
సంతోష్‌నగర్‌కు చెందిన నాగరాజు ఇటీవల మీ సేవ కేంద్రం ద్వారా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అది తెలిసిన ఇద్దరు దళారులు నాగరాజును సంప్రదించి..‘వయసు సడలించడంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్కారు స్క్రూట్నీని కఠినంగా ఉంటుంది. అర్హత సాధించడం కష్టం. మీసేవలో సమర్పించిన దరఖాస్తు కాపీ మాకిస్తే తహసీల్ ఆఫీస్‌లో పైరవీ చేసి ముందుగానే మార్గం సుగమం చేస్తాం. ఇందుకు కొంత ఖర్చవుతుంది. ముందుగా రూ.వెయ్యి ఇవ్వండి. మంజూరైనంక రెండు నెలల పింఛన్ ఇవ్వాలి’ అని మౌఖిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా నగరంలో దళారులు పింఛన్ అర్హులను బుట్టలో వేసుకుని దండుకుంటున్నారు.
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఆసరా కొత్త పింఛన్ల దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. కొందరు చోటా నేతలు, గల్లీ లీడర్లు, నిరుద్యోగులు దళారులుగా అవతారమెత్తి దరఖాస్తుదారుల అమాయకత్వం, అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. మీ–సేవ కేంద్రాల ద్వారా వృద్ధాప్య పించన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను తెలుసుకొని గాలం వేస్తున్నారు. కొందరు దరఖాస్తుదారులను స్వయంగా కలుస్తుండగా, మరి కొందరు ఫోన్ల ద్వారా సంప్రదించి ‘అన్నీ మేమే చూసుకుంటాం’ అని భరోసా ఇస్తున్నారు. కొంత నగదు లంచంగా ఇవ్వాలని చెబుతున్నారు. కేవలం దరఖాస్తు మాత్రమే చేస్తే సరిపోదని, పోటీ చాలా ఉందని చెబుతున్నారు. దరఖాస్తుదారులు సైతం పింఛను మంజూరు కాదేమోనన్న భయంతో దళారుల మాటల్ని నమ్మి వారు అడిగినంత ముట్టచెబుతున్నారని తెలుస్తోంది.
దండిగా దరఖాస్తులు
ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్ల వయసును 60 ఏళ్ల నుంచి సడలించడంతో మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దండిగా దరఖాస్తులు నమోదయ్యాయి. 57 ఏళ్లు దాటిన వారు పోటీపడి మరి దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటి వరకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోని పండుటాకులు సైతం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల నమోదు ఉచితం కావడంతో నిరుపేదలు (బీపీఎల్) తోపాటు మద్య, సంపన్న(ఏపీఎల్) వర్గాలు సైతం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్–రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల్లో కలిపి సుమారు రెండు లక్షలకు పైగా దరఖాస్తులు నమోదైనట్లు ఆన్‌లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా ఆసరా పింఛన్లకు ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించలేదు. తహాసీల్ ఆఫీసుల్లో దరఖాస్తు సమరి్పస్తే విచారణ జరిపి మంజూరు చేసేవారు. తాజాగా వయసు సడలించడంతో ఆన్‌లైన్ ద్వారా స్వీకరించగా కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి.
స్పష్టత ఏదీ?
ఆసరా దరఖాస్తులపై స్పష్టత లేకుండా పోయింది. దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు, చిరునామా గుర్తింపు, ఓటరు ఐడీ, బ్యాంక్ పాస్ బుక్ వివరాల నమోదుతోపాటు వాటి ప్రతులను సమర్పించాలన్నారు. కానీ ఎక్కడ సమర్పించాలో పేర్కొనలేదు. దీంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. తహసీల్ ఆఫీస్‌కు వెళ్తే అక్కడ తీసుకోవడం లేదు. మీ సేవ కేంద్రాల్లోనూ జిరాక్స్ ప్రతులు తీసుకోవడం లేదు. ఈ అంశం కూడా దళారులకు కలిసి వస్తోంది. ఆ ప్రతులను దళారులు తీసుకొని దరఖాస్తుదారుల్లో ఆశలు నింపుతున్నారు. పింఛన్ల మంజూరుపై క్షేత్ర స్థాయి విచారణ కఠినంగా ఉంటుందని భయపెడుతూ దండుకుంటున్నారని విమర్శలు విన్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment