సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ నగర శివారు దేవరయాంజాల్‌లోని శ్రీసీతారామచంద్ర స్వా మి ఆలయ భూములపై కన్నేసిన కబ్జాదారులు స్వామివారి రకరకాల పేర్లతో ఆక్రమణలకు పాల్పడ్డారు. ఇది పురాతన ఆలయం. నిజాం పాలన సమయంలోనే ఓ భక్తుడు ఈ ఆలయానికి 1,531 ఎకరాల భూమిని ఇనామ్‌గా ఇచ్చా రు. ఆ భూములను ఆలయ భూమిగా రికార్డుల్లో చేర్చారు. ఇప్పటివరకు కచ్చితమైన భూ రికార్డులుగా చెప్పుకొనే 1924–25 రెవెన్యూ రికార్డుల్లో.. ఈ 1,531 ఎకరాల భూమి సీతారామచంద్రస్వామి ఆలయం పేరిట ఉన్నట్లు తెలుస్తోంది.
కానీ తర్వాత చాలావరకు కబ్జాలకు గురైంది. భూమి యజమానిగా ఉన్న శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం పేరు కాస్తా.. సీతారామారావుగా, సీతారామయ్యగా, సీతారామరెడ్డిగా, సీతారాములుగా.. రకరకాల పేర్లతో మారి చివరికి కబ్జాదారుల పేర్లు రికార్డుల్లోకెక్కాయి. ప్రస్తుతం ఆ భూముల్లో గోదాములు, రిసార్టులు, పరిశ్రమలు, నివాసాలు, వాణిజ్య సముదాయాలు, ఫంక్షన్ హాళ్ళు వెలిశాయి.
ప్రతి నెలా రూ.లక్షల్లో అద్దె
ప్రస్తుతం ఈ ఆలయ భూములను తమ అధీనంలో ఉంచుకున్న వారి నుంచి ప్రతినెలా రూ.లక్షలు అద్దె/లీజు పేరిట వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఒక బృందం పనిచేస్తోందని.. ఆ సొమ్మును నేతలు, అధికారులు పంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆక్రమణకు గురైన భూములను శాశ్వతంగా కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లోకాయుక్తలో నమోదైన కేసు, దానికి సమాధానంగా దేవాదాయ శాఖ కమిషనర్ స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్‌తో ఈ భూముల బాగోతం కళ్లకు కడుతోంది.
174 ఎకరాల్లో 115 గోదాములు
దేవరయాంజాల్ దేవాలయ భూములను ఆక్రమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో రాజకీయ పలుకుబడి కలిగిన కొందరు ప్రముఖ వ్యక్తులతో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీనామీలతో పాటు అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా బీనామీ పేర్లతో భూములను ఆక్రమించినట్లు తెలుస్తున్నది.1,531 ఎకరాల దేవాలయ భూముల్లో 389.12 ఎకరాలను పలుకుబడి ఉన్న వ్యక్తులు ఆక్రమించినట్లు ఆరోపణలు ఉండగా, ఇందులో 174.16 ఎకరాల భూముల్లో 2007 నుంచి 2016 వరకు దాదాపు 35 మంది వ్యక్తులు గోదాములు, ఫంక్షన్ హాళ్లు, కమర్షియల్ షెడ్లు ఇలా దాదాపు 115 వరకు నిర్మాణాలు చేపట్టారు. వీటిని అద్దె లేదా లీజుకు ఇచ్చి రూ.లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ భూముల్లోనే 130 ఎకరాల్లో హకీంపేట ఎయిర్‌బేస్ ఉంది. 800 ఎకరాలు వ్యవసాయ భూమిగా ఉంది. ఇక ఇప్పటికీ ఎలాంటి నిర్మాణాలు లేని భూములు దాదాపు 800 ఎకరాల వరకు ఉన్నాయి. వీటిని తిరిగి దేవాలయం అధీనంలోకి తెచ్చి.. వాటి నుంచి ఆదాయం పొందే వీలున్నా దేవాదాయ శాఖ అందుకు సిద్ధపడకపోవడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
స్వాధీనానికి అవకాశం ఉన్నా..
సాధారణంగా దేవాలయ భూములను అమ్మేందుకు వీలు లేదు. 1924–25 రికార్డుల ప్రకారం అవి స్పష్టంగా దేవుడి భూములే. అంటే చట్టపరంగా ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు అవకాశముంది. అయినా నేతల జోక్యం, అవినీతి అధికారుల కారణంగా ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదనే ఆరోపణలున్నాయి. దేవదాయశాఖ చట్టం సెక్షన్Œ –83 ప్రకారం ‘యూజ్ అండ్ ఆక్యుపేషన్‌న్ చార్జీల’వసూలుకు కేసులు దాఖలు చేయవచ్చు. దీనితో ఆ భూముల యాజమాన్య వివాదం తేలేవరకు వాటిని అనుభవిస్తున్న ‘కబ్జాదారులు’మార్కెట్ విలువ మేరకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరగడం లేదు.
కబ్జాదారులకే భూములు!
ఈ భూములను ‘కబ్జా’లో ఉన్న వారికే ఇచ్చి డబ్బులు వసూలు చేయాలంటూ కొంతకాలం కిందట దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకున్పట్లు తెలుస్తోంది. కానీ ఈ భూముల వ్యవహారంపై ఏర్పాటైన జస్టిస్ వెంకటరామిరెడ్డి కమిషన్ ఈ వ్యవహారంలో అక్రమాలను నిగ్గుతేల్చి, దేవదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో నివేదిక సమర్పించినట్లు సమాచారం. విజిలెన్స్, ఏసీబీ విచారణలు కూడా నాటి దేవదాయ కమిషనర్ , ముఖ్య కార్యదర్శి, సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్‌లను బాధ్యులను చేస్తూ చర్యలకు సిఫారసు చేసినట్లు సమాచారం. కానీ వీరిలో ఎవరిపైనా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. పైగా క్లీన్‌చిట్ ఇవ్వటమే కాకుండా పదవీ విరమణ చేసిన వారు మినహా మిగతావారికి పదోన్నతులు కూడా కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి.
చదవండి: ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
Comments
Please login to add a commentAdd a comment