adimissions
-
Hyderabad: సర్కారు బడికి పెరుగుతున్న అడ్మిషన్లు!
నగరంలో ప్రైవేటు ఉద్యోగి చంద్రశేఖర్ తన ఇద్దరు పిల్లలను ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నాడు. కరోనా సెంకడ్ వేవ్ ఆర్థిక కష్టాలకు గురిచేయడంతో పూర్తిగా అప్పులపాలయ్యారు. పిల్లలను ప్రైవేటులో చదివించేందుకు ఫీజులు చెల్లించే స్థోమత లేకుండా పోయింది. దీంతో సర్కారు బడుల్లో చేర్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది ఒక చంద్రశేఖర్ పరిస్థితి కాదు..కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి ఆర్థిక కష్టాలు పడుతున్న వేలాది మంది తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: కరోనా కష్టకాలంలో సర్కారు బడులు, గురుకులాలకు అడ్మిషన్ల తాకిడి పెరుగుతోంది. ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టించిన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కలేక..ప్రైవేట్ స్కూళ్లకు ఫీజులు చెల్లించలేక చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని సర్కారు బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. ఇప్పటి వరకు పిల్లల చదువులకు ఎంతటి ఖర్చునైనా భరించేందుకు సిద్ధపడే కుటుంబాల ఆర్థిక పరిస్థితి తలకిందులు కావడంతో సర్కారు బడులవైపు దృష్టి సారిస్తున్నారు. ఒకటి నుంచి 5 వ తరగతి స్థాయి వారికి డే స్కూల్స్‌లో, 5 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు వివిధ గురు కుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా 2021–22 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల తాకిడి అధికమైంది. సర్కారు బడుల్లో అడ్మిషన్లు సునాయాసంగా లభిస్తున్నా.. గురుకులాల్లో సీట్లకు మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. ఎస్సీ, బీసీ గురుకులాకు పెద్దగా పోటీ లేనప్పటికి మైనారిటీ గురుకులాలకు మాత్రం తాకిడి అధికంగా కనిపిస్తోంది. కార్పొరేట్ కు తలపించే విధంగా సకల సౌకర్యాలు, వసతి ఏర్పాట్లు ఉండటంతో వీటిపై మైనారిటీ కుటుంబాల ఆసక్తి పెరిగింది. అందులో కేవలం 25 శాతం సీట్ల కోసం ఇతరులకు అవకాశం ఉన్నా...దాని కోసం కూడా తీవ్రంగా పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. టీసీల కోసం అగచాట్లు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం పెరెంట్స్‌కు టీసీల అగచాట్లు తప్పడం లేదు. సర్కారు బడులు, గురుకులాల్లో సీట్లకు అవకాశం ఉన్నా..ప్రైవేటు విద్యా సంస్థల నుంచి టీసీలు తీసుకోవడం తలకు మించిన భారంగా తయారైంది. పెండింగ్ ఫీజులు పూర్తిగా చెల్లిస్తే తప్ప టీసీలు ఇచ్చేందుకు ప్రైవేటు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలలో టీసీలు లేకుండా విద్యార్థులను చేర్చుకునేందుకు ఆదేశాలు ఉన్నా..టీసీ తప్పనిసరి అంటూ మెలిక పెడుతుండటంతో అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న వారికి మరింత భారంగా పరిస్థితి తయారైంది. 3.27 లక్షలపైనే... గ్రేటర్ పరిధిలోని సుమారు 2,672 ప్రభుత్వ బడుల్లో ప్రస్తుతం సుమారు 3.27 లక్షల మంది విద్య అభ్యసిస్తున్నారు. మరో 50 వేల మంది వరకు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కూడా సర్కారు బడుల్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 861 పాఠశాలల్లో 1.17 లక్షలు, మేడ్చల్‌లోని 503 పాఠశాల్లో 81 వేల మంది, రంగారెడ్డి జిల్లాలోని1308 పాఠశాలల్లో 1.26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
మా కాలేజీలో చేరండి..!
బాబూ.. ఏ కాలేజీలో బీటెక్ చేయాలనుకుంటున్నావు. ఎంసెట్‌లో సీటు వచ్చినా, రాకున్నా మా కాలేజీలో చేరితే అన్నీ మేమే చూసుకుంటాం. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్. వెంటనే రూ.10 వేలు చెల్లించి నీకు నచ్చిన కోర్సులో అడ్మిషన్ తీసుకో.. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థితో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ ఫోన్ సంభాషణ ఇది. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–20 పరీక్ష ఇంకా నిర్వహించలేదు. ర్యాంకులు వెలువడలేదు. ఏయే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎన్ని సీట్లున్నాయో తెలియదు. ఏ కాలేజీలో ఏ కటాఫ్ ర్యాంక్ ఉంటుందో కూడా స్పష్టత లేదు. ఇంత గందరగోళంలో ఉన్నా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్ల కోసం ప్రచారకార్యక్రమాలు మొదలుపెట్టాయి. కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీపై అడ్మిషన్ టార్గెట్లు విధిస్తున్నాయి. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధిస్తేనే వేతనాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో లెక్చరర్లు క్షేత్రస్థాయిలో అడ్మిషన్ల నిమిత్తం విద్యార్థుల కోసం వేట మొదలుపెట్టారు. అడ్వాన్స్ బుక్ చేస్తే సరి... ఎంసెట్ పరీక్ష జరగనప్పటికీ మాక్ టెస్ట్‌ల ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. ఈ క్రమంలో వచ్చే మార్కులను అంచనా వేసి ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలుంటాయనే దాన్ని సైతం అంచనా వేయొచ్చు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ముందస్తుగానే సీటు రాదని భావించి మేనేజ్మెంట్ కోటావైపు అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితిని యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మరోవైపు కాలేజీల్లో బోధన సిబ్బంది ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ కోసం ఎన్ రోల్ చేసుకున్న విద్యార్థుల వివరాలతో కూడిన జాబితాను సంపాదించి వారిని సంప్రదిస్తున్నారు. కొందరైతే నేరుగా ఇంటికి వెళ్లి మరీ విద్యార్థి తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం రూ.10 వేలు తీసుకుని రిసిప్ట్ ఇస్తున్నారు. ఒకవేళ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో కోరిన చోట సీటు వస్తే డబ్బులు తిరిగిచ్చేస్తామని, లేకుంటే తమ కాలేజీలో అడ్మిషన్ పక్కా అని హామీ ఇస్తున్నారు. గవర్నర్ ఆగ్రహం కాలేజీ యాజమాన్యాల అడ్మిషన్ల వ్యవహారంపై ఇంజనీరింగ్ కాలేజీ ఫ్యాకల్టీ అసోసియేషన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. కోవిడ్–19 తీవ్రత ఉన్నప్పటికీ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి లెక్చరర్లు విధులకు వెళ్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేఎన్టీయూహెచ్కు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాకల్టీతో అడ్మిషన్ల ప్రక్రియకు ఉసిగొల్పిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జేఎన్టీయూ తక్షణమే స్పందించి అడ్మిషన్లు, ఫ్యాకల్టీ విధులపై పలు హెచ్చరికలు జారీ చేశాయి. ఉత్తర్వులను వర్సిటీ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు, అధ్యాపకులపై ఒత్తిడి చేయొద్దు.. విద్యార్థి సాధించిన ర్యాంకు ఆధారంగా తనకు నచ్చిన కాలేజీలో అడ్మిషన్ తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. కానీ, ర్యాంకు ఏదొచ్చినా మా కాలేజీలో చేరాలని ఒత్తిడి చేయొద్దు. ఆతని కుటుంబ పరిస్థితి, ఆర్థిక నేపథ్యం ఆధారంగా కాలేజీని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఇవ్వాలి. ఫ్యాకల్టీకి అడ్మిషన్ల టార్గెట్ ఇవ్వొద్దు. వాళ్లు కేవలం పాఠ్యాంశ బోధనలోనే అనుభవం ఉంటుంది. అడ్మిషన్లు చేయించడం వాళ్లకేం తెలుసు. ఫ్యాకల్టీపై ఇలాంటి అనవసర విధులు రుద్ది వారిని ఇబ్బందులకు గురి చేయొద్దు. – దాసరి శ్రీనివాస శర్మ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టెక్నికల్ ఇన్సిస్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
కేజీబీవీల్లో ఇంటర్..
నల్లగొండ : జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో కళాశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వం పూనుకుంది. జిల్లాలో 14 కసూరిబా గాంధీ పాఠశాలలు ఉండగా ఇప్పటికే ఆరు పాఠశాలల్లో కళాశాలలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సంవత్సరం మరో మూడు పాఠశాలల్లో కళాశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జిల్లాలోని చండూరు, దామరచర్ల, పెద్దవూర మండలాల్లోని కస్తూరిబా పాఠశాలకు కళాశాలలను మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 14 కేజీబీవీలు.. పేద, తల్లిదండ్రులు లేని నిరుపేద బాలికల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేజీబీవీలను ప్రారంభించారు. జిల్లాలో 14 కస్తూరిబా గాంధీ బాలి కల విద్యాలయాలు ఉన్నాయి. అవన్నీ తెలుగు మీడియంలోనే ప్రారంభమయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ టూ పీజీ ఇంగ్లిష్ మీడి యం పాఠశాలల నిర్మాణానికి పూనుకుంది. దాంతో కేజీబీవీల్లో ఇంగ్లిష్ బోధన చేసేందుకు ఉపాధ్యాయులు ముందుకొచ్చిన పాఠశాలలను ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా మార్చారు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం బోధించే పాఠశాలలు ఉంటే ప్రతిపాదనలు పంపాలని జిల్లా విద్యాశాఖను కోరింది. జిల్లాలో ఏ పాఠశాలల నుంచి కూడా ఉపాధ్యాయులు ఇంగ్లిష్‌లో బోధన చేసేందుకు ముందుకు రాకపోవడంతో ప్రతిపాదనలు పంపని విషయం తెలిసిందే. మూడు పాఠశాలకు కళాశాలలు మంజూరు.. జిల్లాలోని చండూరు, పెద్దవూర, దామరచర్ల మండలాల్లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో కళాశాలలు ప్రారంభించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీట్ల భర్తీ ప్రక్రియ కూడా ప్రారంబించారు. ఒక్కో కళాశాలలో 2 గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు. చండూరులోని కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులను మంజూరు చేయగా, పెద్దవూర, దామరచర్ల మండలాల్లోని కళాశాలలకు ఎంపీహెచ్‌డబ్ల్యూ, సీఈసీ గ్రూపులను మంజూరు చేసింది. ఒక్కో గ్రూపుకు 40 సీట్లు ఉంటాయి. అంటే 2 గ్రూపులకు కలిపి ఒక్కో కళాశాలకు 80 సీట్లు మంజూరయ్యాయి. ఈ కళాశాలల్లో అధ్యాపకులను భర్తీ చేసేంత వరకు ఉన్నవారితోనే బోధన చేపట్టనున్నారు. అయితే ఈ మూడు మండలాల్లోని కేజీబీవీల్లో చదివే విద్యార్థినులతో పాటు జిల్లాలోని ఏ విద్యార్థులైనా ఈ కళాశాలల్లో చదివేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 17 నుంచి కళాశాలలు ప్రారంభం కానున్నాయి. వాటితో పాటే కేజీబీవీల్లోని కొత్త కళాశాలలు కూడా ప్రారంభిస్తారు. అప్పటిలోగా ఈ 3 కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు అధికారులు దరఖాస్తు ప్రక్రియను చేపట్టారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఈ కళాశాలల్లో చేరేందుకు తల్లిదండ్రులు లేని, పేద విద్యార్థినులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మిగిలిన సీట్లను జిల్లాలోని విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కేజీవీబీల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు కూడా చేరవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చేరేందుకు అవకాశం కల్పించారు. ఆసక్తి చూపని విద్యార్థినులు ఆయా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో కొత్తగా కళాశాలలు ఈ విద్యాసంవత్సరం ప్రారంభిస్తున్నా అదే పాఠశాలల్లో పదో తరగతి పాసైన విద్యార్థినులు మాత్రం చేరేందుకు పెద్దగా శ్రద్ధ చూపడంలేదు. అందుకు ప్రధాన కారణం తెలుగు మీడియంలోనే ఇంటర్ విద్య ప్రారంభించడం. కస్తూరిబాలో పదో తరగతి పాసైన వారు ఇంగ్లిష్ మీడియం కళాశాలలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి ఈ సంవత్సరం మరో మూడు కస్తూరిబా కళాశాలలు మంజూరు కావడం వల్ల పేద విద్యార్థినులకైతే మేలు జరగనుంది. -
రేపు పీజీ స్పాట్ అడ్మిషన్లు
కమాన్‌చౌరస్తా : శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, కామర్స్ కళాశాలల్లో గురువారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సూరెపల్లి సుజాత బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎంఏ ఎకనామిక్స్, సోషియాలజీ, తెలుగు, ఎంకాంలలో మిగిలన సీట్లకు ప్రవేశాలుంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులతో యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఉదయం పది గంటలకు హాజరుకావాలని సూచించారు.