![Mancherial Crime: Mystery Illness Kota Harika Commits Suicide - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/5/Mancherial-Crime.jpg.webp?itok=I1wYwzSF)
మంచిర్యాల రూరల్(హాజీపూర్): మాయదారి జబ్బు.. నిండు నూరేళ్లు బతకాల్సిన ఒక అమ్మాయి జీవితాన్ని బలిగొంది. అదేం జబ్బో అర్థంకానీ తల్లిదండ్రులు.. ఎంతకీ తగ్గదేమో అనే దిగులుతో.. ఆ కుటుంబం వేదనకు గురైంది. మానసికంగా కుంగిపోయిన ఆ టీనేజర్ చివరకు ప్రాణం తీసుకుంది.
హాజీపూర్ మండలంలోని దొనబండలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రచన, సత్తయ్య దంపతుల కుమార్తె కోట హారిక (19). మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో హారిక డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
తల్లిదండ్రులు పలు ఆస్పత్రులు తిరిగినా.. చికిత్స కోసం ఎంత ఖర్చు చేసినా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హారిక బాబాయ్ కోట స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.
మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. సమస్యలొస్తే ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలి. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment