అన్నోజిగూడలో ఏర్పాటైన ఓ స్విమ్మింగ్ పూల్, ఇటీవల మృతి చెందిన విద్యార్థి పారికర్
సాక్షి, హైదరాబాద్(పోచారం): వేసవి కాలంలో పిల్లల కేరింతలతో స్విమ్మింగ్ పూల్స్ సందడిగా ఉంటాయి. నీళ్లలో ఈత కొట్టేందుకు పిల్లలు ఉరకలు వేస్తారు. పూల్‌లో కూల్ అవుతూ వేసవి తాపం నుంచి తప్పించుకుంటున్నారు. కానీ, పోచారం మున్సిపాలిటీలోని స్విమ్మింగ్ పూల్స్ వద్ద భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో చిన్నారులు తనువు చాలించిన సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి.
కొరవడిన అధికారిక పర్యవేక్షణ..
స్విమ్మింగ్ పూల్స్‌పై అధికారిక పర్యవేక్షణ లోపించడంతో నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. నిర్వాహకుల దయాదాక్షిణ్యాలపైనే స్విమ్మర్లు ఆధారపడాల్సి వస్తోంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలు మినహా నిర్వాహకులకు వేరే ఎలాంటి గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం జారీ చేయకపోవడంతో స్విమ్మింగ్ నేర్చుకునే వారికి వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
స్విమ్మింగ్ పూల్స్ గణాంకాలు..
స్విమ్మింగ్ పూల్స్‌కు సంబంధించిన గణాంకాలు పోచారం మున్సిపల్ అధికారుల వద్ద లేవు. వీటిలో ఎలాంటి సదుపాయాలున్నాయో వీరు పరిశీలించరు. లైఫ్ గార్డులు, నీటి లోతు, తరచు నీటి మార్పిడి, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు వంటి అంశాలను గాలికి వదిలేస్తున్నారు. కోచ్‌లు అందుబాటులో ఉండటం లేదు. ఇవన్నీ స్విమ్మింగ్ పూల్స్ వద్ద భద్రత లోపించిందనడానికి నిలువెత్తు నిదర్శనాలు.
ఇటీవల బాలుడి మృతి..
ఇటీవల అన్నోజిగూడలోని స్విమ్మింగ్ పూల్‌లో 16 ఏళ్ల విద్యార్థి పూజారి పారికర్ మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందే.
జిల్లా వ్యాప్తంగా 50కు పైగానే..
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గేటెడ్ కమ్యూనిటీలను కలుపుకొని గణాంకాలు తీస్తే సుమారు 50కు పైగానే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయని అంచనా వేశారు. వీటిలో నిబంధనల ప్రకారం నిర్మితమైనవి పది కంటే మించవు. నీటి కొరత, ఇతరత్రా కారణాల వల్ల మరో 15 స్విమ్మింగ్ పూల్స్ మూతపడినట్లు తెలిసింది.
పిల్లలకు ఇవి ఇవ్వడం మర్చిపోవద్దు..
స్విమ్మింగ్ పూల్‌లోకి దిగే ముందు పిల్లలకు కంటి అద్దాలు, చెవి ప్లగ్‌లు, ఫ్లోటర్లు, టవర్లు వంటి భద్రతా పరికరాలు ఇవ్వడం గుర్తుంచుకోవాలి. వీటితో నిర్భయంగా ఈత నేర్చుకోవచ్చు. అప్పుడే పిల్లలు సురక్షితంగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment