మహిళల కోసం ‘సింగిల్‌ విండో’  | Minister KTR on the anniversary of We Hub | Sakshi
Sakshi News home page

మహిళల కోసం ‘సింగిల్‌ విండో’ 

Published Thu, Mar 9 2023 2:43 AM | Last Updated on Thu, Mar 9 2023 10:18 AM

Minister KTR on the anniversary of We Hub - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మహిళలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఎదిగేందుకు కృషి చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వారికి తగిన ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఇందుకోసం టీఎస్‌–ఐపాస్‌ తరహాలో త్వరలో ఓ ‘సింగిల్‌ విండో’విధానం తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీనిపై అధికారులు, మహిళా వ్యాపారవేత్తలతో చర్చిస్తున్నామని, త్వరలోనే పేరు పెట్టి అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు.

బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వీ హబ్‌ 5వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలతో పలువురికి ఉపాధి కల్పిస్తున్న మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.  

వీ హబ్‌ వేదికగా ఉన్నత స్థాయికి మహిళలు 
రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని మంత్రి చెప్పారు. మహిళలు ఏ రంగంలోనైనా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని కొనియాడారు. మహిళలను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల క్రితం వీహబ్‌ను ప్రారంభించామని, దాన్ని వేదికగా చేసుకుని ఎందరో మహిళలు ఉన్నతస్థాయికి చేరుకున్నారని చెప్పారు.

దేశవ్యాప్తంగా 35,000 మందికి పైగా మహిళా ఉత్పాదకులను భాగస్వామ్యం చేయడంలో వీ హబ్‌ ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా.. స్వయం సహాయక సంఘాలకు స్త్రీ నిధి కింద వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా అందిస్తున్నామని చెప్పారు. తాజాగా రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.  

అమ్మాయి తక్కువ అనే భావన తగదు 
‘పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పట్నుంచే విలువలు నేర్పించాలి. వారికి ఇష్టమైన చదువును చదివించాలి. తల్లిదండ్రుల వ్యవహారశైలి పిల్లలపై ప్రభావం చూపుతుంది. స్త్రీ, పురుషులకు ప్రతిభ సమానంగానే ఉంటుంది. కానీ కొందరు తెలిసీ తెలియక ‘అమ్మాయి తక్కువ.. అబ్బాయి ఎక్కువ’అనే భావన నేర్పిస్తున్నారు. అలా వివక్ష చూపించకుండా ఇద్దర్నీ సమానంగా చూడటం మన ఇంటి నుంచే ప్రారంభిస్తే.. వారు కూడా ఇతర అమ్మాయిల్ని, అబ్బాయిల్ని సమానంగా, గౌరవంగా చూస్తారు. అప్పుడే అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించగలుగుతారు.

మా ఇంట్లో నన్ను, నా చెల్లిని బాగా చదివించారు. నా చెల్లి యూఎస్‌ వెళ్తా అంటే నా కంటే ముందే పంపారు. మా పిల్లలను కూడా మేం సమానంగా చూస్తున్నాం. ఏం అవ్వాలనుకుంటే ఆ దిశగా ముందుకెళ్లాలని ప్రోత్సహిస్తున్నాం. పిల్లలకు ఆ నమ్మకం ఇవ్వగలిగితే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వంద శాతం అభివృద్ధి సాధిస్తారు. నా కూతురు 9వ తరగతి చదువుతోంది. తను మంచి ఆర్టిస్ట్‌ అవుతుంది అనుకుంటున్నాను. ఆమె ఏ రంగంలో ఉన్నా సరే మంచి మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాను..’అని కేటీఆర్‌ అన్నారు.  

‘బాస్‌’కి భయపడాల్సిందే.. 
‘మహిళలు ఎక్కువ నిబద్ధతతో ఫోకస్డ్‌గా, బాధ్యతాయుతంగా ఉంటారు. మమ్మల్ని తొక్కేస్తున్నారు కూడా. మేం బయటకి ఎంత నటించినా ఇంట్లో మహిళలే బాస్‌లు. ఎంత పెద్ద నేత అయినా ఇంటికి వెళ్లాక బాస్‌కి భయపడాల్సిందే..’అంటూ కేటీఆర్‌ చమత్కరించారు.  

ఐదేళ్లలో 3,194  స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలు 
వ్యాపారాల నిర్వహణలో మహిళల భాగస్వామ్యం కీలకంగా మారిందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ చెప్పారు. మహిళలను వివిధ రంగాల్లో ప్రోత్సహించడంలో వీ హబ్‌ పాత్రను వివరించారు. వీహబ్‌ ద్వారా గత ఐదేళ్లలో 3,194 స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

5,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, 1,247 మంది విద్యార్థులు, 986 మంది సామాజికంగా ప్రభావశీలురైన పారిశ్రామికవేత్తలు, 609 మంది పట్టణ పారిశ్రామికవేత్తలతో వీ హబ్‌ విజయవంతంగా సాగుతోందని చెప్పారు. వివిధ రంగాల్లో మహిళలు ఎదిగిన తీరును వీ హబ్‌ సీఈవో దీప్తి రావుల వివరించారు. పలువురు మహిళలు తమ విజయానికి వీ హబ్‌ ఎలా తోడ్పడిందీ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement