విద్యార్థి సాధించిన ర్యాంకు ఆధారంగా తనకు నచ్చిన కాలేజీలో అడ్మిషన్‌  తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. కానీ, ర్యాంకు ఏదొచ్చినా మా కాలేజీలో చేరాలని ఒత్తిడి చేయొద్దు. ఆతని కుటుంబ పరిస్థితి, ఆర్థిక నేపథ్యం ఆధారంగా కాలేజీని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఇవ్వాలి. ఫ్యాకల్టీకి అడ్మిషన్ల టార్గెట్‌ ఇవ్వొద్దు. వాళ్లు కేవలం పాఠ్యాంశ బోధనలోనే అనుభవం ఉంటుంది. అడ్మిషన్లు చేయించడం వాళ్లకేం తెలుసు. ఫ్యాకల్టీపై ఇలాంటి అనవసర విధులు రుద్ది వారిని ఇబ్బందులకు గురి చేయొద్దు. 
– దాసరి శ్రీనివాస శర్మ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టెక్నికల్‌ ఇన్సిస్టిట్యూషన్ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement