ఎన్నో సరికొత్త ఆలోచనలు చేయగల, అధునాతన ఉత్పత్తులను రూపొందించగల సత్తా మన యువతలో ఉంది. వారి ఆలోచనలు ఆచరణలోకి తెచ్చే ప్రోత్సాహం వారికి అవసరం. ఈ ప్రోత్సాహాన్ని అందించాలనీ, ఔత్సాహిక యువతను వ్యాపారవేత్త లుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనీ తెలంగాణ ప్రభుత్వం 2015లో టీ–హబ్‌ను ప్రారంభించింది. ఒక ఆలోచనతో వస్తే... దానిని ఆచరణలోకి తేవడం, వస్తువు లేదా సర్వీస్‌గా మల్చడం టీ–హబ్ ఉద్దేశ్యం.
ఇది స్టార్టప్‌ల జమానా. ఒక విజయవంతమైన స్టార్టప్‌ను స్థాపించాలనే పట్టుదల చాలామందికి ఉంటుంది. కానీ, ఇందుకు కావాల్సిన ప్రోత్సాహం, సదుపాయాలు, పెట్టుబడి, మార్గనిర్దేశం ఉండదు. ఇది గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం టీ–హబ్ ద్వారా... ఒక ఆలోచనను అమలు చేయడానికి కావాల్సిన పెట్టుబడి పెట్టించడం, ఎలాంటి పద్ధతులను ఆచరించాలో అవగాహన కల్పించడం, మార్కెట్‌లోకి తీసుకెళ్లడం, నిపుణుల సలహాలు ఇప్పించడం, స్ఫూర్తి నింపడం, అవసరమైన నైపుణ్యత కలిగిన మానవ వనరులను అందివ్వడం వంటివి చేస్తోంది. ఇక ఒక స్టార్టప్ స్థాపించడానికి పాటించాల్సిన నియమ నిబంధనలపై సూచనలు ఇవ్వడం, స్టార్టప్‌లు వృద్ధి చెందడానికి కావాల్సిన భాగస్వామ్యాన్ని కల్పించడానికీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది.
ఈ ఏడేళ్లలో దాదాపు పదకొండు వేల స్టార్టప్‌లకు టీ–హబ్ సహకారాన్ని అందించింది. వీటిల్లో 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. టీ–హబ్ నుంచి 3 స్టార్టప్‌లు యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ) కంపెనీలుగా ఎదిగాయి. మరో 8 కంపెనీలు సూని కార్న్ (త్వరలో యూనికార్న్‌గా మారనున్న) కంపెనీలుగా వృద్ధి చెందాయి.
టీ–హబ్‌ను మరింత విస్తృతం చేయడానికి గానూ తెలంగాణ ప్రభుత్వం ‘టీ–హబ్ 2.0’ను నిర్మించింది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఏర్పాటైన టీ–హబ్ కంటే ఇది దాదాపుగా ఐదు రెట్లు పెద్ద ప్రాంగణం. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు నెలకొని ఉన్న హైదరాబాద్ ఐటీ హబ్ మధ్యలోని రాయదుర్గంలో రూ. 700 కోట్లతో ‘టీ–హబ్ 2.0’ నిర్మాణం జరిగింది. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త టీ–హబ్‌ను ఘనంగా ప్రారంభించారు. మొత్తం 3.14 ఎకరాలలో 5.82 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా, 3.62 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో నిర్మించిన టీ–హబ్ 2.0 ప్రపంచం లోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్.
ఇప్పటివరకు ప్యారిస్‌లోని ‘స్టేషన్ ఎఫ్’ ప్రపంచంలో అతిపెద్ద ఇన్నొవేషన్ క్యాంపస్‌గా ఉండేది. 2 వేల స్టార్టప్‌లకు ఆశ్రయం ఇవ్వగల సామర్థ్యం ఉన్న 10 అంతస్తుల భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఇంతకాలం ట్రిపుల్ ఐటీలో ఉన్న టీహబ్ కార్యకలాపాలన్నీ ఇప్పుడు ఈ కొత్త భవనంలోనే జరుగుతున్నాయి. ఇప్పటివరకూ బెంగళూరు, ఢిల్లీ, ముంబయిలలో వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ కార్యాలయాలు కూడా టీ–హబ్‌లోనే ఏర్పాటవుతున్నాయి. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నొవేషన్ మిషన్ సెంటర్ కార్యాలయాలూ ఇక్కడే ఉంటాయి. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కూడా ఉంటుంది.
ప్రపంచాన్ని మార్చే, భవిష్యత్తు ఉన్న వాటిగా భావిస్తున్న బ్లాక్ చెయిన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వంటి వాటికి టీ–హబ్‌లో ప్రాముఖ్యం ఇస్తున్నారు. దీన్ని మరింత విస్తృతం చేయాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన. ఇందుకుగానూ రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి నగరాల్లోనూ టీ–హబ్ రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. (క్లిక్: ఈ పతనం ఏ తీరాలకు చేరుస్తుందో!)
- డాక్టర్ ఎన్. యాదగిరిరావు
అదనపు కమిషనర్, జీహెచ్‌ఎంసీ
Comments
Please login to add a commentAdd a comment