సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బాధితుల్లో చాలామంది మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. భయం, ఆందోళన, ఒత్తిడి, నిరాశ వం టి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ విషయం లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీనికి బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయి. గత ఆరున్నర నెలల్లో 67,780 ఫోన్ కాల్స్ దీనికి సంబంధించినవే ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు కరోనాకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక తయారు చేసింది.
కోవిడ్‌తో బాధపడుతున్న రోగులకు మానసిక స్వస్థతను చేకూర్చడానికి టోల్ ఫ్రీ నంబర్ 1800–599–4455ను ఏర్పాటు చేసింది. బాధితులకు అవసరమైన మానసిక ప్రశాంతతను కల్పించడానికి అన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో సైకియాట్రిస్టులను అందుబాటులో ఉంచింది. ఇదిలావుండగా అన్ని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులలో 50 ఉచిత పార్థీవ వాహనాలను ఏర్పాటు చేశారు. మృతదేహాలను తరలించడానికి వీటిని ఉపయోగిస్తున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులపై 1,409 ఫిర్యాదులు
కరోనా నేపథ్యంలో అనేక ప్రైవేట్ ఆస్పత్రులు పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్న సంగతి తెలిసిం దే. అధిక ఫీజులను నియంత్రించేందుకు, బాధితు ల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు ప్రభుత్వం ఒక వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఆ నంబర్‌కు ఇప్పటివరకు 334 ప్రైవేట్ ఆస్పత్రుల నుండి 1,409 ఫిర్యాదులు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వాటిలో 1,261 పరిష్కరించగా, ఇంకా 148 పురోగతిలో ఉన్నాయి. ఫిర్యాదులు వచ్చిన వాటిలో 276 అధిక ఫీజులకు సంబంధించినవి కాగా, 154 పరిష్కరించినట్లు తెలిపింది. కోవిడ్ భద్రతా ప్రోటోకాల్స్, పారిశుధ్యం, బీమా కవరేజీ, ప్రైవేట్ లేబొరేటరీల్లో అదనపు ఫీజులు వంటి ఫిర్యాదులు కూడా వచ్చాయి.
కరోనా పరీక్షల్లో ఐదు శాతం మందికి పాజిటివ్
రాష్ట్రంలో నిర్వహించిన కరోనా టెస్టుల్లో 5 శాతం మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలో 18 పాజిటివ్ రేటు ఉండగా, కర్ణాటకలో 10%, ఢిల్లీలో 8%, తమిళనాడులో 7% నమోదవుతున్నాయి. ఇక పాజిటివ్ కేసులు నమోదైన వాటిల్లో 0.47 శాతం మంది తెలంగాణలో మరణించినట్లు నివేదిక తెలిపింది. చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో మహారాష్ట్రలో 2.42%, కర్ణాటకలో 1.33%, ఢిల్లీలో 1.22%, తమిళనాడులో 1.01% కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఇక కరోనా టెస్టులను మరింత పెంచేందుకు 300 సంచార కోవిడ్ టెస్టింగ్ లేబొరేటరీలను జిల్లాల్లో ఏర్పాటు చేశారు. అపోలో, బసవతారకం ఆస్పత్రులు కోవిడ్‌కు సంబంధించి ఉచిత చికిత్సలు చేసిన విషయాన్ని ప్రస్తావించింది.
అపోలో ఆస్పత్రి అక్టోబర్ వరకు 2,073 మందికి కరోనా చికిత్స చేయగా, అందులో 219 మంది రోగులకు ఉచితంగా చికిత్స చేసినట్లు సర్కారు తెలిపింది. ఇక ప్రభుత్వ సెలవు దినాలు, ఆదివారాలు, పండుగ రోజుల్లో కరోనా నిర్దారణ పరీక్షలు తగ్గుతున్నాయని ఎక్కువ మంది ప్రజలు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం వెచ్చించడం వల్లే టెస్టులకు రావడంలేదని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
వివిధ నెలల్లో మానసిక ఆరోగ్యంపై వచ్చిన ఫోన్ కాల్స్
జూన్ : 2,963
జూలై : 23,716
ఆగస్టు : 14,393
సెప్టెంబర్ : 14,587
అక్టోబర్ : 8,316
నవంబర్ : 3,805
Comments
Please login to add a commentAdd a comment