సాక్షి, హైదరాబాద్: పట్టణాల నుంచి గ్రామాలకు చేరుకున్న వారంతా నీళ్లు పడక జ్వరాల పాలవుతున్నారు. చాలామంది కూలీలు, చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు పట్టణాల్లో సరైన ఉపాధి లేక, ఇంటి అద్దెలు కట్టలేక సొంత ఊళ్లో కలో, గంజో తాగి బతుకుదామని గ్రామాలకు చేరుకున్నారు. అయితే, వారిని అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులతో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో అది కరోనా అనే ఆం దోళన చెందుతున్నారు.
నీళ్లు పడకపోవడంతో సమస్యలు: పట్నాల్లో ఉన్నప్పుడు సురక్షితమైన నీరు అందుబాటులో ఉండడంతోపాటు మినరల్, ఫిల్టర్ వాటర్ వాడి న జనం పల్లెలకు వెళ్లిన తర్వాత అందుబాటులో ఉన్న నీటికి వెంటనే అలవాటు పడలేకపోతున్నారు. దీంతో గొంతు నొప్పి, జలుబు, జ్వరాలు పీడిస్తున్నాయి. గతంలో పండగకో, పబ్బానికో ఊళ్లకు వెళ్లినా మహా అయితే రెండు, మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండేవారు కాదు. ఆ పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు ఏకంగా నెలలు తరబడి ఉండాల్సి వస్తోంది. దీంతో అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలవుతున్నారు.
బయటకు చెప్పుకోలేక..: జ్వరం, గొంతునొప్పి లాంటి సమస్యలకు డాక్టర్ల సలహా ప్రకారం ఇంట్లోనే మందులు తీసుకుంటున్నవారు పక్కింటివారికి కూడా తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. జ్వరమొచ్చిందని తెలిస్తే ఎక్కడ వెలివేసినట్టు చూస్తారో లేక ఊళ్లో నుంచి వెళ్లిపొమ్మంటారేమోనన్న భయంతో ఇంటి నుంచి బయటకు రాకుండా గడుపుతున్నారు. కరోనా టెస్టులు చేయించుకోడానికి భయపడుతున్నారు.
‘గత పదేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నా. రోజూ లేబర్ అడ్డాల వద్ద దాదాపు 20 నుంచి 25 మంది ఉంటాం. అయితే కరోనా తగ్గుతుందేమోనని మూడు నెలలు ఎదురుచూసి ఈ మధ్యే మా సొంత ఊరికి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చినంక నీళ్లు, వాతావరణం పడక జ్వరం వచ్చింది. బయటకు ఎళ్లలేక, ఇంట్లనే ఉంటూ మందులు మింగుతున్న’ – మహబూబ్ నగర్‌కు చెందిన మాసన్న
మినరల్ వాటర్ మేలు..
పల్లెలకు వెళ్లినప్పుడు కొద్ది రోజులపాటు మినరల్ వాటర్ వాడటం మేలు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. జ్వరం, గొంతు నొప్పి లాంటి లక్షణాలుంటే అశ్రద్ధ చేయకుండా కరోనా పరీక్ష చేయించుకోవాలి. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment