అన్ని గేట్లు ఎత్తి పెట్టాల్సిందే | Minister Uttam Kumar Meeting With NDSA Officials Over Pending Projects At Delhi | Sakshi
Sakshi News home page

అన్ని గేట్లు ఎత్తి పెట్టాల్సిందే

Published Sun, Jul 21 2024 1:38 AM | Last Updated on Sun, Jul 21 2024 1:38 AM

Minister Uttam Kumar Meeting With NDSA Officials Over Pending Projects At Delhi

మేడిగడ్డ బరాజ్‌ సహా మిగతా రెండు బరాజ్‌ల గేట్లెత్తాలి... వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేయండి 

మంత్రి ఉత్తమ్, అధికారుల స్థాయి భేటీలో స్పష్టం చేసిన ఎన్‌డీఎస్‌ఏ  

రేపు మరోమారు సమావేశం

ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకే నడుచుకుంటామన్న ఉత్తమ్‌ 

కమీషన్‌ల కోసం డిజైన్‌ మార్చి ఇప్పుడు 

కారుకూతలా అంటూ కేటీఆర్‌పై మండిపాటు

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్‌ సహా మిగతా రెండు బరాజ్‌ల  గేట్లను పూర్తిగా ఎత్తి పెట్టాల్సిందేనని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అధారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) రాష్ట్ర ప్రభుత్వానికి తేలి్చచెప్పింది. ప్రస్తుతం బరాజ్‌ల్లోకి వస్తున్న వరదను వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేయాలని సూచించింది. సోమవారం మరోమారు ఇంజనీర్ల స్థాయిలో చర్చించి, తదుపరి కార్యాచరణపై చర్చిద్దామని తెలిపింది. మేడిగడ్డ బరాజ్‌ పునరుద్ధరణ సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి శనివారం మధ్యాహ్నం ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌తో సమావేశమయ్యారు.

మంత్రితో పాటు నీటి పారుదల శాఖ కార్యదర్శులు రాహుల్‌ బొజ్జ, ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఓఅండ్‌ఎం ఈఎన్‌సీ నాగేంద్రరావు, కాళేశ్వరం సీఈ సుధాకర్‌ రెడ్డిలు పాల్గొన్నారు. సుమారు రెండున్నర గంటల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల మరమ్మతులు, నీటి తరలింపు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ సహా ఇతర బరాజ్‌ల్లో మరమ్మతులు, పునరుద్ధరణలో భాగంగా ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు చేపట్టిన పనుల వివరాలను ఇంజనీర్లకు వివరించారు.

సీడబ్ల్యూపీఆర్‌ఎస్, సీఎస్‌ఎమ్మార్‌ఎస్‌కు సంబంధించిన నివేదికలు పూర్తి స్థాయిలో అందనందున బరాజ్‌ల్లో నీటి నిల్వలపై ఇప్పటికిప్పుడు నిర్ణయం చేయలేమని, ఈ దృష్ట్యా అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడమే ఉత్తమమని ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ స్పష్టం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. భేటీ వివరాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. 

ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకే ముందుకు: ఉత్తమ్‌ 
కాళేశ్వరం బరాజ్‌ల  విషయంలో ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు ముందుకు వెళతామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘బరాజ్‌లో నీటి నిల్వలు, వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చే అంశాలపై రెండున్నర గంటల పాటు చర్చించాం. ఎన్‌డీఎస్‌ఏ కమిటీ సూచనల మేరకు ఇప్పటికే చేపట్టిన పనులను, పరీక్షలను వివరించాం. ఇంకా కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని చెప్పాం. దీనిపై వారు ఇప్పటికైతే అన్ని గేట్లు ఎత్తిపెట్టి నీళ్లు కిందకి వదిలేయండని చెప్పారు. దానికి అనుగుణంగానే అన్ని గేట్లు ఎత్తినీటిని వదిలేస్తాం.

దీనిపై కేబినెట్‌లోనూ చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం’అని వివరించారు. మేడిగడ్డలో మాత్రం ఒక గేటు పనిచేయడం లేదని, దానిని పూర్తిగా కట్‌ చేసి మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మేడిగడ్డతో పాటు అన్నారంలో సీపేజీలను, సుందిళ్లలో కొన్ని లోపాలను కేంద్ర సంస్థ గుర్తించిందని, ప్రజా జీవితాలకు సంబంధించిన విషయమైనందున నిపుణుల సూచన మేరకే ముందుకెళ్తామన్నారు. ఎల్లంపల్లి ఎగువన నీటిని వినియోగించుకొని, ఆయకట్టుకు నీటిని అందించే అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. 

కుంగిందెప్పుడు..ఆర్కిటెక్ట్‌ ఎవరు..? 
ఈ సందర్భంగా కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్‌ని వినియోగించుకోవడంతో కాంగ్రెస్‌ విఫలమైందంటూ బీఆర్‌ఎస్‌ నేత మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన విమర్శలపై మంత్రి ఉత్తమ్‌ మండిపడ్డారు. ‘కేవలం కమిషన్‌ల కోసం తుమ్మడిహెట్టి డిజైన్‌ను మేడిగడ్డకు మార్చారు. రూ.38వేల కోట్లతో పూర్తయ్యేదాన్ని రూ.1.50లక్షల కోట్లకు పెంచారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని తప్పుడు లెక్కలు చెప్పారు.

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చని అంచనా వేస్తే, ఇప్పుడు కాళేశ్వరంతో ఏటా ఖర్చు రూ.10వేల కోట్లకు చేరుతోంది. ప్రాజెక్టుకు తెచ్చిన అప్పులపై వడ్డీలకే ఏటా రూ.15వేల కోట్లవుతున్నాయి. ఇంతా చేసి ఏడాది 13 టీఎంసీల చొప్పున ఐదేళ్లలో 65 టీఎంసీలు ఎత్తిపోశారు. దీనికి కర్త, ఆర్కిటెక్ట్, బిల్డర్‌ అన్నీ కేసీఆర్‌ అన్ని గొప్పలు చెప్పారు. కేసీఆర్‌ అధికారంలో ఉండగానే మేడిగడ్డ కుంగితే మాత్రం ఒక్క మాట మాట్లాడలే. ప్రాజెక్టు నాశనం చేసిన వాళ్లే ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు. అబధా్ధలు చెప్పడానికైనా కేటీఆర్‌కు హద్దుండాలి’అని ఉత్తమ్‌ విరుచుకుపడ్డారు. 

మా హయాంలోనే తుమ్మిడిహెట్టి పూర్తి.. 
ఇక తమ హయాంలోనే తుమ్మిడిహెట్టి బరాజ్‌ని పూర్తి చేస్తామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్ర స్తుత వరద దృష్ట్యా ఏ ప్రాజెక్టులోనూ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఇంజనీర్లను అప్రమత్తం చేశామన్నారు. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజె క్టు అంతరాష్ట్ర ప్రాజెక్టు అని, 90 శాతం ఆయకట్టు ఏపీలో ఉందని, ఐదు అడుగుల మేర వరద రావడంతో అక్కడ కొన్ని ఇక్కట్లు ఎదురయ్యాయని ఉత్తమ్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement