గ్రూప్ లీడర్ భర్తను చెట్టుకు కట్టేసిన సభ్యులు
మరో ఘటనలో ఇంటిని వేలం వేసిన మహిళా సంఘం
తూప్రాన్/రుద్రూర్: దాచుకున్న పొదుపు సొమ్మును పక్కదారి పట్టించి, సొంతానికి వాడుకోవడంతో సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ ఘటనలో గ్రూప్ లీడర్ భర్తను చెట్టుకు కట్టేయగా, మరో ఘటనలో ఏకంగా ఆ మహిళ ఇంటిని వేలం వేశారు. వివరాలు.. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పడాల్‌పల్లి ఎస్పీ కాలనీకి చెందిన పదిమంది అంబేడ్కర్ సంఘం పేరుతో డ్వాక్రా గ్రూపు కొనసాగిస్తున్నారు. ఎస్‌బీఐ బ్యాంకులో రూ.10 లక్షలను సభ్యులు రుణంగా తీసుకున్నారు. గ్రూపు సభ్యులు సంఘం లీడర్ మున్నీకి రూ. 40 వేలు చెల్లిస్తున్నారు.
ఆ డబ్బులు గ్రూపు పేరుమీద బ్యాంకుకు జమ చేయాల్సి ఉంది. కానీ 11 నెలలుగా మున్నీని భర్త భిక్షపతి బెదిరించి తన సొంతానికి ఆ డబ్బులు వాడుకుంటున్నాడు. దీంతో బ్యాంకు అధికారులు సభ్యుల రూ. 67 వేలు పొదుపు డబ్బులను రుణం కింద జమ చేసుకున్నారు.లోన్ చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు రూ. 1.55 లక్షలను సభ్యులపై భారం మోపారు. దీంతో లీడర్ మున్నీ, భర్త భిక్షపతి మొత్తం రూ.7 లక్షలకు పైగా కాజేసినట్లు సభ్యులకు తెలిసింది.
ఈ విషయమై మున్నీని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పింది. పెద్దల సమక్షంలో ఈనెల 1న పంచాయితీ నిర్వహించారు. అయితే భార్యను చంపివేస్తే డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదని అందరి సమక్షంలోనే మద్యం మత్తులో ఉన్న భిక్షపతి భార్యను చంపేందుకు వెంటపడ్డాడు. అక్కడే ఉన్న గ్రూపు సభ్యులు భర్తను చెట్టుకు కట్టేసి భార్యను పక్కింట్లో దాచిపెట్టారు. కాగా, ఈ ఘటనలో నిందితులు, బాధితులు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం గమనార్హం.
∙నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూర్ గ్రామంలోని ఒక బ్యాంకుకు చెందిన కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకురాలి ఇంటిని బుధవారం వేలం వేశారు. సీఎస్పీ సెంటర్ నిర్వహించే సంధ్య.. పొదుపు సంఘాల ద్వారా మహిళలు సేకరించిన డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా సుమారు రూ.40 లక్షలు సొంతానికి వాడుకుంది. ఇటీవల ఈ విషయాన్ని గుర్తించిన బాధిత మహిళలు నిర్వాహకురాలిని నిలదీయడంతో కొంత గడువు కావాలని కోరింది.
అయితే గడువు ముగిసినా డబ్బులు చెల్లించకపోవడంతో సీఎస్పీ ఇంటిని బుధవారం స్థానికుల సహకారంతో మహిళా సంఘాల సభ్యులు వేలం వేశారు. వేలంలో గ్రామానికి చెందిన ఒకరు రూ.14 లక్షల 80 వేలకు ఇంటిని సొంతం చేసుకున్నట్టు ఐకేపీ సిబ్బంది వెల్లడించారు. ఇంతకు ముందు సంధ్య రూ.6 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment