
అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు
భైంసా: నిర్మల్ జిల్లా బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతీక్షేత్రంలో వసంత పంచమి జరుçపుకొన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచే ఆలయంలో పూజలు జరిగాయి. గురువారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా వేలాదిగా భక్తులు బాసరకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాస పూజలు జరిపించారు. వెంకటేశ్వర సేవాసమితి సభ్యులు, అఖిల భారత పద్మశాలి సంఘంతోపాటు పలువురు వ్యక్తులు బాసర వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. బాసర ట్రిపుల్‌ఐటీకి చెందిన 50 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఆలయంలో సేవలు అందించారు. ఉదయం నుంచి రాత్రి వరకు బాసర భక్తజనంతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనానికి 4 గంటలు, అక్షరాభ్యాసానికి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిరావడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment