సాక్షి, మేడ్చల్: కేంద్రప్రభుత్వం నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకుసాగుతుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాజా కేంద్రబడ్జెట్‌లో పేదలకు పనికొచ్చేదేదీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రానికి మరోసారి కేంద్రం మొండిచెయ్యి చూపిందని, ఎన్ని విజ్ఞప్తులు చేసినా అన్నింటినీ బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. మున్సిపాలిటీల్లో మంచినీటి పథకాలకు రూ.వందల కోట్లు కేటాయిస్తున్నామని, చన్నీళ్లకు వేడినీళ్లు తోడు అన్నట్లుగా కేంద్రం నుంచి సహకారం ఆశించినా, నిరాశే మిగిలిందని కేటీఆర్ దుయ్యబట్టారు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని జవహార్‌నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లలో బుధవారం పర్యటించిన కేటీఆర్ జిల్లామంత్రి మల్లారెడ్డితో కలసి రూ.306.99 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారం భోత్సవాలు చేశారు. ‘సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఈ ఏడేళ్లలో సాధించామ’ని కేటీఆర్ పేర్కొన్నారు. దేశానికి అన్నంపెట్టే రాష్ట్రంగా ఎదగటమే కాకుండా, నాలుగోస్థానంలో రాష్ట్రముందని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పథకాలన్నింటినీ యథావిధిగా కొనసాగిస్తా మన్నారు.
‘మన ఊరు – మన బడి’కింద ప్రభుత్వం రాష్ట్రంలోని 26 వేల పాఠశా లలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీలు, ఫర్నీచర్, కుర్చీలు, తాగునీటి సదుపాయాలు కల్పిస్తోందని, దీనికిగాను సీఎం కేసీఆర్ రూ.7,289 కోట్లు కేటాయించి సర్కారీ బడులను ప్రైవేట్ బడులకు ధీటుగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశపెట్టారని పేర్కొ న్నారు. బోడుప్పల్, ఫీర్జాదిగూడతో పాటు ఆయా ప్రాంతాలకు మరో రెండు లక్షల కనెక్షన్లకు నీరందించేలా రూ.1,200 కోట్లతో శంకుస్థాపన చేసినట్లు చెప్పారు, జవహార్‌నగర్‌లో రూ.240 కోట్లతో ఇంటింటికీ రూపాయి నల్లా కనెక్షన్ అందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.
డంపింగ్‌యార్డుకు గ్రీన్ క్యాపింగ్
హైదరాబాద్ జనాభాకు సంబంధించిన చెత్తాచెదారమంతా జవహార్‌నగర్ డంపింగ్ యార్డుకే వస్తోందని, రూ.147 కోట్లతో యార్డుకు గ్రీన్‌క్యాపింగ్ చేపట్టి మురికినీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టామని కేటీఆర్ పేర్కొన్నారు. చెత్తతో విద్యుత్తు ఉత్పత్తిని చేసే ప్రక్రియలో భాగంగా జవహా ర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి 24 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామని తెలి పారు. కార్యక్రమంలో జిల్లా మంత్రి చామ కూర మల్లారెడ్డి, జలమండలి ఎండీ దాన కిశోర్, జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ హరీష్, జెడ్పీ చైర్మన్ మలిపెద్ది చంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment