స్కూల్‌ అడ్మిషన్‌కు నో ‘టీసీ’! | TC Not Required For Admission In Govt Schools At Telangana | Sakshi
Sakshi News home page

స్కూల్‌ అడ్మిషన్‌కు నో ‘టీసీ’!

Published Thu, Nov 5 2020 2:50 AM | Last Updated on Thu, Nov 5 2020 2:50 AM

TC Not Required For Admission In Govt Schools At Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై టీసీ(ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌) లేకున్నా ప్రవేశాలు పొందవచ్చు. ఐదోతరగతి లోపు ఇప్పటివరకు టీసీ లేకున్నా ప్రవేశాలకు అవకాశం ఉండగా, ఇకపై పదోతరగతి వరకు టీసీ లేకున్నా ప్రవేశాలు కల్పించేలా విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామంటూ మెలిక పెడుతుండటంతో తల్లిదం డ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులతో ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు సిద్ధమైనా టీసీ ఇవ్వాలంటే పాత ఫీజులు, ఈ విద్యా సంవత్సరపు ఫీజు చెల్లించాలంటూ యాజమాన్యాలు మెలిక పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ.. టీసీ అవసరం లేకుండానే పాఠశాలల్లో ప్రవేశానికి వీలు కల్పించాలని ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. త్వరలో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 

ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట 
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో టీసీ లేకున్నా ప్రవేశాలు కల్పిస్తుం డగా, ఉన్నత పాఠశాలల్లో మాత్రం టీసీ తప్పనిసరి నిబంధనను అమలు చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో అయితే అన్ని తరగతుల్లో టీసీ అడుగుతున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా బడులు ఇంకా ప్రారంభం కాలేదు. సెప్టెంబర్‌ 1 నుంచి సర్కారు డిజిటల్‌ పాఠాలు ప్రారంభించింది. కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి వందశాతం ట్యూషన్‌ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఫీజులు కట్టే స్తోమత లేని పేరెంట్స్‌ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు మార్చాలని భావిస్తున్నారు. ఇందుకోసం టీసీలు కావాలని సదరు ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యాన్ని కోరితే ఫీజు మొత్తం కట్టాలని దబాయిస్తుండడంతో ఆయా పిల్లల తల్లిదండ్రులకు ఎటూ పాలుపోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికా రులను ఆశ్రయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement