సాక్షి, హుజూరాబాద్: ‘‘ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. కానీ అంతిమ విజయం వాటిదే. కులం, డబ్బు, పార్టీ, జెండాలను కాదు.. మనిషిని గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు నేను ఇబ్బంది పడుతుండొచ్చు. కానీ గాయపడినా నా మనసు మార్చుకోను. నాలాంటి వాడు మీముందుకు వచ్చి దేహీ అనే పరిస్థితి మంచిది కాదు..’’అని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల భావోద్వేగంగా మాట్లాడారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘‘నేను చేసిన పనులు చెప్పుకునే అక్కర్లేదు.
నేను కొత్తగా వచ్చిననాడు ఈ పిల్లగాడు గెలుస్తడా అన్నరు. కానీ మీరు ఆశీర్వదించి గెలిపించారు. 20 ఏళ్లుగా నా చరిత్ర మీ కాళ్ల దగ్గర పెట్టిన. మళ్లీ ఇప్పుడు వచ్చి పని చేస్తానో లేదో చెప్పుకునే దుస్థితి ఉంటుందా? నేను ఎలాంటి వాడినో, ఎవరి కోసం తపన పడతానో మీకు తెలుసు’’అని ఈటల అన్నారు. పథకాలు పేదరికానికి పరిష్కారం కాదన్నారు. ‘పరిగె ఏరుకుంటే రాదు.. పంట పండితే వస్తుంది’అనే సామెత ఉందని.. అలాగే కల్యాణలక్ష్మి, పెన్షన్లు, రేషన్ కార్డులు పేదరికానికి పరిష్కారం కాని వ్యాఖ్యానించారు. అందరూ తమ కాళ్లమీద తాము నిలబడే సత్తా తీసుకురావాలని.. పని చేయగలమనే కాన్ఫిడెన్స్ రావాలని చెప్పారు.
ఊరంతా ఒక దారైతే..
ఊరంతా ఒకదారైతే ఊసరవెల్లిది ఇంకోదారి అన్నట్టు కొందరు ఉంటారని.. బంగారు గొలుసులు, ఉంగరాలు పెట్టుకుంటే గొప్పతనం కాదని, దానం చేసే గుణం ఉండాలని ఈటల పేర్కొన్నారు. మహాభారతంలో కౌరవులు, దుర్యోధనుడు వంటివారు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చిందని.. సమాజంలో అందరూ ఒకే విధంగా ఉండరని చెప్పారు.
నాయకులంటే భారీ ఆకారంతో, ఆభరణాలతో, కులంతో పని ఉండదని.. ప్రజల కన్నీళ్లు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషి అని పేర్కొన్నారు. రైతు బాగుంటే ఊరంతా బాగుంటుందని, అలాంటి రైతుకు ఆసరాగా ఉండేందుకే రైతు వేదిక వచ్చిందని చెప్పారు. తాను ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజలకు మచ్చ తీసుకురానని, రుణం తీర్చుకుంటానని ఈటల అన్నారు.
చదవండి: కరోనా కేసులతో తెలంగాణ సర్కార్ అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment