SINGLE WINDOW
-
ఇస్తాంబుల్ లో గ్రీన్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు
-
మహిళల కోసం ‘సింగిల్ విండో’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఎదిగేందుకు కృషి చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వారికి తగిన ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఇందుకోసం టీఎస్–ఐపాస్ తరహాలో త్వరలో ఓ ‘సింగిల్ విండో’విధానం తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీనిపై అధికారులు, మహిళా వ్యాపారవేత్తలతో చర్చిస్తున్నామని, త్వరలోనే పేరు పెట్టి అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వీ హబ్ 5వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలతో పలువురికి ఉపాధి కల్పిస్తున్న మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేటీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వీ హబ్ వేదికగా ఉన్నత స్థాయికి మహిళలు రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని మంత్రి చెప్పారు. మహిళలు ఏ రంగంలోనైనా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని కొనియాడారు. మహిళలను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల క్రితం వీహబ్‌ను ప్రారంభించామని, దాన్ని వేదికగా చేసుకుని ఎందరో మహిళలు ఉన్నతస్థాయికి చేరుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా 35,000 మందికి పైగా మహిళా ఉత్పాదకులను భాగస్వామ్యం చేయడంలో వీ హబ్ ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా.. స్వయం సహాయక సంఘాలకు స్త్రీ నిధి కింద వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా అందిస్తున్నామని చెప్పారు. తాజాగా రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అమ్మాయి తక్కువ అనే భావన తగదు ‘పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పట్నుంచే విలువలు నేర్పించాలి. వారికి ఇష్టమైన చదువును చదివించాలి. తల్లిదండ్రుల వ్యవహారశైలి పిల్లలపై ప్రభావం చూపుతుంది. స్త్రీ, పురుషులకు ప్రతిభ సమానంగానే ఉంటుంది. కానీ కొందరు తెలిసీ తెలియక ‘అమ్మాయి తక్కువ.. అబ్బాయి ఎక్కువ’అనే భావన నేర్పిస్తున్నారు. అలా వివక్ష చూపించకుండా ఇద్దర్నీ సమానంగా చూడటం మన ఇంటి నుంచే ప్రారంభిస్తే.. వారు కూడా ఇతర అమ్మాయిల్ని, అబ్బాయిల్ని సమానంగా, గౌరవంగా చూస్తారు. అప్పుడే అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించగలుగుతారు. మా ఇంట్లో నన్ను, నా చెల్లిని బాగా చదివించారు. నా చెల్లి యూఎస్ వెళ్తా అంటే నా కంటే ముందే పంపారు. మా పిల్లలను కూడా మేం సమానంగా చూస్తున్నాం. ఏం అవ్వాలనుకుంటే ఆ దిశగా ముందుకెళ్లాలని ప్రోత్సహిస్తున్నాం. పిల్లలకు ఆ నమ్మకం ఇవ్వగలిగితే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వంద శాతం అభివృద్ధి సాధిస్తారు. నా కూతురు 9వ తరగతి చదువుతోంది. తను మంచి ఆర్టిస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఆమె ఏ రంగంలో ఉన్నా సరే మంచి మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాను..’అని కేటీఆర్ అన్నారు. ‘బాస్’కి భయపడాల్సిందే.. ‘మహిళలు ఎక్కువ నిబద్ధతతో ఫోకస్డ్గా, బాధ్యతాయుతంగా ఉంటారు. మమ్మల్ని తొక్కేస్తున్నారు కూడా. మేం బయటకి ఎంత నటించినా ఇంట్లో మహిళలే బాస్‌లు. ఎంత పెద్ద నేత అయినా ఇంటికి వెళ్లాక బాస్‌కి భయపడాల్సిందే..’అంటూ కేటీఆర్ చమత్కరించారు. ఐదేళ్లలో 3,194 స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలు వ్యాపారాల నిర్వహణలో మహిళల భాగస్వామ్యం కీలకంగా మారిందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు. మహిళలను వివిధ రంగాల్లో ప్రోత్సహించడంలో వీ హబ్ పాత్రను వివరించారు. వీహబ్ ద్వారా గత ఐదేళ్లలో 3,194 స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 5,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, 1,247 మంది విద్యార్థులు, 986 మంది సామాజికంగా ప్రభావశీలురైన పారిశ్రామికవేత్తలు, 609 మంది పట్టణ పారిశ్రామికవేత్తలతో వీ హబ్ విజయవంతంగా సాగుతోందని చెప్పారు. వివిధ రంగాల్లో మహిళలు ఎదిగిన తీరును వీ హబ్ సీఈవో దీప్తి రావుల వివరించారు. పలువురు మహిళలు తమ విజయానికి వీ హబ్ ఎలా తోడ్పడిందీ తెలిపారు. -
T-Hub: అంకుర సంస్థలకు ‘సింగిల్ విండో’
ఎన్నో సరికొత్త ఆలోచనలు చేయగల, అధునాతన ఉత్పత్తులను రూపొందించగల సత్తా మన యువతలో ఉంది. వారి ఆలోచనలు ఆచరణలోకి తెచ్చే ప్రోత్సాహం వారికి అవసరం. ఈ ప్రోత్సాహాన్ని అందించాలనీ, ఔత్సాహిక యువతను వ్యాపారవేత్త లుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనీ తెలంగాణ ప్రభుత్వం 2015లో టీ–హబ్‌ను ప్రారంభించింది. ఒక ఆలోచనతో వస్తే... దానిని ఆచరణలోకి తేవడం, వస్తువు లేదా సర్వీస్‌గా మల్చడం టీ–హబ్ ఉద్దేశ్యం. ఇది స్టార్టప్‌ల జమానా. ఒక విజయవంతమైన స్టార్టప్‌ను స్థాపించాలనే పట్టుదల చాలామందికి ఉంటుంది. కానీ, ఇందుకు కావాల్సిన ప్రోత్సాహం, సదుపాయాలు, పెట్టుబడి, మార్గనిర్దేశం ఉండదు. ఇది గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం టీ–హబ్ ద్వారా... ఒక ఆలోచనను అమలు చేయడానికి కావాల్సిన పెట్టుబడి పెట్టించడం, ఎలాంటి పద్ధతులను ఆచరించాలో అవగాహన కల్పించడం, మార్కెట్లోకి తీసుకెళ్లడం, నిపుణుల సలహాలు ఇప్పించడం, స్ఫూర్తి నింపడం, అవసరమైన నైపుణ్యత కలిగిన మానవ వనరులను అందివ్వడం వంటివి చేస్తోంది. ఇక ఒక స్టార్టప్ స్థాపించడానికి పాటించాల్సిన నియమ నిబంధనలపై సూచనలు ఇవ్వడం, స్టార్టప్‌లు వృద్ధి చెందడానికి కావాల్సిన భాగస్వామ్యాన్ని కల్పించడానికీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ఈ ఏడేళ్లలో దాదాపు పదకొండు వేల స్టార్టప్‌లకు టీ–హబ్ సహకారాన్ని అందించింది. వీటిల్లో 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. టీ–హబ్ నుంచి 3 స్టార్టప్‌లు యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ) కంపెనీలుగా ఎదిగాయి. మరో 8 కంపెనీలు సూని కార్న్ (త్వరలో యూనికార్న్‌గా మారనున్న) కంపెనీలుగా వృద్ధి చెందాయి. టీ–హబ్‌ను మరింత విస్తృతం చేయడానికి గానూ తెలంగాణ ప్రభుత్వం ‘టీ–హబ్ 2.0’ను నిర్మించింది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఏర్పాటైన టీ–హబ్ కంటే ఇది దాదాపుగా ఐదు రెట్లు పెద్ద ప్రాంగణం. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు నెలకొని ఉన్న హైదరాబాద్ ఐటీ హబ్ మధ్యలోని రాయదుర్గంలో రూ. 700 కోట్లతో ‘టీ–హబ్ 2.0’ నిర్మాణం జరిగింది. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త టీ–హబ్‌ను ఘనంగా ప్రారంభించారు. మొత్తం 3.14 ఎకరాలలో 5.82 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా, 3.62 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో నిర్మించిన టీ–హబ్ 2.0 ప్రపంచం లోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్. ఇప్పటివరకు ప్యారిస్‌లోని ‘స్టేషన్ ఎఫ్’ ప్రపంచంలో అతిపెద్ద ఇన్నొవేషన్ క్యాంపస్‌గా ఉండేది. 2 వేల స్టార్టప్‌లకు ఆశ్రయం ఇవ్వగల సామర్థ్యం ఉన్న 10 అంతస్తుల భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఇంతకాలం ట్రిపుల్ ఐటీలో ఉన్న టీహబ్ కార్యకలాపాలన్నీ ఇప్పుడు ఈ కొత్త భవనంలోనే జరుగుతున్నాయి. ఇప్పటివరకూ బెంగళూరు, ఢిల్లీ, ముంబయిలలో వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ కార్యాలయాలు కూడా టీ–హబ్‌లోనే ఏర్పాటవుతున్నాయి. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నొవేషన్ మిషన్ సెంటర్ కార్యాలయాలూ ఇక్కడే ఉంటాయి. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కూడా ఉంటుంది. ప్రపంచాన్ని మార్చే, భవిష్యత్తు ఉన్న వాటిగా భావిస్తున్న బ్లాక్ చెయిన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వంటి వాటికి టీ–హబ్‌లో ప్రాముఖ్యం ఇస్తున్నారు. దీన్ని మరింత విస్తృతం చేయాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన. ఇందుకుగానూ రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి నగరాల్లోనూ టీ–హబ్ రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. (క్లిక్: ఈ పతనం ఏ తీరాలకు చేరుస్తుందో!) - డాక్టర్ ఎన్. యాదగిరిరావు అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ -
ఒక క్లిక్‌తో ఏపీఐఐసీ సేవలు..14 సేవలు అందుబాటులోకి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు ఇకపై ఫైళ్లు పట్టుకొని వారాలు, నెలలు పరిశ్రమల శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లోనే వారికి అవసరమైన సేవలను సులభంగా పొందవచ్చు. ఇందుకోసం సింగిల్ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేలా ఏపీఐఐసీ ఆన్లైన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఏపీఐఐసీని పరిశ్రమల శాఖతో అనుసంధానం చేయడం ద్వారా భూమి కోసం దరఖాస్తు దగ్గర నుంచి కంపెనీ వాటాల విక్రయం వరకు అన్ని సేవలను ఒకే క్లిక్‌తో పొందే అవకాశం కల్పించింది. ‘పౌర సేవలు’ పేరుతో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్ సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గడువులోగా పని చేసే సాంకేతిక వ్యవస్థని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని అధికారుల బృందానికి అభినందనలు తెలిపారు. www.apindustries.gov.in కు ఏపీఐఐసీ సేవలు అనుసంధానమవడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు తక్షణమే ఈ సేవలన్నింటినీ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు, ఏపీఐఐసీకి జోనల్ మేనేజర్లు కలిసి పనిచేసి మరిన్ని మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. 14 సేవలకూ ఒకటే అప్లికేషన్ సింగిల్ విండో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఏపీఐఐసీకి చెందిన అన్ని సేవలను పొందవచ్చని ఆ సంస్థ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. తొలిదశలో 14 సేవలను అందుబాటులో ఉంచామన్నారు. వీటిలో ఏ సేవ పొందాలన్నా ఆన్లైన్లో ఒకే అప్లికేషన్ ఫామ్ నింపితే సరిపోతుందన్నారు. పరిశ్రమ పేరు మార్చుకోవడం, కేటాయింపుల బదిలీ, ఇతర మార్పులు, లైన్ ఆఫ్ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్ లైన్ యాక్టివిటీ, ప్లాట్ పరిమితుల అనుమతులు, ప్లాట్ డివిజన్, విభజనల మార్పులు, 5 ఎకరాలలోపు సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ , 5 ఎకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాటుకు ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ప్రాజెక్టు అమలుకు గడువు పెంపు, ముందస్తు చెల్లింపుల గడువు పెంపు వంటి 14 సేవలు ఆన్లైన్ ద్వారా పొందవచ్చని చెప్పారు. వీటిని 15 రోజుల నుంచి 45 రోజుల్లో పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. ప్రస్తుతం చిన్న పనులకే ఎక్కువ సమయం వృథా అవుతోందని, దాని నియంత్రణ కోసం ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కలిసి పని చేస్తున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. (చదవండి: సందడిగా కలెక్టరేట్లు.. వేలాది మందితో భారీ ర్యాలీలు..ఊరూరా పండుగ వాతావరణం) -
బెంగాల్ దంగల్: మోదీ–దీదీ మాటల యుద్ధం
ఖరగ్‌పూర్/ హల్దియా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మధ్య మాటల తూటాలు పేలాయి. మమత సర్కార్ దోపిడి విధానాలను మోదీ ఎత్తి చూపిస్తే, బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడి పార్టీ అంటూ దీదీ ఎదురు దాడి చేశారు. శనివారం ఖరగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీకి భారీగా తరలివచ్చిన జన సమూహాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. మమత సర్కార్ దోపిడి విధానాల వల్ల రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని, కేవలం మాఫియా ఇండస్ట్రీ మాత్రమే పని చేస్తోందని ధ్వజమెత్తారు. మమత మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీని సింగిల్ విండోగా అభివర్ణించారు. ఆయనతో మాట్లాడకపోతే ఒక్క పని జరగడం లేదని పారిశ్రామికవేత్తలందరూ హడలెత్తిపోతున్నారని అన్నారు. ‘‘పారిశ్రామికీకరణ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు దీనిని పాటిస్తూ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. బెంగాల్లో కూడా సింగిల్ విండో ఉంది. మమత మేనల్లుడే ఇక్కడ సింగిల్ విండో. ఆ విండోని దాటకుండా ఒక్క పని కూడా జరగదు’’అని ఆరోపించారు. అన్నీ అమ్మేస్తున్నారు హల్దియా రేవు పట్టణంలో జరిగి ఎన్నికల సభకి వీల్ చైర్లోనే హాజరైన సీఎం మమతా బెనర్జీ మోదీ మాటల్ని తిప్పి కొట్టారు. ప్రపంచంలోనే బీజేపీ అతి పెద్ద దోపిడీ పార్టీ అని ఆరోపణలు గుప్పించారు. పీఎం కేర్స్ఫండ్ ద్వారా ఆ పార్టీ ఎంత డబ్బు సంపాదించిందో ఒక్క సారి చూడండని అన్నారు. మోదీని మించిన అమ్మకం దారుడు మరెవరూ లేరని ధ్వజమెత్తారు. ప్రధాని అన్నీ అమ్మేస్తూ భారత ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ౖ‘‘రెల్వేలను ప్రైవేటు పరం చేశారు. బొగ్గు, బీఎన్ఎన్ఎల్, బీమా, బ్యాంకులు ఇలా అన్నీ అమ్మేస్తున్నారు’’అంటూ విమర్శించారు. ఏదో ఒక రోజు హల్దియా ఓడరేవుని కూడా అమ్మకానికి పెట్టేస్తారని హెచ్చరించారు.. బెంగాల్‌ని కాపాడుకోవాలంటే తృణమూల్ కాంగ్రెస్‌కే ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసిన మమత అప్పుడే రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదని అన్నారు. -
మినీ థియేటర్లు.. ఆన్లైన్లో టికెట్లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభి వృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్ ప్రారంభమైంది. ‘టీఎస్‌బాక్స్ ఆఫీస్.ఇన్’ ద్వారా ఆన్లైన్ టికెట్స్ పొందొచ్చు. అలాగే షూటింగ్‌ల కోసం సింగిల్ విండో అనుమతులు అందించే ఆన్లైన్ విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ రెండింటిని ప్రారంభిం చుకోవడం నిర్మాతలకు, ప్రేక్షకులకు, థియేటర్ యజమానులకు ఎంతో ఉపయోగకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సచివాలయంలో ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్, సింగిల్ విండో అనుమతుల విధానాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ రాంమోహన్‌రావు, ఎఫ్డీసీ ఎండీ నవీన్ మిట్టల్, జేఎండీ కిషోర్ బాబు, సినీ ప్రముఖులు దిల్ రాజు, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ వేసిందని, వారికి ఉపయోగపడే ఎన్నో నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం ఐదో ఆట ప్రదర్శనకు అనుమతులు ఇస్తామన్నారు. సినిమా షూటింగ్‌ల కోసం వివిధ శాఖల నుంచి అనుమతుల కోసం నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీఎస్ఎఫ్డీసీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఏడు రోజుల్లోపు అన్ని అనుమతులు మంజూరవుతాయన్నారు. ఏడురోజుల్లో అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగానే పరిగణించి షూటింగ్ ప్రారంభించుకోవచ్చన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం స్టూడియో నిర్మాణానికి సంబంధించి స్థలం ఎంపిక కోసం దీపావళి తరువాత పర్యటిస్తామన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని వివరించారు. సినీ అవార్డుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి అధ్యక్షతన కమిటీ సమావేశమయ్యిందని, మార్గదర్శకాలు తయారుచేసి సీఎం అనుమతితో నిర్వహిస్తామన్నారు. రమణాచారి మాట్లాడుతూ ఫిలిం ఇన్స్టిట్యూట్ ద్వారా సినీ విభాగాల్లో ఎంతో మంది శిక్షణ పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఎఫ్డీసీ ఛైర్మన్ రాంమోహన్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. చిత్ర పరిశ్రమలో సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగుతామన్నారు. నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ప్రేక్షకులకు, నిర్మాతలకు ఆన్లైన్ పోర్టల్ విధానం ఉపయోగపడుతుందన్నారు. టీఎస్ ఐపాస్ తరహాలోనే ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్‌ను ప్రారంభించామని, భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆన్లైన్ అనుమతులకు సంబంధించి ప్రతి శాఖలో ఒక నోడల్ అధికారి ఉంటారని వీరందరు ఏడురోజుల్లో ఆన్లైన్ అనుమతులు ఇస్తారన్నారు. -
సినిమాలకూ ‘సింగిల్ విండో’
విధానంలో అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రి తలసాని వెల్లడి సాక్షి, హైదరాబాద్: సినిమాల నిర్మాణానికి ప్రభుత్వ శాఖల నుంచి అన్ని అనుమతులు ఒకేసారి ఇవ్వడం కోసం సింగిల్ విండో విధానాన్ని అనుసరించనున్నట్లు వాణిజ్యపన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో సినీ రంగ ప్రముఖులతో పాటు పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ... సినీ పరిశ్రమకు ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టంచేశారు. సినిమా ప్రారంభం మొదలు, విడుదలయ్యేంత వరకు పలు సమస్యలొస్తున్నాయన్నారు. ఇక నుంచి ఏ ఇబ్బంది రాకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ సింగిల్‌విండో పద్ధతిని అనుసరిస్తామన్నారు. సినిమా రంగంలో అవార్డుల ప్రదానోత్సవం మూడేళ్లుగా నిలిచిపోయిందని, దానిని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. నంది అవార్డుల స్థానంలో కొత్త పురస్కారాలను సీఎం కేసీఆర్ ఆమోదంతో సాధ్యమైనంత తొందరలో అందజేస్తామన్నారు. చిత్ర పరిశ్రమలో పనిచేసే రెండు వేల మంది కింది స్థాయి కార్మికులకు గతంలో మణికొండ ప్రాంతంలో నివాస సముదాయాల కోసం ఇచ్చిన 67 ఎకరాల భూమికి సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. సినీ పరిశ్రమలో ప్రాంతీయ వివక్ష లేదని, నైపుణ్యం ఉన్నవారు ఎవరైనా ఎదగడానికి అనుకూలమైన అవకాశాలున్నాయని మంత్రి స్పష్టంచేశారు. -
మ్యూచువల్ ఫండ్లకూ ‘సింగిల్ విండో’
మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. ఒక ఫారం నింపటంతో పాటు... ఇవ్వాల్సిన మొత్తానికి చెక్ రాసివ్వాలి. అదే సంస్థ ఆఫర్ చేస్తున్న వేరొక ఫండ్‌లో పెట్టుబడి పెడదామనుకుంటే... మరో ఫారం నింపి, మరో చెక్ ఇవ్వాలి. ఇతర సంస్థలు ఆఫర్ చేస్తున్న ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే... మళ్లీ కథ మొదటికే. అన్నిటికీ ప్రత్యేక ఫారాలు... ప్రత్యేక చెక్‌లు. వీటిన్నిటికీ విరుగుడుగా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ). ఒక సింగిల్ విండో లావాదేవీల ప్లాట్‌ఫారాన్ని ‘మ్యూచువల్ ఫండ్ యుటిలిటీ’ ’(ఎంఎఫ్‌యూ) పేరిట ఆరంభిస్తోంది. దీనిద్వారా ఎన్ని సంస్థలకు చెందిన ఎన్ని ఫండ్లలో పెట్టుబడి పెట్టినా... ప్రత్యేక ఫారాలు, ప్రత్యేక చెక్కులు అవ సరం లేదు. అదీ కథ. ఎంఎఫ్‌యూ ద్వారా జరిగే లావాదేవీలన్నీ ప్రాసెసింగ్ కోసం అసెట్ మేనేజిమెంట్ కంపెనీలు, లేక రిజిష్ట్రార్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లకు వెళ తాయి. ఈ ప్లాట్‌ఫారాన్ని యాక్సెస్ చేసుకోవటానికి మీకు ‘కామన్ అకౌంట్ నంబర్’ (క్యాన్) ఉండాలి. దీన్ని రిజిస్ట్రేషన్ ఫారం నింపి ఇవ్వటం ద్వారా ఏ ఎంఎఫ్ ఏజెన్సీ, లేదా డిస్ట్రిబ్యూటర్ దగ్గరైనా పొందవచ్చు. ఈ ప్లాట్ ఫారం వల్ల వ్యక్తులు 24 గంటల్లో ఎప్పుడైనా తమ మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్లను ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. పోర్టు ఫోలియో సమాచారమే కాక, ఇతర స్కీమ్ సంబంధ సమాచారాన్ని కూడా అప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ఇంకా తమ ఇన్వెస్ట్మెంట్లను సమర్థంగా నిర్వహించుకోవటానికి వీలుగా అలెర్ట్‌లు, ట్రిగ్గర్లు, రిమైండర్ల వంటి విలువ ఆధారిత సేవలూ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 25 ఏఎంసీ కంపెనీలు ఈ ఎంఎఫ్యూను వినియోగించుకోవటానికి అంగీకరించాయి. ఈ నెల 4వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. -
'జపాన్ లో పర్యటించి.. స్మార్ట్ ఏపీ నిర్మిస్తా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సహజ వనరులు పుష్కలంగా దొరుకుతాయని, పదిలక్షల ఎకరాల భూమిని సమీకరించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు గురువారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. అన్ని పరిశ్రమలకు కావాల్సిన భూ అవసరాలను తమ ప్రభుత్వం తీరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమల అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. జపాన్ లో పర్యటించి.. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తానన్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. -
సింగిల్ విండోకి చట్టబద్ధత
-
సింగిల్ విండోకి చట్టబద్ధత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేలా సరికొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనికి చట్టబద్ధత కూడా కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్స్(టీపీఏఎస్‌ఎస్-టీపాస్) 2014 పేరుతో ప్రత్యేక బిల్లును తీసుకొచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కొత్త పారిశ్రామిక విధానంపై అభిప్రాయాలను తెలుసుకోవడానికి వివిధ పారిశ్రామిక సంఘాలతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సమావేశమయ్యారు. వారం రోజుల్లో అభిప్రాయాలను అందిస్తే సాధ్యమైనంత త్వరగా పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి, అసెంబ్లీ సమావేశాల్లో మొదటి బిల్లుగా టీపాస్-2014ను ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని పారిశ్రామిక ప్రతినిధులు తెలిపారు. వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం పారిశ్రామిక విధానంలోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు ఒకే చోట అన్ని అనుమతులు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా అనుమతుల మంజూరు కాలపరిమితి దాటితే అధికారులపై చర్యలు, అవసరమైతే జరిమానా విధింపు అనుమతులు వచ్చేలోగా సెల్ఫ్ డిక్లరేషన్‌తో పనులు మొదలు పెట్టుకునే వెసులుబాటు అధికారులకు జవాబుదారీతనం కల్పించేం దుకు టీపాస్-2014 చట్టం ఓపెన్ యాక్సెస్ విధానంలో బయట నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి పరిశ్రమలకు అనుమతి వాటర్ గ్రిడ్ ద్వారా పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా {పభుత్వ పారిశ్రామిక పార్కులతో పాటు, ప్రైవేటు పార్కుల ఏర్పాటుకు అనుమతి పరిశ్రమల ఏర్పాటుకు తక్షణం అందుబాటులో 3 లక్షల ఎకరాలు పారిశ్రామిక సంఘాల హర్షం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త పారిశ్రామిక విధానం ముసాయిదా అద్భుతంగా ఉందని పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ విధానంతో పారిశ్రామికంగా తెలంగాణ అగ్ర గామిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇది అమల్లోకి వస్తే పారిశ్రామిక పెట్టుబడులకు స్నేహపూర్వక రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు దక్కుతుందని సీఐఐ(తెలంగాణ) వైస్ చైర్మన్ నృపేందర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలరన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఉన్న ఇలాంటి పాలసీని దేశంలో ఎక్కడా చూడలేదని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్(టీఐఎఫ్) అధ్యక్షుడు కె.సుధీర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సీఐఐ, టీఐఎఫ్, ఫ్యాప్సీ ప్రతినిధులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రభుత్వ సలహాదారు పాపారావు, టీజెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్, ఇంధన కార్యదర్శి ఎస్.కె.జోషి తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల వద్దకే ప్రభుత్వం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమలు పెట్టేందుకు ఇకపై వెనకాడాల్సిన పనిలేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. వివిధ అనుమతుల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం అసలే ఉండదని భరోసా ఇస్తున్నాయి. జాప్యం, అధికారుల వేధింపులకు ఇక చోటే ఉండదంటున్నాయి. పరిశ్రమలు స్థాపిం చాలనుకుంటున్న వారి వద్దకే అన్ని ప్రభుత్వ సేవలు తరలివస్తాయని, వారికి రెడ్ కార్పెట్ పరుస్తామని హామీ ఇస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోనే అన్ని అనుమతులను ఒకేచోట మంజూరు చేసి అప్పగించే దిశగా దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించేందుకు టీ సర్కారు సిద్ధమవుతోంది. ఇందులో పారిశ్రామికవేత్తలకు అనువైన విధానాలను చేర్చాలని పరిశ్రమల శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. దీనిప్రకారం మెగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తల వద్దకు అధికారులే వెళ్లి.. వారికవసరమైన అనుమతులను మంజూరు చేయనున్నారు. ఈ అనుమతులన్నీ కూడా సింగిల్‌విండో ద్వారా ఒకేసారి మం జూరవుతాయి. అలాగే మెగా ఇండస్ట్రీ నిర్వచనాన్ని కూడా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రూ. 250 కోట్ల పెట్టుబడి పెట్టి, 1,500 మందికి ఉపాధి కల్పిస్తేనే మెగా ఇండస్ట్రీగా పరిగణిస్తున్నారు. అయితే ఇకపై రూ. 200 కోట్ల పెట్టుబడి దాటి, కనీసం వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తే మెగా ఇండస్ట్రీగా గుర్తించనున్నారు. ఈ మేరకు నూతన పారిశ్రామిక విధానంలో స్పష్టంగా పేర్కొంటారు. తద్వారా రూ. 200 కోట్లు దాటే ప్రతీ పరిశ్రమకు మెగా పరిశ్రమలకు ఇచ్చే విధంగా.. 100 శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు, మౌలికసదుపాయాల కల్పనకయ్యే వ్యయంలో 50 శాతం రీయింబర్స్మెంట్, 25-50 శాతం వ్యాట్, సీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలు లభించనున్నాయి. దీంతో ప్రభుత్వంపైనా రాయితీల భారం పెరగనుంది. మరి ఆలస్యం చేయొద్దు..! పారిశ్రామికవేత్తలకు వేగంగా అనుమతులు ఇస్తామని, అయితే వారు అంతే వేగంగా నిర్ణీత సమయంలోగా యూనిట్‌ను ప్రారంభించాలని పరిశ్రమల శాఖ వర్గాలు అంటున్నాయి. ‘ప్రస్తుతం ఫలానా ప్రభుత్వ కార్యాలయం నుంచి అనుమతి రాలేదు కాబట్టే ఆలస్యమైందన్న కారణాలు చెప్పి యూనిట్ ఏర్పాటును కంపెనీలు ఆలస్యం చేస్తున్నాయి. దాంతో అంచనాల మేరకు ఉపాధి అవకాశాలు కూడా లభించడం లేదు. పరిశ్రమలకు ఇచ్చిన భూమి నిరుపయోగంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇకపై అనుమతులన్నీ ఒకేచోట మంజూరు చేయనున్నందున... కంపెనీలు కూడా నిర్ణీత సమయంలోగా ఉత్పత్తిని ప్రారంభించాలి. లేకుంటే ఇచ్చిన భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని’ ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ చర్యల వల్ల కంపెనీ వెంటనే ఉత్పత్తి ప్రారంభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడుతున్నాయి. కసరత్తు షురూ! నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు మొదలైంది. ఈ మేరకు ఈ నెల 22న వివిధ పారిశ్రామిక సంఘాలతో పరిశ్రమల శాఖ సమావేశం కానుంది. తెలంగాణ దృక్పథంతో కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంలో భాగంగా ఫిక్కీ, ఫ్యాప్సీ, సీఐఐ వంటి పారిశ్రామిక సంఘాల నుంచి సూచనలు, సలహా లను స్వీకరించనుంది. పారిశ్రామికవేత్తలు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి రాయితీలు కావాలి? తదితర విషయాల్లో సర్కారుకందే అభిప్రాయాలకనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని అధికారులు పేర్కొన్నారు. -
విచారణ లేదు.. ఎన్నికలు లేవు
బీర్కూర్,న్యూస్‌లైన్: రైతుల రుణాల్లో అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో బీర్కూర్ మండలంలోని దామరంచ సింగిల్ విండో పాలక వర్గాన్ని రద్దు చేసిన అధికారులు తిరిగి ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం చూపుతున్నారు. మొదట్లో రుణాల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన అధికారులు ఆ తరువాత పట్టించుకోలేదు. దామరంచ సింగిల్ విండోలో గతంలో పని చేసిన అధ్యక్ష, కార్యదర్శులు సుమారు రూ. 1 కోటి 60 లక్షలు దుర్వినియోగం చేసినట్లు రైతులు ఆరోపించారు. ఈ మేరకు రైతులు ఆధారాలను బయటపెట్టారు. పలు రకాలుగా రైతులకు రుణాలు రూ .1,78,87,695 వచ్చాయి. దీంట్లో స్వల్ప కాలిక రుణాలు రూ. 1,13,00712, రీ షెడ్యూల్ ద్వారా, రూ. 12,05,505 నార్మల్ లాంగ్ టర్మ్ రుణాలు రూ. 88,325, ఎల్టీ నాబార్డు ద్వారా రూ. 2,62,679 , నాబార్డు రీషెడ్యూల్ ద్వారా రూ. 46,88,407, నాబార్డు రీ షెడ్యూల్ద్వారా రూ. 3,01,042 వచ్చాయి. అయితే మొదటి సారి రూ. 67,59,973, రెండవ సారి రూ. 67,65,869 మాఫీ వచ్చింది. దీంతో పాటు వైద్యనాథ్ కమిటీ ద్వారా సొసైటీకి రూ. 25,10,471, పీఎం ఫండ్ ద్వారా రూ. 16,42,103 వచ్చాయి. అయితే ఇంత జరిగినా రైతులు ఒక్క రూపాయి కూడా లోన్లు తీసుకోకుండానే అధ్యక్ష, కార్యదర్శులు రైతుల పేరు మీద లక్షలకు లక్షలు స్వాహా చేశారు. మొదటి విడత, రెండవ విడతలో రుణ మాఫీ కాని వారికి వైఎస్ ప్రభుత్వం రూ. 5000 ఇన్సెంటీవ్ ప్రకటించగా సొసైటీ పరిధిలోని 567 మంది రైతుల పేరు మీద ఇన్సెంటీవ్ తెప్పించి వారిలో కేవలం 250 మంది వరకు రైతులకు మాత్రమే బోనస్‌ను అందించి మిగిలినవి వారి జేబుల్లో వేసుకున్నారు. ఇదిలా ఉండగా తొమ్మిదేళ్ల క్రితం చనిపోయిన దావోరి విఠల్(అకౌంట్ నంబర్ 180) అ నే రైతు పేరు మీద డబ్బులు తీసుకుంటూ దర్జాగా కాలక్షేపం చేశారు. రూపాయి కూడా రుణం తీసుకోని రైతుల పేరు మీద కూడా వేలకు వేలు అప్పులు ఉన్నట్లు చూ పిస్తున్నారు. రైతుల పేరు మీద వారికి తె లియకుండా రుణాలు పొం దడమే కా కుండా ఇవన్ని సక్రమంగానే జరిగాయం టు అధికారులను గతంలో న మ్మించడానికి ప్రయత్నించారు. ప్రతి సంవత్సరం రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించే వారి పేరు మీద కూడా వీరిరువురు లోన్లు తీసుకున్నట్లు తేలింది. మరో నమ్మలేని నిజం ఏమిటంటే నవంబర్ 31, 2006లో గడ్డం లక్ష్మి పేరు మీద రూ. 35 వేలు, శేక్ హుస్సేన్ పేరు మీద రూ. 38,500 కాజేశారు. అసలు ప్రపంచంలోని ఏ క్యాలండర్ చూసినా నవంబర్ 31 ఉండనే ఉండదు. ఈ ఒక్క విషయం చాలు వారు ఎంతగా రైతులకు వచ్చే నిధులు స్వాహా చేశారో అర్థం అవుతుంది. లోన్లు తీసుకుని రుణాలు చె ల్లించిన వారికి కూడా రుణ మాఫీ తీసుకువచ్చి ఈ డబ్బులను సైతం సొంతానికి వా డుకున్నారు. అయితే గతంలోనే దీనిపై స హకార బ్యాంక్ అధికారులు విచారణ జ రిపి కమిటీని రద్దు చేసి చేతులు దులుపుకున్నారు. సుమారు రూ. 1కోటి 60 లక్షలు దుర్వినియోగం అయినా బాధ్యులైన వారిపై ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల గురించి మరిచిపోయిన అదికారులు దాదాపుగా 17 నెలలుగా దామరంచ సింగిల్ విండోకు ఎన్నికలు జరపకుండా, అటు విచారణ సైతం పూర్తి చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంపై దామరంచ గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్వాకంపై రైతులు మండిపడుతున్నారు. త్వరితగతిన విచారణ జరిపించి దామరంచ సింగిల్ విండోకు ఎన్నికలు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
అవినీతి లేదని చెప్పలేను కానీ..
పంజగుట్ట, న్యూస్‌లైన్: ‘అన్ని వ్యవస్థల్లో మంచి, చెడులు ఉన్నట్లే, నిమ్స్‌లో కూడా మంచి,చెడులు ఉన్నాయని, ఇక్కడ అవినీతి లేదని చెప్పలేను కానీ, పూర్తిగా నిర్మూలించేందుకు శక్తి మేరకు ప్రయత్నిస్తున్నా. స్టోర్ మేనేజ్మెంట్, కొనుగోళ్లలో పారదర్శకత కోసం ఐదుగురు నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేశాం. ఆపదలో వస్తున్న ప్రతీకేసును అడ్మిట్ చేసుకుంటున్నాం. ఒక్క రోగిని కూడా తిరిగి వెనక్కి పంపించడం లేదు’ అని నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో పలు అంశాలపై ఆయన విపులంగా మాట్లాడారు. నిమ్స్‌కు 20-30 ఎమర్జెన్సీ కేసులు కేసులు వస్తుంటాయని, వీరిని 24 గంటల్లోనే సంబంధిత వార్డులకు తరలించి, వైద్యం చేస్తున్నామని, ఇలా పడకల సర్దుబాటు వల్ల ఆస్పత్రికి రోజుకు అదనంగా రూ.లక్ష చొప్పున ఏడాదికి రూ.3.60 కోట్లు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఆస్పత్రిలో కంప్యూటర్లు తరచూ మొరాయిస్తున్నాయని, సర్వర్ లోపాల వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని చెప్పారు. ఫిర్యాదులపై ప్రతిరోజూ సమీక్ష : రోగుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతివార్డులోనూ ఫిర్యాదు నోట్‌బుక్‌ను ఏర్పాటు చేయడంతోపాటు వచ్చిన ఫిర్యాదుల్లో ఐదు ప్రధానఅంశాలపై నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాం. గ్యాస్‌పైపులైన్ లేకపోవడం వల్లే : ఆస్పత్రి కొత్త భవనంలో ఉన్న ఆపరేషన్ థియేటర్లలో ఆక్సిజన్ గ్యాస్‌లైన్ సరిగ్గా లేదని, పూర్తి పరికరాలు అందుబాటులో లేవని, నర్సులు, టెక్నీషియన్ల కొరత ఉందని వీటన్నింటిని పరిష్కరించడానికి రూ.8కోట్ల నిధుల అవసరముంది. ప్రభుత్వం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, ఆస్పత్రి ఆర్థికస్థితి తెలుసుకునేందుకే రెండునెలల సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే దానిపై అవగాహన వస్తోంది. త్వరలో బీబీనగర్ నిమ్స్ సేవలు : బీబీనగర్ నిమ్స్ బయటకు కనిపించేందుకు అందంగా ఉన్నా..లోపల ఫ్లోరింగ్,విద్యుత్ సదుపాయం సరిగ్గా లేదు. ప్రభుత్వం రూ.62 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని..అవి మంజూ రు కాగానే అభివృద్ధి చేస్తాం. అతితక్కువ ఖ ర్చుతో నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ సెక్రటరీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీఓలో ‘సింగిల్ విండో’
సాక్షి, ముంబై: దళారుల సాయం లేకుండా ‘లెర్నింగ్ డ్రైవింగ్ లెసైన్స్’ పొందేందుకు అంధేరి ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) సింగిల్ విండో పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో లెసైన్స్ కావాలకునే అభ్యర్థులు ఆర్టీఓ కార్యాలయంలో పడిగాపులు పడాల్సిన అవసరంలేదు. పూర్తిచేసిన దరఖాస్తు ఫారం సింగిల్ విండో కౌంటర్లో జమచేసి, రుసుం చెల్లిస్తే చాలు నిర్దేశించిన గడువులోపు లెర్నింగ్ డ్రైవింగ్ లెసైన్‌స మీ చేతిలో ఉంటుంది. దీంతో అభ్యర్థులకు దళారుల బెడద నుంచి పూర్తిగా విముక్తి లభించనుంది. సాధారణంగా ఆర్టీఓ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు దరఖాస్తు ఫారం ఎక్కడ దొరుకుతుంది...? దాన్ని ఎలా నింపాలి..? ఆ తర్వాత ఎక్కడ జమచేయాలి..? రుసుం ఏ కౌంటర్లో చెల్లించాలి..? తదితర అనేక విషయాలు తెలియక ఇబ్బందులు పడుతుంటారు. దీంతో విలువైన సమయంతోపాటు ఉద్యోగులు పెట్టుకున్న సెలవు కూడా వృథా అవుతోంది. అయినప్పటికీ పనికాదు. దీంతో విసుగెత్తిన సామాన్యులు ఈ తతంగం నుంచి తప్పుకునేందుకు నేరుగా దళారులను ఆశ్రయిస్తున్నారు. అందుకు వారు అడిగినంత చెల్లించాల్సి వస్తోంది. ఒకవేళ ఈ పనులపై కొంత అవగాహన ఉన్నవారు నేరుగా అక్కడ పనిచేసే అధికారి లేదా క్లర్క్, ప్యూన్ దగ్గరికి వెళితే దళారి సాయం లేకుండా నేరుగా వచ్చినందుకు కొంత చిన్నచూపు చూస్తారు. పలుమార్లు తిప్పించుకుంటారు. ఇక అలాంటి వాటికి స్వస్తి చెప్పేందుకు ఈ సింగిల్ విండో పథకాన్ని ప్రారంభించినట్లు అంధేరి ఆర్టీఓ అధికారి భరత్ కలస్కర్ చెప్పారు. ఆర్టీఓ కార్యాలయానికి అభ్యర్థి రాగానే దరఖాస్తు ఫారాలు ఎక్కడ దొరుకుతాయి..? ఎలా వెళ్లాలి..? తదితర వివరాలు తెలియజేసేందుకు అక్కడ సిబ్బందిని నియమిస్తారు. అక్కడ గోడపై నమూనా ఫారం ఉంటుంది. దాన్ని చూస్తూ దరఖాస్తు ఫారం నింపడమే. ఆ తరువాత దాన్ని సింగిల్ విండో కౌంటర్లో జమచేస్తే అక్కడే రుసుం తీసుకుంటారు. అనంతరం కంప్యూటర్లో వాహనం ఎలా నడపాలో కొద్దిగా శిక్షణ ఇస్తారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు గంటల్లో ఎంపికైనట్లు అభ్యర్థుల పేర్లు స్క్రీన్‌పై ప్రదర్శిస్తారు. అనంతరం లెర్నింగ్ డ్రైవింగ్ లెసైన్స్ జారీ అవుతుందని కలస్కర్ చెప్పారు. ఈ ప్రక్రియ వల్ల ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు దూరమవుతాయన్నారు. అంతేగాక అటు దళారుల ఆగడాలకు, ఇటు ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది అవినీతికి పూర్తిగా కళ్లెం వేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ సఫలీకృతమైతే నగరంలోని మిగతా ఆర్టీఓ కార్యాలయాల్లో సింగిల్ విండో పథకాన్ని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు.