సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా వ్యవస్థలో శాస్త్రీయతను జోడిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వివిధ రూపాల్లో విద్యార్థులకు ఎదురయ్యే ఒత్తిడులను తట్టుకునేలా ‘చెలిమి’ విద్యార్థుల్లో వ్యాపార దృక్పథాన్ని పెంచడంతో పాటు, వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించేందుకు ‘అంకురం’అనే కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో చెలిమి, అంకురం కార్యక్రమాలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు.
చెలిమి కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించే వినూత్న ఆలోచన శక్తిని పెంపొందించేలా కృషి చేస్తామన్నారు. పిల్లలు తమ నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, వేగంగా పురోగమిస్తున్న ప్రపంచానికి అనుగుణంగా తమను తాము సమాయత్తం చేసుకొనేలా తరగతి గదిలో సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లోని అభిరుచులను తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఏయే రంగాల్లో రాణిస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రీయ మదింపు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో ఒక్కో ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి చెలిమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంకురం కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా 8 జిల్లాల్లో 35 కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో 11వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నామని చెప్పారు.
మంచి భవిష్యత్‌ను అందించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బి.వినోద్‌కుమార్ అన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు ప్రకాశ్ గౌడ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకురాలు దేవసేన తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment