హైదరాబాద్ మాదాపూర్ సమీపంలో కలకలం
నాలుగంతస్తుల భవనంలోని అందరూ సురక్షితం
గచ్చిబౌలి (హైదరాబాద్): రాజధాని నగరంలోని మాదాపూర్ ఐటీ కారిడార్‌కు చెంతనే ఉన్న సిద్దిఖీనగర్‌లో నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిన ఘటన కలకలం రేపింది. వసుకుల లక్ష్మణ్ అనే వ్యక్తి ప్లాట్ నం. 1639లో 70 గజాల స్థలంలో జీప్లస్ ఫోర్ భవనాన్ని నిర్మిచారు. ఫ్లోర్‌కు రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకు ఉంటున్నారు. వారంతా చెంతనే ఉండే ఐటీ కంపెనీల్లో హౌజ్‌కీపింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో గోడ కూలినట్లు శబ్దం వచి్చనా ఎవరూ పట్టించుకోలేదు.
కానీ రాత్రి 8.30 గంటల సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతోందని అరుపులు వినిపించడంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆదరాబాదరాగా కిందకు వచ్చేశారు. ఇంతలోనే మూడో అంతస్తులో ఉండే సాదిక్ హుస్సేన్ కిందికి దూకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈలోగా అందరూ కిందకు వచ్చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే భవనం నిర్మించినట్లు తెలుస్తోంది.
పక్క స్థలంలో గుంతలు తీయడంతోనేనా..
ఈ భవనం పక్కనే ఉండే 1605, 1638 ప్లాట్లను కలిపి భవనం నిర్మించేందుకు పిల్లర్లు వేయడానికి గుంతలు తవ్వారు. వీటితో భవనానికి ఇబ్బంది వస్తుందని ఈ భవన యజమాని వారిని హెచ్చరించారు. అయినా వారు వినలేదు. దీనివల్లే ఈ భవనం పరిస్థితి ఇలా మారిందని కొందరు అంటున్నారు. ఘటనా స్థలాన్ని జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, శేరిలింగంపల్లి టౌన్‌ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ, మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, డీఆర్‌ఎఫ్ సిబ్బంది పరిశీలించారు.
పక్కకు ఒరిగిన భవనం చుట్టూ ఉండే పది భవనాల్లో నివాసం ఉండేవారిని ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించి వేరేచోటికి తరలించారు. ఈ భవనం ముందు కేవలం పదిఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. భవనాన్ని ఇంజనీర్లు పరిశీలించి నాణ్యతను నిర్ణయిస్తారని, వారి నివేదిక ఆధారంగా ఒరిగిన భవనాన్ని తొలగిస్తామని ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. అలాగే ఈ భవనం వెనుక లోతైన గుంతలు తీసిన బిల్డర్‌పైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భవనం విరిగిందని అరుపులు వినిపించడంతో వచ్చేశా..
‘మేము మొదటి అంతస్తులో ఉంటున్నాం. రాత్రి 8.30 గంటల సమయంలో శబ్దం వచ్చింది. కొద్దిసేపటికే ఇంట్లోని సామాన్లు కిందపడిపోవడం ప్రారంభమైంది. అదే సమయంలో భవనం విరిగిందని అరుపులు వినిపించడంతో వంట చేస్తున్న స్టవ్ ఆర్పకుండానే భయంతో కిందికి వచ్చేశా’ అని జహారుల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment