సాక్షి, హైదరాబాద్: డేటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పొరేట్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు సింగపూర్ హైకమిషనర్ హెచ్.ఈ. సైమన్ వాంగ్ అన్నారు. వాంగ్ తన ప్రతినిధుల బృందంతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సోమవారం అరణ్యభవన్‌లో కలిశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో వాంగ్ హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్ర స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. డేటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పొరేట్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు వాంగ్ చెప్పారు. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని మంత్రి వెల్లడించారు. డేటాసెంటర్లకు అనువైనదని, ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేశాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలతో ఫార్మా సిటినీ ఏర్పాటు చేస్తోందన్నారు. తెలంగాణ వ్యాక్సిన్ హబ్‌గా మారిందన్నారు. సోలార్ వంటి రంగాల్లో పెట్టుబడులకు కూడా తెలంగాణ అనువైందని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరా..
అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాల గురించి సింగపూర్ ప్రతినిధులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని హరీశ్ తెలిపారు. సముద్రమట్టం నుంచి వంద నుంచి 630 మీటర్ల ఎత్తులో తెలంగాణ ప్రాంతం ఉందని, గోదావరి నీటిని 630 ఎత్తు వరకు ఈ ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేస్తున్నట్లు వివరించారు. ఏడున్నరేళ్ల కాలంలో వ్యవసాయం రంగంలోనూ సమూల మార్పులను సీఎం కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. ఫలితంగా రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. విద్యుత్ రంగంలోనూ స్వావలంభన సాధించామన్నారు. వచ్చే పర్యటనలో తెలంగాణలోని పల్లెలను సందర్శించి ప్రజల జీవన విధానం పరిశీలించాలన్నారు. సిద్దిపేట జిల్లాను సందర్శించాలని కోరారు. ఈ భేటీలో సింగపూర్ హైకమిషన్ సెక్రటరీలు సెన్ లిమ్, అమండా క్వెక్, సింగపూర్ కన్సోల్ జనరల్ (చైన్నై) పాంగ్ కాక్ టైన్, వైస్ కన్సోల్ జనరల్ అబ్రహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ను శాలువాతో సత్కరించారు.
చదవండి: సర్కారీ స్కూళ్లు.. సరికొత్తగా!
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి: సింగపూర్ సంస్థ ఆసక్తి
Published Tue, Jul 13 2021 2:58 AM | Last Updated on Tue, Jul 13 2021 7:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment