ఐటీ.. మేడిన్‌ ఖమ్మం! | Minister KTR Launches IT Hub In Khammam | Sakshi
Sakshi News home page

ఐటీ.. మేడిన్‌ ఖమ్మం!

Published Tue, Dec 8 2020 5:01 AM | Last Updated on Tue, Dec 8 2020 5:56 AM

Minister KTR Launches IT Hub In Khammam - Sakshi

ఐటీ హబ్‌ను ప్రారంభిస్తున్న మంత్రులు మహమూద్‌ అలీ, కేటీఆర్, అజయ్‌

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌లను విస్తృతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో భాగంగా ఖమ్మం ఐటీ హబ్‌ను అన్ని హంగులతో నిర్మించి హైదరాబాద్, బెంగళూరు నగరాలకు దీటుగా ఐటీ సేవలు అందించనున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) తెలిపారు. ఖమ్మంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు.

ఐటీ హబ్‌కు ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు రావడంతో ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే వాటికి మేడిన్‌ ఖమ్మంగా పేరొచ్చే అవకాశం కనుచూపు మేరల్లోనే ఉందన్నారు. సర్వీసు కంపెనీలకన్నా ఐటీ రంగంలో ప్రోడక్ట్‌ కంపెనీలు ఖమ్మం వైపు దృష్టి సారించడంతో ఇది సాధ్యం కానుందన్నారు. ఐటీ హబ్‌ రెండో దశ తక్షణ నిర్మాణం కోసం రూ. 20 కోట్లను మంజూరు చేస్తున్నామని, తద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం కలుగుతుందన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌(టాస్క్‌) ఆధ్వర్యంలో నిరంతరం వృత్తి నైపుణ్య శిక్షణ కొనసాగాలని, దీంతో ఉద్యో గావకాశాలు ఏ రూపంలో ఉన్నా ఖమ్మం యువత అందిపుచ్చుకొనే అవకాశం ఉందన్నారు.

అభివృద్ధిలో ఖమ్మం దూసుకెళ్తోంది: అభివృద్ధిలో ఖమ్మం దూసుకుపోతోందని, నగరాన్ని ఎలా సుందరీకరించుకోవాలో.. ప్రభుత్వం నుంచి నిధులు ఎలా రాబట్టుకోవాలో మంత్రి అజయ్‌ నుంచి తెలుసుకొని ప్రజాప్రతినిధులు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకోవడంలో ఖమ్మం ప్రజలు ముందంజలో ఉన్నారని, దీనికి ఉదాహరణే.. ఎన్నెస్పీ కాల్వపై వాకింగ్‌ ట్రాక్, పలుచోట్ల పార్కుల నిర్మాణమని, వైకుంఠధామాన్ని సైతం అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం మంత్రి పువ్వాడకే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి పోలీస్‌ కమిషనరేట్‌ను ఖమ్మంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఐటీ రంగం కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా.. ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలనేది సీఎం కేసీఆర్‌ ఆలోచన అన్నారు. ఆయన ఆలోచనల మేరకు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట వంటి ప్రాంతాల్లో ఐటీ హబ్‌లు ఏర్పాటయ్యాయని వివరించారు.

పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి...
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర విద్యార్థి అని.. 70 ఏళ్లు పైబడిన తర్వాత కూడా కంప్యూటర్‌ నేర్చుకున్నారని, 14 భాషలు నేర్చుకున్నారని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. పీవీకి కేంద్రం భారతరత్న ప్రకటించాలని కోరారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కరణ వాది అయిన పీవీకి భారతరత్న ప్రకటించడం ఎంతైనా సమంజసమన్నారు. ప్రవాస భారతీయులు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుకుంటున్నారన్నారు. ఖమ్మంలో పీవీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం విశేషమన్నారు.

అభివృద్ధిలో రాజకీయాలు చూడం...
అభివృద్ధిలో రాజకీయాలు ఉండవని, ఇందుకు ఉదాహరణే.. నగరంలోని సుందరయ్య నగర్‌లో ఏర్పాటు చేసిన పార్కును ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వామపక్ష కార్పొరేటర్‌ ద్వారా ప్రారంభింపజేశామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో.. పనులు ఎంత వేగంగా కొనసాగుతున్నాయో ఖమ్మంను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల చైర్మన్లను, నగరపాలక సంస్థ మేయర్లను కోరుతున్నానని, త్వరలో వారందరినీ ఖమ్మంలో పర్యటించాలని కోరతానన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్, టాస్క్‌ సీఈఓ శ్రీకాంత్‌సిన్హా, కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్, టెక్నోజెన్‌ సీఈఓ లాక్స్‌ చేకూరి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement