ఫ్రెండు వాళ్లింటికెళ్లొస్తానని.. కూరగాయలు తీసుకొస్తానని అడిగినా.. లేదా మీరే మరేదో పని అప్పజెప్పి పిల్లలకు వాహనాలిస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీరూ ఊచల్లెక్కపెడతారు. వరంగల్ కమిషనరేట్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఏ1గా వాహన యజమానిని, ఏ2గా పట్టుబడిన మైనర్‌ను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.
పిల్లల సంతోషం, సరదా కోసం వాహనాలిస్తున్న తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు. మైనర్లు వాహనాలు నడుపుతూ రోడ్డెక్కితే వరంగల్ కమిషనరేట్ పోలీసులు కేసులు నమోదు చేసి జువైనల్ హోమ్‌కు తరలిస్తున్నారు. ఈడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 144 మంది మైనర్లపై కేసులు నమోదు చేశారు. అందులో 91 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో 53 మందిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించే పనిలో పోలీసులు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 20 శాతం ప్రమాదాలు మైనర్లు వాహనాలు స్పీడ్‌గా, అజాగ్రత్తగా నడపడం కారణంగా జరిగినట్లు పోలీసు అధికారుల సమీక్షలో తేటతెల్ల మైంది. వేసవి సెలవుల్లో మైనర్లు వాహనాలు నేర్చుకోవాలని, పూర్తిగా నేర్చుకోకముందే రోడ్డె్డక్కి రైడింగ్ చేయాలనే ఆలోచనతో తల్లిదండ్రులపై ఒత్తిడి తేచ్చే అవకాశం ఉంది. కానీ పిల్లల ఒత్తిడికి లోనై వాహనాలను వారి చేతికిస్తే వారి భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో మైనర్లు ఎక్కువ మంది ఉండడం దురదృష్టకరం. ప్రమాదంలో గాయపడిన ఇతరులకు కూడా తీవ్ర నష్టం కలుగుతుంది. ప్రమాదాల కారణంగా పలు కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి.
లైసెన్స్ లేకుండా రోడ్డెక్కితే ప్రమాదమే..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డెక్కిన మైనర్లు హనుమకొండ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈఏడాది 43 మంది పట్టుబడ్డారు. వరంగల్‌లో 69 మంది పట్టుబడగా.. కాజీపేటలో 32 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 91 మందిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో 53 మంది అరెస్ట్ కావాల్సి ఉంది. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డెక్కిన 1,755 మందికి రూ.1,25,02,700 జరిమానా విధించారు. గతేడాది కమిషనరేట్ పరిధిలో నమోదైన మైనర్ డ్రైవింగ్ కేసులు హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 209 కేసులు నమోదు కాగా.. రూ.1,04,500 జరిమానా విధించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 280 కేసులకు రూ.1,40,000, కాజీపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 305 కేసులకు రూ.1,52,500 జరిమానా విధించారు. మొత్తం 794 కేసులు నమోదు కాగా.. వాటికి రూ. 3,97,000 జరిమానా విధించారు.
పిల్లలు అడిగినా వాహనాలివ్వొద్దు..
పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న అమితమైన ప్రేమ కారణంగా పిల్లలు అడిగిన వెంటనే తల్లిదండ్రులు వారికి బండ్లు ఇస్తున్నారు. దీని వల్ల వారు తెలిసీ తెలియని వయసులో ఎమోషన్స్‌తో స్పీడ్‌ను థ్రిల్‌గా భావించి ప్రమాదాలకు కారణమై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మైనర్లకు వాహనాలిచి్చన తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తాం. వాహనాల ఓనర్ ఏ1గా ఉంటే.. మైనర్ ఏ2గా ఉంటాడు. వేసవి సెలవుల్లో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా వాహనాలు తనిఖీలు చేస్తారు. పట్టుపడితే శిక్ష తప్పదు.
– ఏవీ.రంగనాథ్, సీపీ
Comments
Please login to add a commentAdd a comment