ఈసారి మిగిలేవెన్నో? | 237 colleges under the review of appeals | Sakshi
Sakshi News home page

ఈసారి మిగిలేవెన్నో?

Published Mon, Jun 22 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

ఈసారి మిగిలేవెన్నో?

ఈసారి మిగిలేవెన్నో?

* ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల్లో ‘గుర్తింపు’ గుబులు
* 237 కాలేజీల విజ్ఞప్తుల మేరకు పునః పరిశీలన
* ఈనెల 28న సాయంత్రానికి సీట్లు,కాలేజీలపై స్పష్టత
* ఆ తరువాతే విద్యార్థులకు వెబ్ ఆప్షన్లకు అవకాశం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల్లో గుబులు మొదలైంది. 2015-16లో ప్రవేశాలు చేపట్టేందుకు ఎన్ని కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభిస్తుంది, ఎన్ని కాలేజీలను పక్కన పెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

రాష్ట్రంలో మొత్తంగా 288 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా గతేడాది 145 కాలేజీలకే గుర్తింపు ఇచ్చిన హైదరాబాద్ జేఎన్టీయూ.. వివిధ లోపాల కారణంగా 143 కాలేజీలను నిరాకరించింది. ఆ కాలేజీలు సుప్రీంకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నా.. మరోసారి చేసిన తనిఖీలోనూ లోపాలు బయటపడడంతో మిన్నకుండిపోయాయి. ఈసారి వాటిలోని పలు కాలేజీలు లోపాలను సరిదిద్దుకున్నాయి. అయితే ఈసారి దాదాపు 150 కాలేజీలు, లక్ష సీట్లకే గుర్తింపును పరిమితం చేస్తారన్న ఊహాగానాలతో యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.
 
ఏదో ఒక లోపం..

జేఎన్టీయూహెచ్ తమ పరిధిలోని 237 కాలేజీల్లోని లోపాలను ఎత్తిచూపుతూ, రెండు రోజుల్లో వాటిని సవరించుకోవాలంటూ ఈనెల 9న నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన పలు కాలేజీలు.. గతేడాది చూపిన లోపాలను సవరించుకున్నామని, ఇప్పుడు మళ్లీ లోపాలు ఉన్నాయని, అదీ రెండు రోజుల్లో సవరించుకోవాలని అంటే ఎలాగంటూ కోర్టును ఆశ్రయించాయి. దీంతో కోర్టు యాజమాన్యాలకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది.

కాలేజీలు నోటీసులపై ఈనెల 20 నాటికి జేఎన్టీయూకు అప్పీలు చేసుకోవాలని.. జేఎన్టీయూ వాటిపై ఈనెల 28 నాటికి పరిశీలన జరిపి పరిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కాలేజీల నుంచి శనివారం వరకు అప్పీళ్లు స్వీకరించిన జేఎన్టీయూహెచ్.. సోమవారం నుంచి పరిశీలన జరపనుంది, ఆయా లోపాలపై ఏం సమాధానం ఇచ్చారు, ఏయే చర్యలు చేపట్టినట్లుగా వెల్లడించారన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా కాలేజీల్లో మళ్లీ పరిశీలన జరుపనుంది. ఈ ప్రక్రియను ఈనెల 28 నాటికి పూర్తి చేసి.. అనుబంధ గుర్తింపు లభించే కాలేజీలు, సీట్ల వివరాలను వెల్లడించనుంది. ఆ తర్వాత ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు.
 
ఇప్పటికే 51 కాలేజీలు మూత
జేఎన్టీయూహెచ్ పరిధిలో 288 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా ఈసారి గుర్తింపు కోసం 237 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. ఈ లెక్కన 51 కాలేజీలు మూతపడి, వాటిలోని దాదాపు 30 వేల సీట్లు ఈసారికి లేనట్లే. ఇక ఈనెల 28 వరకు చేపట్టనున్న పునః పరిశీలనలో ఎన్ని కాలేజీల్లో లోపాలు బయట పడతాయి, ఎన్నింటికి గుర్తింపు రద్దుచేస్తారు, ఎన్నింటిలో బ్రాంచీలను రద్దు చేస్తారన్న విషయంపై యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యాచరణపై ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆదివారం సమావేశమై చర్చించాయి.
 
విద్యార్థులూ తక్కువే!
ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1.28 లక్షల మంది హాజరుకాగా.. అందులో 90,556 మందే అర్హత సాధించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆదివారం వరకు 60 వేల ర్యాంకు వరకు పిలవగా.. 45 వేల మందే హాజరయ్యా రు. ఇంకా 2 రోజులు వెరిఫికేషన్ గడువు ఉన్నందున మరో 15 వేల విద్యార్థులు రావొచ్చని అధికారులు భావి స్తున్నారు. ఈ లెక్కన ఈసారి 60 వేల నుంచి 65 వేల మంది మాత్రమే చేరే పరిస్థితి కనిపిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement