నగరంలో ప్రైవేటు ఉద్యోగి చంద్రశేఖర్ తన ఇద్దరు పిల్లలను ప్రైవేటు స్కూల్‌లో చదివిస్తున్నాడు. కరోనా సెంకడ్ వేవ్ ఆర్థిక కష్టాలకు గురిచేయడంతో పూర్తిగా అప్పులపాలయ్యారు. పిల్లలను ప్రైవేటులో చదివించేందుకు ఫీజులు చెల్లించే స్థోమత లేకుండా పోయింది. దీంతో సర్కారు బడుల్లో చేర్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది ఒక చంద్రశేఖర్ పరిస్థితి కాదు..కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి ఆర్థిక కష్టాలు పడుతున్న వేలాది మంది తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: కరోనా కష్టకాలంలో సర్కారు బడులు, గురుకులాలకు అడ్మిషన్ల తాకిడి పెరుగుతోంది. ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టించిన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కలేక..ప్రైవేట్ స్కూళ్లకు ఫీజులు చెల్లించలేక చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని సర్కారు బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. ఇప్పటి వరకు పిల్లల చదువులకు ఎంతటి ఖర్చునైనా భరించేందుకు సిద్ధపడే కుటుంబాల ఆర్థిక పరిస్థితి తలకిందులు కావడంతో సర్కారు బడులవైపు దృష్టి సారిస్తున్నారు. ఒకటి నుంచి 5 వ తరగతి స్థాయి వారికి డే స్కూల్స్‌లో, 5 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు వివిధ గురు కుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా 2021–22 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల తాకిడి అధికమైంది.
సర్కారు బడుల్లో అడ్మిషన్లు సునాయాసంగా లభిస్తున్నా.. గురుకులాల్లో సీట్లకు మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. ఎస్సీ, బీసీ గురుకులాకు పెద్దగా పోటీ లేనప్పటికి మైనారిటీ గురుకులాలకు మాత్రం తాకిడి అధికంగా కనిపిస్తోంది. కార్పొరేట్ కు తలపించే విధంగా సకల సౌకర్యాలు, వసతి ఏర్పాట్లు ఉండటంతో వీటిపై మైనారిటీ కుటుంబాల ఆసక్తి పెరిగింది. అందులో కేవలం 25 శాతం సీట్ల కోసం ఇతరులకు అవకాశం ఉన్నా...దాని కోసం కూడా తీవ్రంగా పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.
టీసీల కోసం అగచాట్లు
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం పెరెంట్స్‌కు టీసీల అగచాట్లు తప్పడం లేదు. సర్కారు బడులు, గురుకులాల్లో సీట్లకు అవకాశం ఉన్నా..ప్రైవేటు విద్యా సంస్థల నుంచి టీసీలు తీసుకోవడం తలకు మించిన భారంగా తయారైంది. పెండింగ్ ఫీజులు పూర్తిగా చెల్లిస్తే తప్ప టీసీలు ఇచ్చేందుకు ప్రైవేటు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలలో టీసీలు లేకుండా విద్యార్థులను చేర్చుకునేందుకు ఆదేశాలు ఉన్నా..టీసీ తప్పనిసరి అంటూ మెలిక పెడుతుండటంతో అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న వారికి మరింత భారంగా పరిస్థితి తయారైంది.
3.27 లక్షలపైనే...
గ్రేటర్ పరిధిలోని సుమారు 2,672 ప్రభుత్వ బడుల్లో ప్రస్తుతం సుమారు 3.27 లక్షల మంది విద్య అభ్యసిస్తున్నారు. మరో 50 వేల మంది వరకు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కూడా సర్కారు బడుల్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 861 పాఠశాలల్లో 1.17 లక్షలు, మేడ్చల్‌లోని 503 పాఠశాల్లో 81 వేల మంది, రంగారెడ్డి జిల్లాలోని1308 పాఠశాలల్లో 1.26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment