Engineering colleges managements
-
మనీతోనే 'మేనేజ్మెంట్'
ఎంసెట్‌లో 10 వేలకుపైగా ర్యాంకు వచ్చిన విద్యార్థి సీఎస్ఈ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కోర్సును రెండో శ్రేణి టాప్ కాలేజీలో చదవాలనుకున్నాడు. తండ్రితో కలిసి సదరు కాలేజీ ప్రిన్సిపాల్‌ను కలిశాడు. ఫీజు రూ.12 లక్షలు చెప్పారు. యాజమాన్యాన్ని కలుద్దామంటే అందుబాటులోకి రాలేదు. చివరకు చెప్పిన డొనేషన్ చెల్లించి ఆ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో చేరాడు. వాస్తవానికి ఆ కాలేజీ వార్షిక ఫీజు రూ.1.20 లక్షలే ఉంది. అయినా రూ.12 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి వార్షిక ఫీజు అదనం. మరో విద్యార్థినికి 25 వేలకుపైగా ర్యాంకు వచ్చింది. తన స్నేహితులు చేరిన కాలేజీలోనే తానూ చేరతానని పట్టుబట్టింది. ఆమె తండ్రి సదరు కాలేజీని సంప్రదించారు. అక్కడ వార్షిక ఫీజు రూ.90 వేలలోపే ఉండగా, యాజమాన్యం మాత్రం ఏటా రూ.2.50 లక్షలు చెల్లించాలని తెగేసి చెప్పింది. అంటే ఆ కాలేజీలో చేరాలంటే డొనేషన్ కింద రూ.6 లక్షలకుపైగా చెల్లించాలి. వార్షిక ఫీజు అదనం. వాస్తవానికి నాలుగేళ్లకు రూ.3.6 లక్షలతో పూర్తి కావాల్సిన కోర్సుకు రూ.10 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. –సాక్షి, హైదరాబాద్ ఈ ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులే కాదు.. యాజమాన్య కోటాలో సీటు కోసం ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులదీ ఇదే పరిస్థితి. తల్లిదండ్రుల ఆశలను, విద్యార్థుల ఆకాంక్షలను అడ్డుపెట్టుకొని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటా భర్తీలో దందాకు తెరతీశాయి. డొనేషన్ల పేరుతో అడ్డగోలుగా దండుకుంటున్నాయి. సీట్ల భర్తీలో పెద్ద కాలేజీలు ఒకలా, చిన్న కాలేజీలు మరోలా ఫ2‘జులుం’ సాగిస్తున్నాయి. టాప్ కాలేజీలు ఒక్కో సీటుకు లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. కొద్ది పేరున్న కాలేజీలో సీటు కావాలంటే రూ.6 లక్షలు మొదలుకొని రూ.14 లక్షల వరకు వెచి్చంచాల్సి వస్తోంది. ప్రముఖ కాలేజీలైతే గతేడాది కంటే ఈసారి మరింత అడ్డగోలుగా రేట్లను పెంచేశాయి. మంచి ర్యాంకు రాని విద్యార్థుల తల్లిదండ్రులు.. పిల్లలను మంచి కాలేజీల్లో చదివించాలన్న ఆలోచనతో అప్పుచేసి మరీ అడిగిన మొత్తం చెల్లిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆయా కాలేజీలకు చెందిన కార్యాలయాల్లో డబ్బులు చెల్లిస్తేనే సీట్లను కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆలస్యం చేస్తే ఫీజు మరింత పెరగొచ్చంటూ తల్లిదండ్రులను ఆందోళనలో పడేస్తున్నారు. కాలేజీని బట్టి వసూళ్లు రాష్ట్రంలోని 176 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 97,741 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపునిచ్చాయి. అందులో 70 శాతం కనీ్వనర్ కోటాలో 69,116 సీట్ల (యూనివర్సిటీ కాలేజీల్లోని 3,150 సీట్లు కలిపి) భర్తీకి చర్యలు చేపట్టగా, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా కింద 30 శాతం సీట్ల (28,625) భర్తీకి యాజమాన్యాలు చర్యలు చేపట్టాయి. అయితే మేనేజ్మెంట్ కోటా సీట్లలో చేరే విద్యార్థులు పేరున్న కాలేజీలనే ఎంచుకుంటారు కాబట్టి వాటికే డిమాండ్ ఉండటంతో ఇష్టారాజ్యంగా యాజమాన్యాలు డొనేషన్లను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మోస్తరు కాలేజీలోనూ కంప్యూటర్ సైన్స్ సీటుకు రూ.10 లక్షల డొనేషన్ డిమాండ్ చేస్తుండగా, టాప్ కాలేజీల్లో రూ.14 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కొత్తగా వచి్చన ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మిషన్ లర్నింగ్, డాటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు భారీగా రేట్లను పెంచి సీట్లను అమ్ముకుంటున్నారు. ఐటీ, ఈసీఈ వంటి బ్రాంచీల్లోని సీట్లను కూడా కాలేజీని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు, ఈఈఈ, సివిల్‌తో పాటు ఇతర బ్రాంచీల్లో రూ.2 లక్షలు మొదలుకొని రూ.6 లక్షల వరకు వసూలు చేస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నత విద్యామండలి చోద్యం యాజమాన్య కోటా సీట్ల భర్తీలో భాగంగా మెరిట్ విద్యార్థులకు సీట్లు వచ్చేలా చూసేందుకు కాలేజీకి వచ్చిన దరఖాస్తులను వెబ్సైట్లో పెట్టడటంతోపాటు ప్రత్యేక వెబ్‌పోర్టల్ ద్వారా ఉన్నత విద్యామండలి దరఖాస్తులను స్వీకరించాలి. వాటిని ఆయా కాలేజీలకు పంపించి మెరిట్ కలిగిన వారికి సీట్లు వచ్చేలా చూడాలి. కానీ ఉన్నత విద్యామండలి పట్టించుకున్న దాఖలాల్లేవు. కనీసం సాంకేతిక విద్యాశాఖ కూడా దీనిపై దృష్టిసారించట్లేదు. దీంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లను అమ్ముకుంటున్నాయి. మెరిట్‌కు స్థానమేదీ? వాస్తవానికి మేనేజ్మెంట్ కోటాలోని 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా భర్తీచేయాలి. మిగిలిన 15 శాతాన్ని ఎన్ఆర్ఐలకు, వారు స్పాన్సర్ చేసిన వారికివ్వాలి. మొద టి 15 శాతం సీట్లను మాత్రం మెరిట్ ఆధారంగానే ఇవ్వాలి. ఒకవేళ దరఖాస్తు చేసిన వారిలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, వారూ లేకుంటే ఇంటర్ మార్కుల ఆధారంగా ఇవ్వాలి. వచ్చిన దరఖాస్తులను కాలేజీ వెబ్సైట్లో పెట్టాలి. కానీ అది అమలు కావట్లేదు. ఏటా ఇదే పరిస్థితి ఉంటున్నా సాంకేతిక విద్యాశాఖ, ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి పట్టించుకోవట్లేదు. -
మా కాలేజీలో చేరండి..!
బాబూ.. ఏ కాలేజీలో బీటెక్ చేయాలనుకుంటున్నావు. ఎంసెట్‌లో సీటు వచ్చినా, రాకున్నా మా కాలేజీలో చేరితే అన్నీ మేమే చూసుకుంటాం. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్. వెంటనే రూ.10 వేలు చెల్లించి నీకు నచ్చిన కోర్సులో అడ్మిషన్ తీసుకో.. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థితో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ ఫోన్ సంభాషణ ఇది. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–20 పరీక్ష ఇంకా నిర్వహించలేదు. ర్యాంకులు వెలువడలేదు. ఏయే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎన్ని సీట్లున్నాయో తెలియదు. ఏ కాలేజీలో ఏ కటాఫ్ ర్యాంక్ ఉంటుందో కూడా స్పష్టత లేదు. ఇంత గందరగోళంలో ఉన్నా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్ల కోసం ప్రచారకార్యక్రమాలు మొదలుపెట్టాయి. కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీపై అడ్మిషన్ టార్గెట్లు విధిస్తున్నాయి. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధిస్తేనే వేతనాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో లెక్చరర్లు క్షేత్రస్థాయిలో అడ్మిషన్ల నిమిత్తం విద్యార్థుల కోసం వేట మొదలుపెట్టారు. అడ్వాన్స్ బుక్ చేస్తే సరి... ఎంసెట్ పరీక్ష జరగనప్పటికీ మాక్ టెస్ట్‌ల ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. ఈ క్రమంలో వచ్చే మార్కులను అంచనా వేసి ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలుంటాయనే దాన్ని సైతం అంచనా వేయొచ్చు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ముందస్తుగానే సీటు రాదని భావించి మేనేజ్మెంట్ కోటావైపు అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితిని యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మరోవైపు కాలేజీల్లో బోధన సిబ్బంది ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ కోసం ఎన్ రోల్ చేసుకున్న విద్యార్థుల వివరాలతో కూడిన జాబితాను సంపాదించి వారిని సంప్రదిస్తున్నారు. కొందరైతే నేరుగా ఇంటికి వెళ్లి మరీ విద్యార్థి తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం రూ.10 వేలు తీసుకుని రిసిప్ట్ ఇస్తున్నారు. ఒకవేళ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో కోరిన చోట సీటు వస్తే డబ్బులు తిరిగిచ్చేస్తామని, లేకుంటే తమ కాలేజీలో అడ్మిషన్ పక్కా అని హామీ ఇస్తున్నారు. గవర్నర్ ఆగ్రహం కాలేజీ యాజమాన్యాల అడ్మిషన్ల వ్యవహారంపై ఇంజనీరింగ్ కాలేజీ ఫ్యాకల్టీ అసోసియేషన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. కోవిడ్–19 తీవ్రత ఉన్నప్పటికీ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి లెక్చరర్లు విధులకు వెళ్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేఎన్టీయూహెచ్కు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాకల్టీతో అడ్మిషన్ల ప్రక్రియకు ఉసిగొల్పిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జేఎన్టీయూ తక్షణమే స్పందించి అడ్మిషన్లు, ఫ్యాకల్టీ విధులపై పలు హెచ్చరికలు జారీ చేశాయి. ఉత్తర్వులను వర్సిటీ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు, అధ్యాపకులపై ఒత్తిడి చేయొద్దు.. విద్యార్థి సాధించిన ర్యాంకు ఆధారంగా తనకు నచ్చిన కాలేజీలో అడ్మిషన్ తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. కానీ, ర్యాంకు ఏదొచ్చినా మా కాలేజీలో చేరాలని ఒత్తిడి చేయొద్దు. ఆతని కుటుంబ పరిస్థితి, ఆర్థిక నేపథ్యం ఆధారంగా కాలేజీని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఇవ్వాలి. ఫ్యాకల్టీకి అడ్మిషన్ల టార్గెట్ ఇవ్వొద్దు. వాళ్లు కేవలం పాఠ్యాంశ బోధనలోనే అనుభవం ఉంటుంది. అడ్మిషన్లు చేయించడం వాళ్లకేం తెలుసు. ఫ్యాకల్టీపై ఇలాంటి అనవసర విధులు రుద్ది వారిని ఇబ్బందులకు గురి చేయొద్దు. – దాసరి శ్రీనివాస శర్మ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టెక్నికల్ ఇన్సిస్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
వారిచ్చిందే మెరిట్
రాష్ట్రంలోని ఓ టాప్ ఇంజనీరింగ్ కాలేజీ.. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకోలేదు. అడ్డగోలుగా డొనేషన్లు వసూలు చేసి, తక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులకు సీట్లు కేటాయించింది. ఎలాంటి ర్యాంకు లేని వారికి ఇచ్చేసింది. ఈ వ్యవహారంలో ఒక్కో సీటును భారీ మొత్తానికి అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. మరో పేరున్న కాలేజీ ముందుగానే సీట్లు అమ్మేసుకుంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ సీట్లను రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కాలేజీ యాజమాన్యం తక్కువ ర్యాంకు రాని విద్యార్థులకు కూడా సీట్లు కేటాయించింది. ఇటీవల ఉన్నత విద్యా మండలి చేపట్టిన 2018–19 ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల ర్యాటిఫికేషన్లలో ఈ అంశాలు బయటపడ్డాయి. అందులో మెరిట్ కనిపించకపోవడంతో వాటిపై ఓ అధికారి ప్రశ్నిస్తే ‘మాకు వచ్చిన దరఖాస్తులు అవే. అదే మెరిట్.. ఆమోదం కోసం పంపిన ఆ జాబితాలో ఉన్న విద్యార్థులే దరఖాస్తు చేశారు. వారికే సీట్లను కేటాయించాం’అని సదరు యాజమాన్యాలు తెగేసి చెప్పాయి. సాక్షి, హైదరాబాద్: కాస్త పేరుండి.. యాజమాన్య కోటా సీట్లను అమ్ముకున్న యాజమాన్యాలన్నింటిదీ అదే తీరు. అయినా ఉన్నత విద్యా మండలికి పట్టట్లేదు. యాజమన్యాలు ఇచ్చిందే మెరిట్‌గా భావించి ఆ ప్రవేశాలకు ఆమోదముద్ర (ర్యాటిఫై) వేస్తోంది. తమ ముందు ఆన్లైన్ దరఖాస్తుల విధానం వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కొందరు సిబ్బంది ర్యాటిఫికేషన్లలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు ఉన్న అధికారాలను కూడా మండలి పక్కన పడేసి మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని యాజమాన్యాల ఇష్టారాజ్యానికి వదిలేసిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దరఖాస్తు చేసిన విద్యార్థుల సంఖ్య ఎక్కడ? రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల కోసం ఎంత మంది దరఖాస్తు చేశారన్నవిషయం ఎవరికీ తెలియదు. యాజమాన్యాలు ఎందరి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాయో.. ఎన్ని సీట్లను అమ్ముకుంటున్నాయో అంతా గోప్యమే. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో పారదర్శకత పాటించాలని హైకోర్టు స్పష్టం చేసినా ఆ దిశగా ఉన్నత విద్యా మండలి ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. దాన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని టాప్ కాలేజీ యాజమాన్యాలు 2017–18 ప్రవేశాల్లో భారీ దందాకు తెరతీశాయి. 2018–19 విద్యా సంవత్సరం ప్రవేశాల్లోనూ అదే దందాను కొనసాగించాయి. రేట్లు పెంచి మరీ కాలేజీని, కోర్సును బట్టి ఒక్కో సీటుకు రూ.4 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. కిందటేడాది మెరిట్ కాదు కదా జేఈఈ ర్యాంకు లేని వారికి, ఎంసెట్ రాయని వారికి సీట్లను కేటాయించిన కొన్ని టాప్ కాలేజీ యాజమాన్యాలు దాదాపు 500 సీట్లను అమ్ముకొని మెరిట్ ఉన్న విద్యార్థులకు అన్యాయం చేశాయి. ఆ టాప్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల కోసం ఎంత మంది విద్యార్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయన్న విషయాన్ని కూడా ఉన్నత విద్యామండలి అడగట్లేదు. విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు, వారి ర్యాంకులు తెలిస్తేనే.. యాజమాన్య కోటాలో మేనేజ్మెంట్స్ ఏ ర్యాంకుల వారికి సీట్లను కేటాయించారు.. మెరిట్‌ను అనుసరించారా.. లేదా.. అని తెలిసేది. కానీ అవేవీ పట్టించుకోకుండానే, యాజమాన్యాలను అడక్కుండానే వారు చేపట్టిన పవేశాలను ర్యాటిఫై చేస్తుండటంలో ఆంతర్యమేంటన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలేం చెబుతున్నాయి.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని మొత్తం సీట్లలో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. ఈ విద్యా సంవత్సరంలో 92,184 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అందులో మైనారిటీ కాలేజీలు, కాలేజీల కన్సార్షియం ద్వారా సొంతంగా భర్తీ చేసుకునే సీట్లు పోగా, 87,900 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 70 శాతం కన్వీనర్ కోటాలో 61,511 (యూనివర్సిటీ కాలేజీల్లోని 3055 సీట్లు కాకుండా) సీట్లను భర్తీ చేశారు. మిగతా 30 శాతం సీట్లను (26,389) యాజమాన్యాలు భర్తీ చేశాయి. అయితే ఇందులో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలి. మిగిలిన 15 శాతాన్ని ఎన్ఆర్ఐలకు, వారు స్పాన్సర్ చేసిన వారికి ఇవ్వాలి. మొదటి 15 శాతం సీట్లను మాత్రం మెరిట్ ఆధారంగానే ఇవ్వాలి. దరఖాస్తు చేసిన వారిలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, వారూ లేకుంటే ఇంటర్ మార్కుల ఆధారంగా ఇవ్వాలి. కానీ మంచి ర్యాంకులు రాకపోయినా, ఎంసెట్ ర్యాంకు కూడా లేకపోయినా కొన్ని టాప్ కాలేజీలు సీట్లను కేటాయించాయి. ఆన్లైన్లో దరఖాస్తు విధానం ఉన్నా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు యాజమాన్య కోటా సీట్ల భర్తీలో పారదర్శకత పాటించాలి. కాలేజీకి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరచాలి. వీలైతే ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోనే వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలి. వాటిని ఆయా కాలేజీలకు పంపి మెరిట్ ఉన్న వారికి సీట్లు వచ్చేలా చూడాలి. ఆఫ్‌లైన్‌లో, ఆన్లైన్లో కాలేజీలకు వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలి. కానీ ఆ దిశగా ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. సాధారణంగా టాప్ కాలేజీల్లో మొదటి 5 వేలలోపు ఎంసెట్ ర్యాంకు ఉన్న విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు లభిస్తాయి. ఇక మేనేజ్మెంట్ కోటాలో మాత్రం జేఈఈ ర్యాంకులు ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకర్లకు సీట్లను కేటాయించాలి. అయితే ఎంసెట్ టాప్ 10 వేల ర్యాంకు వరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. కానీ ఆ ర్యాంకు కలిగిన విద్యార్థులకు మేనేజ్మెంట్ కోటాలో సీట్లు లభించడం తక్కువే. అదీ కాలేజీలు అడిగే డొనేషన్లు చెల్లించిన వారికే సీట్లు కేటాయిస్తారు తప్ప ఇతర మెరిట్ విద్యార్థులకు ఇవ్వరని ఓ ఉన్నతాధికారి పేర్కొనడం గమనార్హం. -
ఈసారి మిగిలేవెన్నో?
* ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల్లో ‘గుర్తింపు’ గుబులు * 237 కాలేజీల విజ్ఞప్తుల మేరకు పునః పరిశీలన * ఈనెల 28న సాయంత్రానికి సీట్లు,కాలేజీలపై స్పష్టత * ఆ తరువాతే విద్యార్థులకు వెబ్ ఆప్షన్లకు అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల్లో గుబులు మొదలైంది. 2015-16లో ప్రవేశాలు చేపట్టేందుకు ఎన్ని కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభిస్తుంది, ఎన్ని కాలేజీలను పక్కన పెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో మొత్తంగా 288 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా గతేడాది 145 కాలేజీలకే గుర్తింపు ఇచ్చిన హైదరాబాద్ జేఎన్టీయూ.. వివిధ లోపాల కారణంగా 143 కాలేజీలను నిరాకరించింది. ఆ కాలేజీలు సుప్రీంకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నా.. మరోసారి చేసిన తనిఖీలోనూ లోపాలు బయటపడడంతో మిన్నకుండిపోయాయి. ఈసారి వాటిలోని పలు కాలేజీలు లోపాలను సరిదిద్దుకున్నాయి. అయితే ఈసారి దాదాపు 150 కాలేజీలు, లక్ష సీట్లకే గుర్తింపును పరిమితం చేస్తారన్న ఊహాగానాలతో యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఏదో ఒక లోపం.. జేఎన్టీయూహెచ్ తమ పరిధిలోని 237 కాలేజీల్లోని లోపాలను ఎత్తిచూపుతూ, రెండు రోజుల్లో వాటిని సవరించుకోవాలంటూ ఈనెల 9న నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన పలు కాలేజీలు.. గతేడాది చూపిన లోపాలను సవరించుకున్నామని, ఇప్పుడు మళ్లీ లోపాలు ఉన్నాయని, అదీ రెండు రోజుల్లో సవరించుకోవాలని అంటే ఎలాగంటూ కోర్టును ఆశ్రయించాయి. దీంతో కోర్టు యాజమాన్యాలకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. కాలేజీలు నోటీసులపై ఈనెల 20 నాటికి జేఎన్టీయూకు అప్పీలు చేసుకోవాలని.. జేఎన్టీయూ వాటిపై ఈనెల 28 నాటికి పరిశీలన జరిపి పరిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కాలేజీల నుంచి శనివారం వరకు అప్పీళ్లు స్వీకరించిన జేఎన్టీయూహెచ్.. సోమవారం నుంచి పరిశీలన జరపనుంది, ఆయా లోపాలపై ఏం సమాధానం ఇచ్చారు, ఏయే చర్యలు చేపట్టినట్లుగా వెల్లడించారన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా కాలేజీల్లో మళ్లీ పరిశీలన జరుపనుంది. ఈ ప్రక్రియను ఈనెల 28 నాటికి పూర్తి చేసి.. అనుబంధ గుర్తింపు లభించే కాలేజీలు, సీట్ల వివరాలను వెల్లడించనుంది. ఆ తర్వాత ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇప్పటికే 51 కాలేజీలు మూత జేఎన్టీయూహెచ్ పరిధిలో 288 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా ఈసారి గుర్తింపు కోసం 237 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. ఈ లెక్కన 51 కాలేజీలు మూతపడి, వాటిలోని దాదాపు 30 వేల సీట్లు ఈసారికి లేనట్లే. ఇక ఈనెల 28 వరకు చేపట్టనున్న పునః పరిశీలనలో ఎన్ని కాలేజీల్లో లోపాలు బయట పడతాయి, ఎన్నింటికి గుర్తింపు రద్దుచేస్తారు, ఎన్నింటిలో బ్రాంచీలను రద్దు చేస్తారన్న విషయంపై యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యాచరణపై ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆదివారం సమావేశమై చర్చించాయి. విద్యార్థులూ తక్కువే! ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1.28 లక్షల మంది హాజరుకాగా.. అందులో 90,556 మందే అర్హత సాధించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆదివారం వరకు 60 వేల ర్యాంకు వరకు పిలవగా.. 45 వేల మందే హాజరయ్యా రు. ఇంకా 2 రోజులు వెరిఫికేషన్ గడువు ఉన్నందున మరో 15 వేల విద్యార్థులు రావొచ్చని అధికారులు భావి స్తున్నారు. ఈ లెక్కన ఈసారి 60 వేల నుంచి 65 వేల మంది మాత్రమే చేరే పరిస్థితి కనిపిస్తోంది.