( ఫైల్ ఫోటో )
సాక్షి, ఖమ్మం: కరోనా చికిత్స పేరిట పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక బిల్లులు వసూలు చేస్తున్నాయి. కొవిడ్ రోగుల భయాలను ఆసరా చేసుకుని ఇష్టానుసారంగా లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. ఇటీవలే కోవిడ్ బారిన పడి మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబం నుంచి అధిక బిల్లులను వసూళ్లు చేసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంపై మంత్రి పువ్వాడ అజయ్ కూమార్ సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో బాధిత కుటుంబం కట్టిన 5 లక్షల అధిక బిల్లులను ఆసుపత్రి యాజమాన్యం తిరిగి చెల్లించింది.
వివరాలు.. ఖమ్మం పట్టణానికి చెందిన అలీమ్ కొద్ది రోజుల క్రితం కోవిడ్ బారినపడ్డారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుటంబ సభ్యులు చేర్పించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించటంతో అలీమ్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆయన కుటుంబం నుంచి సదరు ఆస్పత్రి యాజమాన్యం చార్జీల రూపంలో 6 లక్షల 40 వేలు వసూలు చేసింది.
అయితే ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ దృష్టికి మృతుని కుటుంబ సభ్యులు తీసుకు వెళ్లడంతో ఆసుపత్రి యాజమాన్యంపై ఆయన మండిపడ్డారు. అధికంగా వసూలు చేసిన బిల్లులను వెనక్కి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో 5 లక్షల రూపాయలను బాధిత కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం చెల్లించింది.
చదవండి: Khammam: మధిర ఎస్సీ కాలనీలో దారుణం.. భర్త చేత భార్య పన్ను పీకించి
Comments
Please login to add a commentAdd a comment