Traffic violation
-
మైనర్‌కు బండి.. ‘మేజర్’ మిస్టేక్
ఫ్రెండు వాళ్లింటికెళ్లొస్తానని.. కూరగాయలు తీసుకొస్తానని అడిగినా.. లేదా మీరే మరేదో పని అప్పజెప్పి పిల్లలకు వాహనాలిస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీరూ ఊచల్లెక్కపెడతారు. వరంగల్ కమిషనరేట్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఏ1గా వాహన యజమానిని, ఏ2గా పట్టుబడిన మైనర్‌ను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. పిల్లల సంతోషం, సరదా కోసం వాహనాలిస్తున్న తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు. మైనర్లు వాహనాలు నడుపుతూ రోడ్డెక్కితే వరంగల్ కమిషనరేట్ పోలీసులు కేసులు నమోదు చేసి జువైనల్ హోమ్‌కు తరలిస్తున్నారు. ఈడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 144 మంది మైనర్లపై కేసులు నమోదు చేశారు. అందులో 91 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో 53 మందిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించే పనిలో పోలీసులు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 20 శాతం ప్రమాదాలు మైనర్లు వాహనాలు స్పీడ్‌గా, అజాగ్రత్తగా నడపడం కారణంగా జరిగినట్లు పోలీసు అధికారుల సమీక్షలో తేటతెల్ల మైంది. వేసవి సెలవుల్లో మైనర్లు వాహనాలు నేర్చుకోవాలని, పూర్తిగా నేర్చుకోకముందే రోడ్డె్డక్కి రైడింగ్ చేయాలనే ఆలోచనతో తల్లిదండ్రులపై ఒత్తిడి తేచ్చే అవకాశం ఉంది. కానీ పిల్లల ఒత్తిడికి లోనై వాహనాలను వారి చేతికిస్తే వారి భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో మైనర్లు ఎక్కువ మంది ఉండడం దురదృష్టకరం. ప్రమాదంలో గాయపడిన ఇతరులకు కూడా తీవ్ర నష్టం కలుగుతుంది. ప్రమాదాల కారణంగా పలు కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. లైసెన్స్ లేకుండా రోడ్డెక్కితే ప్రమాదమే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డెక్కిన మైనర్లు హనుమకొండ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈఏడాది 43 మంది పట్టుబడ్డారు. వరంగల్‌లో 69 మంది పట్టుబడగా.. కాజీపేటలో 32 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 91 మందిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో 53 మంది అరెస్ట్ కావాల్సి ఉంది. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డెక్కిన 1,755 మందికి రూ.1,25,02,700 జరిమానా విధించారు. గతేడాది కమిషనరేట్ పరిధిలో నమోదైన మైనర్ డ్రైవింగ్ కేసులు హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 209 కేసులు నమోదు కాగా.. రూ.1,04,500 జరిమానా విధించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 280 కేసులకు రూ.1,40,000, కాజీపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 305 కేసులకు రూ.1,52,500 జరిమానా విధించారు. మొత్తం 794 కేసులు నమోదు కాగా.. వాటికి రూ. 3,97,000 జరిమానా విధించారు. పిల్లలు అడిగినా వాహనాలివ్వొద్దు.. పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న అమితమైన ప్రేమ కారణంగా పిల్లలు అడిగిన వెంటనే తల్లిదండ్రులు వారికి బండ్లు ఇస్తున్నారు. దీని వల్ల వారు తెలిసీ తెలియని వయసులో ఎమోషన్స్‌తో స్పీడ్‌ను థ్రిల్‌గా భావించి ప్రమాదాలకు కారణమై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మైనర్లకు వాహనాలిచి్చన తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తాం. వాహనాల ఓనర్ ఏ1గా ఉంటే.. మైనర్ ఏ2గా ఉంటాడు. వేసవి సెలవుల్లో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా వాహనాలు తనిఖీలు చేస్తారు. పట్టుపడితే శిక్ష తప్పదు. – ఏవీ.రంగనాథ్, సీపీ -
వైరల్ వీడియో: నడిరోడ్డులో పార్కింగ్ చేస్తే ఇదే గతి!
-
Viral: నడిరోడ్డులో పార్కింగ్ చేస్తే ఇదే గతి!
వైరల్: వాహనదారుల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. ఒక తీరని సమస్య. జరిమానాలు, కఠిన చర్యలు కూడా కొందరిని కట్టడి చేయలేని పరిస్థితి. అదే టైంలో.. కొన్ని కొన్నిసార్లు అధికారుల తీరు కూడా విమర్శలకు దారి తీస్తుంటుంది. అయితే.. అవగాహనలో ఈ మధ్యకాలంలో కొన్ని డిపార్ట్మెంట్లు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నాయి. అందులో భాగంగానే.. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకపోతే.. నిబంధనలను ఉల్లంఘిస్తే ఇలాగే జరుగుతుంటుంది అంటూ ఓ సరదా వీడియోను పోస్ట్ చేశారు బెంగళూరు ట్రాఫిక్ డీసీపీ(ఈస్ట్ డివిజన్) కళా కృష్ణస్వామి. ఈ మేరకు ట్విటర్లో ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు. నడిరోడ్డుపై పార్కింగ్ చేసి ఉన్న ఓ బైకును.. ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తన్ని పక్కన పడేసింది ఓ ఏనుగు. ఆ సమయంలో పక్కనే రోడ్డుకు కింది భాగంలో మరో రెండు బైకులు ఉన్నా.. ఆ ఏనుగు వాటి జోలికి పోలేదు. దీంతో.. నడిరోడ్డులో పార్కింగ్ చేస్తే ఇలాగే ఉంటుందని, అలా పార్క్ చేయొద్దంటూ సదరు ఐపీఎస్ అధికారిణి ట్వీట్ చేశారు. ఆ అధికారిణి టైంకి లైకులు, షేర్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఆ ఏనుగు వీడియో కిందటి ఏడాది అక్టోబర్‌లో జరిగింది. కేరళ మలప్పురంలో దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన గజరాజు.. కాసేపు ప్రజలకు పరుగులు పెట్టించింది. ఆ సమయంలోనే జనాలను బెదరగొట్టి.. అలా బైక్‌ను లాగి తన్నింది. చివరకు.. గ్రామస్తులు దానిని ఎలాగోలా అడవిలోకి తరిమేసినట్లు తెలుస్తోంది. " Don't park on main road " pic.twitter.com/Z8OYGBZmDR — Kala Krishnaswamy, IPS DCP Traffic East (@DCPTrEastBCP) January 3, 2023 -
Tiger Cub: కారు డిక్కీలో పులి పిల్ల.. పోలీసులు షాక్..
మెక్సికో సిటీ: పోలీసులు రోడ్డుపై సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారు వచ్చింది. వీళ్లను చూసి ఆపకుండా అది అలానే ముందుకుపోయిది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమ వాహనంతో వెంబడించి ఆపారు. అనంతరం కారు డిక్కీ ఒపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. డిక్కీలో సూట్‌కేస్, బ్యాగుల మధ్యన పులిపిల్లను చూసి అవాక్కయ్యారు. కారు డిక్కీలో పులి పిల్లతో పాటు తుపాకులు, బుల్లెట్లు కూడా ఉన్నాయి. దీంతో వెంటనే కారులోని దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ పులి పిల్లను వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మెక్సికోలో డ్రగ్ ట్రాఫికర్లకు పులులు పెంచుకోవడం అంటే సరదా. అక్రమంగా వాటిని కొనగోలు చేసి పెంపుడు జంతువుల్లా ఇళ్లలో పెంచుకుంటారు. అయితే పులులు, సింహాలను పెంచుకోవడం అక్కడ నేరమేమీ కాదు. కాకపోతే అధికారిక డీలర్లు, బందిఖానాలో జన్మించిన వాటిని మాత్రమే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. 2020లోనూ రోడ్డుపై తిరిగుతున్న ఓ బెంగాల్ టైగర్‌ను పోలీసులు సీజ్ చేశారు. 2019లో ఓ ఇంట్లో సింహాలను స్వాధీనం చేసుకున్నారు. సింహాల గర్జనకు బెంబేలెత్తిపోయిన పొరుగింటివారు ఫోన్ చేయడంతో అక్కడకు వెళ్లి వాటిని తరలించారు. చదవండి: Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్.. -
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా.. కచ్చితంగా దొరికిపోతారు..
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ప్రకారం సైరన్లు పోలీసు, అగ్నిమాపక శాఖ తప్ప మరెవరూ వినియోగించకూడదు. ప్రస్తుతం అనేక మంది తేలికపాటి వాహన చోదకులు వీటిని బిగించుకున్నారు. మోగిస్తే తప్ప ఈ ఉల్లంఘన విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలియదు. మరి ఇలాంటి వారికి చెక్ చెప్పడం ఎలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగానే నగర ట్రాఫిక్ విభాగం అధికారులు విజిలెన్స్ టీమ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ట్రాఫిక్ సిబ్బంది, కెమెరాల కంటికి కనిపించని ఉల్లంఘనలకు సైతం ఆస్కారం ఇవ్వద్దంటూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇచ్చిన ఆదేశాల మేరకు ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ఈ బృందాలకు రూపమిస్తున్నారు. ప్రస్తుతం విధి విధానాల రూపకల్పన, సభ్యుల ఎంపిక దశలో ఉన్న ఈ టీమ్స్ త్వరలో క్షేత్ర స్థాయిలో పని ప్రారంభించనున్నాయి. ఇలాంటి విధులకు వినియోగం.. ► ఈ విజిలెన్స్ బృందాలను ట్రాఫిక్ విభాగం అధికారులు కొన్ని రకాలైన ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి రంగంలోకి దింపుతున్నారు. సైరన్ల వినియోగంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లు, మల్టీ టోన్డ్ హారన్లు, ఎయిర్ హారన్ల వినియోగం, అనధికారికమైన బుగ్గ కార్లు, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్ తదితర ఉల్లంఘనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ►వీటిలో కొన్ని ఉల్లంఘనల్ని చౌరస్తాలు దాటేసిన తర్వాత, లేదా వాహనచోదకులు వినియోగించినప్పుడు మాత్రమే గుర్తించడం సాధ్యమవుతోంది. ఈ కారణంగానే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది ఈ వాహనచోదకులపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి ఉల్లంఘనుల కారణంగా ఇతర వాహనచోదకులకు ఇబ్బందులు కలగడంతో పాటు శబ్ధ కాలుష్యం కూడా ఏర్పడుతోంది. ఈ విషయం గమనించిన ఉన్నతాధికారులు విజిలెన్స్ టీమ్స్‌కు రూపమిస్తున్నారు. మొత్తం 48 మంది కానిస్టేబుళ్లు.. నగర ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఆరు జోన్లు ఉన్నాయి. ప్రాథమికంగా జోన్‌కు రెండేసి బృందాల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టీమ్‌కు ప్రత్యేక వాహనం, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. పని ఒత్తిడికి తావు లేకుండా రెండు షిఫ్టుల్లో వినియోగించడానికి మొత్తం 48 మందిని ఎంపిక చేస్తున్నారు. వీరికి అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు మెలకువలు నేర్పించాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆయా జంక్షన్ల వద్ద మాటు వేసి ఉండే ఈ బృందాల పని తీరును స్వయంగా ఉన్నతాధికారులే పర్యవేక్షించనున్నారు. స్పీడింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిలో యువతే ఎక్కువగా ఉంటాయి. వీరిని వెంబడించి, అడ్డుకోవడానికి ఈ టీమ్స్ ప్రయత్నిస్తే వాళ్లు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇది కొన్నిసార్లు ప్రమాద హేవుతుగానూ మారుతుంది. టీటీఐలో ప్రత్యేక శిక్షణ.. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు విజిలెన్స్ టీమ్స్ కారణంగా ఎలాంటి అపశ్రుతులు, వాహన చోదకులతో పాటు ఉల్లంఘనులకూ ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో (టీటీఐ) వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా ఉల్లంఘనులకు ఎలా, ఎప్పుడు, ఎక్కడ చెక్ చెప్పాలి? వారితో పాటు రహదారిపై ప్రయాణిస్తున్న, నడుస్తున్న వారికి ఎలాంటి హాని లేకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలు ఈ శిక్షణలో వారికి నేర్పుతున్నారు. ఈ విజిలెన్స్ టీమ్స్‌ను ప్రథమ చికిత్స, సీపీఆర్ తదితరాల్లోనూ నిష్ణాతులను చేయాలని నిర్ణయించారు. కేవలం ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికే కాకుండా వర్షాలు, నిరసనలతో పాటు ఇతర కారణాల వల్ల హఠాత్తుగా తలెత్తే తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ క్లియరెన్స్ కోసమూ వినియోగిస్తారు. (క్లిక్ చేయండి: పీసీఎస్ హెడ్– క్వార్టర్స్‌గా ఐసీసీసీ) -
ర్యాష్ డ్రైవింగ్‌తో రెచ్చిపోయిన కౌన్సిలర్ కొడుకు.. కానిస్టేబుల్‌పైనే దాడి!
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంత చెబుతున్నా కొందరు వాహనదారులు మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు. జరిమానాలు విధించినా ఏ మాత్రం మారడం లేదు. అంతేకాదు, తాజాగా కొందరు పోకిరీలు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఏకంగా ట్రాఫిక్ పోలీసుపైనే దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని సేలంలో అస్తంపట్టి పోలీసు స్టేషన్లో అశోక్(30) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, తన డ్యూటీ ముగియడంతో అశోక్ బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో ఓ చోట ముగ్గురు వ్యక్తులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అశోక్‌కు కనిపించారు. దీంతో, అశోక్ వారి బైక్‌ను ఫాలో అయ్యి ఓ చోట ఆపాడు. అనంతరం, వారిని ఎందుకు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారంటూ నిలదీశాడు. ఈ సందర్భంగా రెచ్చాఇపోయిన యువకులు.. కానిస్టేబుల్ అశోక్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం, సివిల్ డ్రెస్‌లో ఉన్న అశోక్‌పై దాడి చేశారు. ముగ్గురు యువకులతో పాటు అక్కడే ఉన్న వారి మరో ఇద్దరు అనుచరులు కూడా అశోక్‌పై దాడికి తెగబడ్డారు. దీంతో, దాడి నుంచి తేరుకున్న అశోక్.. వారిలో నలుగురిని పట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వారిని అప్పగించారు. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితులను అబ్దుల్ రెహమాన్, రికాన్‌పాషా, అస్లాం అలీ, రిజ్వాన్‌గా గుర్తించారు. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పారిపోయిన ఐదో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. కౌన్సిలర్ సదాజ్ కుమారుడు అబ్దుల్ రెహమాన్ అని పోలీసులు తెలిపారు. Pulled up for rash driving, 5 thrash off-duty cop in Tamil Nadu's Salem | Video pic.twitter.com/Mw7aAcXGtg — Times No1 (@no1_times) October 29, 2022 -
యువకుడి అసాధారణ బిజినెస్.. సినిమాలో హీరోలా..
మాడ్రిడ్: స్పెయిన్‌లో ఓ యువకుడు అసాధారణమైన ‘బిజినెస్’ చేస్తున్నాడు.. కొంత రుసుము తీసుకొని కోరుకున్న వారికి తన ‘సేవలు’ అందిస్తున్నాడు.. ఇంతకీ అతను అందిస్తున్న సేవలు ఏమిటో తెలుసా? సినిమాలో డబ్బు కోసం ఇతరుల నేరాలను తనపై వేసుకొని జైలుపాలయ్యే హీరో తరహాలో అతను వ్యవహరిస్తున్నాడు!! అంటే డ్రైవింగ్ తప్పిదాలకు పాల్పడే వ్యక్తుల నుంచి కాస్త ఫీజు వసూలు చేసి ఆ నేరాలను తనపై వేసుకుంటున్నాడు! తద్వారా వారి డ్రైవింగ్ లైసెన్సులతోపాటు డ్రైవింగ్ రికార్డులను పదిలంగా ఉంచుతూ తనపై మచ్చ వేసుకుంటున్నాడు! అలాగే వారిని ప్రభుత్వ జరిమానాల బారి నుంచి తప్పిస్తున్నాడు. ఇలా ఇప్పటివరకు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు 100 మంది వాహనదారుల నేరాలను తనపై వేసుకున్నాడు. ఇందుకోసం ‘ఖాతాదారుల’ నుంచి రూ. 6 వేల నుంచి రూ. 16 వేల వరకు వసూలు చేస్తున్నాడు. స్పెయిన్ మోటారు వాహన చట్ట నిబంధనల ప్రకారం ఒక్కో వాహనదారుడికి లైసెన్స్ జారీ చేసే సమయంలో 12 పాయింట్లు కేటాయిస్తారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్ తదితర నేరాలకు పాల్పడే వాహనదారుల నుంచి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు వసూలు చేయడంతోపాటు వారి నిర్ణీత పాయింట్లు కోల్పోగానే లైసెన్సులను సస్పెండ్ చేస్తారు. ఈ నేపథ్యంలో వాహనదారులను కాపాడేందుకు ఆ యువకుడు నేరాన్ని తనపై వేసుకొని జరిమానాలు కడుతున్నాడట. ఇప్పటివరకు అతని డ్రైవింగ్ లైసెన్స్ కింద ఏకంగా మైనస్ 321 పాయింట్లు ఉండటం గమనార్హం. రెండేళ్లుగా పోలీసులను బురిడీ కొట్టిస్తున్న ఆ యువకుడు ఇటీవల మాత్రం దొరికిపోయాడట. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల కోసం ఓ ద్విచక్ర వాహనదారుడి వాహనాన్ని పోలీసులు ఆపబోగా అతను ఆపకుండా పరారయ్యాడు. కానీ మర్నాడే ఆ నేరాన్ని తానే చేశానంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ యువకుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆన్లైన్లో తనిఖీ చేయగా అసలు బండారం బయటపడింది. దీంతో అతన్ని జైలుకు పంపారు. చదవండి: మళ్లీ చూడాలంటే 107 ఏళ్లు ఆగాల్సిందే! -
ట్యాంక్‌బండ్‌పై నిర్లక్ష్యంగా బండి పెడితే రూ. 1000 పడుద్ది!
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై ఇక నుంచి ఎక్కడంటే అక్కడ వాహనాలు పార్కింగ్ చేసేందుకు కుదరదు. నిర్దేశించిన స్థలాల్లో మాత్రమే వాహనాలను నిలపాల్సి ఉంటుంది. రోడ్డు పక్కన బైక్ ఆపుకొని అలా హుస్సేన్‌సాగర్‌ను చూస్తామంటే రూల్స్ ఒప్పుకోవు. నో పార్కింగ్ జోన్లో వాహనం పార్కింగ్ చేశారో క్షణాల్లో మొబైల్ ఫోన్‌కు రూ.1000 జరిమానా విధిస్తూ సందేశం వస్తుంది. నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసిన చోట్ల స్పీడ్ గన్లను కూడా ఫిక్స్ చేశారు. నిమిషం పాటు అలా వెళ్లి వస్తామని నిర్లక్ష్యంగా పార్కింగ్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నో పార్కింగ్ బోర్డులు అడుగడుగునా ఏర్పాటు చేసి ఒక వేళ పార్కింగ్ చేస్తూ రూ.1000 జరిమానా అంటూ రాయడంతో ఇక వాహనదారులు అప్రమత్తం కావాల్సిందే. చదవండి: మాస్టారు పాడె మోసిన మంత్రి ‘ఎర్రబెల్లి’ -
శభాష్.. ట్రాఫిక్ పోలీస్
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి తెచ్చిన పరికరాలతో నిబంధనలకు విరుద్దంగా బైక్‌ను తయారు చేసి అధిక శబ్ధంతో చెవులు చిల్లులు పడే రీతిలో సైలెన్సర్ ఏర్పాటు చేసి దూసుకుపోతున్న స్కూటరిస్టును జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని కేసు చేసి బైక్‌ను సీజ్ చేసిన ఘటన ఓ ఎన్ఆర్ఐని విశేషంగా ఆకట్టుకుంది. అమెరికాలోని ఓ చారిటబుల్ మెడికల్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న డాక్టర్ దివాకర్‌రావు కట్టార్ ఈ మేరకు పోలీసుల పనితీరు మెచ్చుకుంటూ నగర పోలీసు కమిషనర్‌కు ట్వీట్ చేశారు. ఈ నెల 8వ తేదీన ఎంహెచ్ 49డబ్ల్యూ4141 బైక్‌పై అధిక శబ్ధంతో ఓ యువకుడు దూసుకుపోతుండగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.ముత్తు ఛేజ్ చేసి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో పట్టుకున్నారు. ఆరా తీయగా ఆ బైక్‌ను కె.నర్సింహ(23) నడుపుతున్నట్లు తేలింది. అంతకుముందు ఈ బైక్ టోలీచౌకీకి చెందిన సయ్యద్ ఎజాజ్ హుస్సేన్ది కాగా దానికంటే ముందు ఆస్ట్రేలియాకు చెందిన హుస్సేన్ పేరుతో ఉన్నట్లు తేలింది. ఎలాంటి పత్రాలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నర్సింహ ఈ బైక్‌ను తయారు చేయించాడు. విపరీతమైన శబ్ధంతో సైలెన్సర్ ఏర్పాటు చేశారు. నిందితుడిపై సెక్షన్ 80 మరియు 190(2) మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం దివాకర్‌రావును విశేషంగా ఆకర్షించింది. తాను హైదరాబాద్ రోడ్లపై వెళుతున్నప్పుడు అడ్డదిడ్డంగా వెళుతున్న వాహనాలు సౌండ్ పొల్యూషన్‌తో ఇబ్బంది పడ్డానని ట్వీట్ చేశారు. శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న ఇలాంటి బైక్‌లను సీజ్ చేయాలన్నారు. సౌండ్ పొల్యూషన్, రోడ్ఫైటింగ్ ఇక్కడ ఎక్కువయ్యాయని వీటిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. (చదవండి: ప్లేటు మారిస్తే.. ఫేట్ మారిపోద్ది!) -
మోస్ట్ వాంటెడ్ ఆటో
1..2..3..కాదు... ఏకంగా 83 ఉల్లంఘనలు. సిటీలో ఓ ఆటో డ్రైవర్ నిర్వాకమిది. ఏపీ 28 టీఈ 5316 రిజిస్ట్రేషన్ నంబర్‌తో కూడిన ఆటో సిటీలోని పలుచోట్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడడంతో...2014 నుంచి ఇప్పటి వరకు 83 ఈ–చలానాలు విధించారు. శంకర్ అనే డ్రైవర్ నడుపుతున్న ఈ ఆటోను ఎట్టకేలకు మంగళవారం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు చెక్‌పోస్ట్ వద్ద పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. -
‘స్పాట్’ పెడతారు!
►ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఇక పెనాల్టీ పాయింట్స్ ►ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ►రెండేళ్లలో 12 పెనాల్టీ పాయింట్లు వస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ►ప్రాథమికంగా ‘స్పాట్ చలాన్’కే పరిమితం సిటీబ్యూరో: హెల్మెట్ లేకుండా రాంగ్ సైడ్‌లో దూసుకుపోతున్నాం... ట్రాఫిక్ పోలీసులు ఆపితే విధించిన చలాన్ చెల్లించేద్దాం... అక్కడితో కథ ముగిసిపోతుందని అనుకుంటున్నారా..! ఇకపై అలా కుదరదు. జరిమానాతో పాటు మీరు చేసిన రెండు ఉల్లంఘనలకు సంబంధించి మూడు పెనాల్టీ పాయింట్లు మీ డ్రైవింగ్ లైసెన్స్లోకి చేరతాయి. ఇలా పాయింట్లు పడటం ప్రారంభమైన నాటి నుంచి 24 నెలల్లో మీ స్కోర్ 12 దాటితే సీన్ మారిపోతుంది. మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెండేళ్ల పాటు సస్పెండ్ చేయడం ద్వారా వాహనం నడిపే చాన్స్ లేకుండా చేయనున్నారు. దీనికి సంబంధించిన కీలక ఉత్తర్వుల్ని ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. మంగళవారం నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. భవిష్యత్తులో పెనాల్టీ పాయింట్స్ విధింపు విధానాన్ని మరింత విస్తరించే ఆస్కారం ఉందని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి మూడు కమిషనరేట్లకే... ఈ పెనాల్టీ పాయింట్స్ విధానం పూర్తిగా కంప్యూటర్, సాఫ్ట్వేర్, సర్వర్ ఆధారంగా జరుగుతుంది. రాష్ట్రంలో రాజధానిలో ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు మినహా మిగిలిన చోట్ల ఉల్లంఘనల నమోదు ఆన్లైన్లో జరగట్లేదు. పీడీఏ మెషిన్లు, సర్వర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేని నేపథ్యంలోనే మిగిలిన కమిషనరేట్లు, జిల్లాల్లో పెనాల్టీ పాయింట్స్ విధానం ప్రస్తుతానికి అమలుకాదని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. భవిష్యత్తులో ఏఏ కమిషనరేట్లు, జిల్లాలు అప్డేట్ అయితే ఆయా ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేయడానికి అనువుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికైతే స్పాట్ చలాన్లకే... ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లం«ఘనులకు రెండు రకాలుగా జరిమానాలు విధిస్తుంటారు. పాయింట్ డ్యూటీలుగా పిలిచే క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు రోడ్లపై వాహనాలను ఆపి పీడీఏ మిషన్ల ద్వారా విధించడం మొదటి రకం. వాహనచోదకుడి పరోక్షంలో ఉల్లంఘనల్ని కెమెరాల ద్వారా షూట్ చేసి, ఆర్టీఏ డేటాబేస్‌లో ఉన్న చిరునామా ఆధారంగా ఈ–చలాన్ పంప డం రెండో రకం. పెనాల్టీ పాయింట్స్ విధానం మొత్తం వాహనచోదకుడి డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా జరుగుతుంది. పోలీసులు పట్టుకున్నప్పుడు అతడి లైసెన్స్ నెంబర్ సేకరించడం ద్వారా పాయింట్స్ దానిపై నమోదయ్యేలా చూ స్తారు. ఈ–చలాన్ విధానంలో ఈ అవకాశం లేకపోవడంతో ప్రస్తుతానికి పెనాల్టీ పాయిం ట్స్‌ను స్పాట్ చలాన్లకే వర్తింపజేస్తున్నారు. ఆ ఇబ్బందులకు ఆస్కారం లేకుండా... ప్రస్తుతం పెనాల్టీ పాయింట్స్ విధానాన్ని స్పాట్ చలాన్లకే పరిమితం చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఓ వ్యక్తికి చెందిన వాహనాన్ని మరొకరు తీసుకువెళ్ళి ఉల్లంఘనకు పాల్పడ్డాడనుకుందాం. ఈ–చలాన్ విధానంలోనూ పెనాల్టీ పాయింట్స్ విధిస్తే ఆ పాయింట్స్ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తికి కాకుండా, వాహనం యజమానికి చేరతాయి. మరోపక్క ప్రస్తుతం సిటీలో తిరుగుతున్న వాహనాల్లో అత్యధికం రిజిస్ట్రేషన్లు మారనివే. సెకండ్ హ్యాండ్ వాహనాలను ఖరీదు చేస్తున్న వారు వాటి రిజిస్ట్రేషన్లను తమ పేరిట మార్చుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లోనూ వాహనం నెంబర్ ఆధారంగా పెనాల్టీ పాయింట్స్ విధిస్తే అవి దాని పాత యజమానికి వర్తిస్తాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం స్పాట్ చలాన్ విధానంలోనే ఈ పాయింట్లు వర్తింపజేయాలని నిర్ణయించారు. తీవ్రమైన వాటికే తొలి ప్రాధాన్యం... ట్రాఫిక్ పోలీసులు వాహనచోదకుల్ని పట్టుకున్నప్పుడు, ఫొటో ద్వారా బంధించినప్పుడు వారి పాల్పడిన ఉల్లంఘన ఆధారంగా జరిమానా విధిస్తుంటారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసు విభాగం హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం నుంచి క్యాబ్ రిజిస్ట్రేషన్ లేకపోవడం వరకు మొత్తం 101 రకాలైన ఉల్లంఘనలకు జరిమానా విధిస్తున్నారు. అయితే తొలిదశలో పెనాల్టీ పాయింట్ విధానాన్ని ఎంవీ యాక్ట్‌లో ఉన్న ఎనిమిది సెక్షన్ల కిందికి వచ్చే 17 ఉల్లంఘనలకే వర్తింపజేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పు కలిగించేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వారికీ ముప్పు కలిగించేవి. అత్యంత ప్రమాదకరంగా పరిగణించే ఈ మూడో తరహా ఉల్లంఘనల పైనే ప్రస్తుతానికి పెనాల్టీ పాయింట్స్ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో ఆటోలో ముందు భాగంలో ఎక్కువ మంది ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం నుంచి మద్యం తాగి వాహనం నడపడం వరకు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్‌లో గోల్మాల్ చేస్తే జైలుకే... ఈ ఉత్తర్వులు జారీ చేసింది ట్రాన్స్పోర్ట్ విభాగమైనా... అత్యధికంగా అమలు చేసేది మాత్రం ట్రాఫిక్ పోలీసులే. నిర్ణీత కాలంలో పరిమితికి మించి పెనాల్టీ పాయింట్స్ పొందిన వాహనచోదకుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను పోలీసు విభాగం సిఫార్సుల ఆధారంగా ఆర్టీఏ విభాగం సస్పెండ్ చేస్తుంది. ఈ వివరాలను ఆర్టీఏ డేటాబేస్‌లో పొందుపరుస్తుంది. ట్రాఫిక్ విభాగం అధికారుల వద్ద ఉండే పీడీఏ మిషన్లు ఈ సర్వర్‌తోనూ అనుసంధానించి ఉంటాయి. దీంతో ఎవరైనా వ్యక్తి సస్పెండ్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ వినియోగించి వాహనం నడుపుతుంటే ఆ విషయాన్ని పోలీసులు తేలిగ్గా గుర్తిస్తారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటూ అరెస్టు చేయించేందుకు ఆస్కారం ఉంది. సస్పెండ్ అయింది కదా అని లైసెన్స్ విడిచిపెట్టి, అసలు లేదంటూ వాహనం నడిపినా జైలుకు వెళ్ళడం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. నగరంలో వాహనాలు వినియోగించి అనేక నేరాలకు పాల్పడిన వారు ఎందరో ఉంటున్నారు. ఇలాంటి వారిపై ఇప్పటి వరకు ప్రత్యేకమైన చర్యలకంటూ ఆస్కారం లేదు. ఫలితంగానే స్నాచర్లు వంటి వాళ్ళు పదేపదే వాహనాలపై తిరుగుతూ నేరాలు చేస్తున్నారు. తనిఖీల్లో పోలీసులు ఆపితే... తమ దగ్గరున్న పత్రాలు చూపించి తప్పించుకుంటున్నారు. అయితే పెనాల్టీ పాయింట్స్ వి«ధింపులో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఇలాంటి వారికీ చెక్ పడనుంది. ఈ విధానంలో కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలే కాదు.. ప్రమాదాలకు కారకులైనా, వాహనాన్ని వినియోగించి స్నాచింగ్, దోపిడీ వంటి నేరాలు చేసినా.. వారిపై కేసుతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్‌పై అత్యధిక పెనాల్టీ పాయింట్లు పడేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పదేపదే వాహనాలు వినియోగిస్తూ నేరాలు చేసే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సులు సైతం సస్పెండ్ అవుతాయి. ఈ డేటాబేస్ సాయంతోనూ పాత నేరగాళ్ళను గుర్తించడంతో పాటు వారికి చెక్ చెప్పడానికి ఆస్కారం ఏర్పడనుంది. కొన్నాళ్ళ పాటు అవగాహన కల్పిస్తాం ఈ పెనాల్టీ పాయింట్స్ విధింపు విషయంలో వాహనచోదకులకు కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించాం. నిర్ణీత కాలం వరకు వివిధ మాధ్యమాల ద్వారా వాహనచోదకుల్లో ఈ పాయింట్స్‌పై అవగాహన కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. మీడియాతో పాటు ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్‌మీడియాలు, ప్రధాన కూడళ్ళలో ఉన్న బోర్డులు, ట్రాఫిక్ పోలీసుల పబ్లిక్ అడ్రస్ సిస్టం, పోలీసుస్టేషన్ల వారీగా కరపత్రాల పంపిణీ ద్వారా విస్తృతస్థాయిలో అవగాహనకు కృషి చేస్తాం. ఆపై ఆర్టీఏ అధికారుల సాయంతో రంగంలోకి దిగి పాయింట్స్ విధానం పక్కాగా అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – డాక్టర్ వి.రవీందర్, ట్రాఫిక్ చీఫ్ -
ఉల్లంఘనులు
♦ ఫొటోగ్రాఫర్లుగా మారిన ట్రాఫిక్ పోలీసులు ♦ వీడియోలు, ఫొటోలతో నగరంలో హల్చల్ ♦ అస్తవ్యస్తంగా మారుతున్న ట్రాఫిక్ ♦ బందరురోడ్డులో అర్థంలేని నిబంధనలతో వాహనదారుల అవస్థలు నగరంలో తాజా ట్రాఫిక్ నింబధనలు పోలీసుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసుల చేతిలో కెమెరాలు పెట్టి ఇష్టానుసారంగా ఫొటోలు తీయించి జరిమానాలు విధించడం, బందరురోడ్డులో అర్థంలేని ట్రాఫిక్ నిబంధనలు విమర్శలకు తావిస్తున్నాయి. స్వామిభక్తి ప్రదర్శించి ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూర్చేందుకు పోలీసులు కావాలనే ఇలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : ట్రాఫిక్ పోలీసులంటే ప్రజలకు రక్షణ కల్పించేవారు.. ప్రమాదాలు జరగకుండా, ప్రయాణాలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకునే రక్షకభటులు. కానీ, నగరంలో పరిస్థితి చూస్తే మాత్రం ట్రాఫిక్ పోలీసులంటే ఫొటో, వీడియోగ్రాఫర్లే గుర్తొస్తారు. చోద్యంగా ఉన్నా ఇది నిజమే. ట్రాఫిక్ ఉల్లంఘనుల ఆట కట్టించేందుకు, నిబంధనలను తప్పనిసరిగా పాటించేందుకు నగర పోలీస్ కమిషనర్ వీరి చేతిలో కెమెరాలు పెట్టారు. నిబంధనలు అతిక్రమించే వారిని ఫొటో తీసి వారి వాహనం నంబరు ఆధారంగా ఇంటికే జరిమానా చలానాలు పంపించే ఈ విధానాన్ని గత నెలలో ప్రారంభించారు. అయితే, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై తీస్తున్న ఫొటోలకు చిక్కకుండా తప్పించుకునే పనిలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రెడ్‘సిగ్నల్’ వ్యవస్థ నగరంలోని ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ ఒక్కటి కూడా సక్రమంగా పనిచేయట్లేదు. కొన్నిచోట్ల సిగ్నల్ సెంటర్లలో ఎల్లో లైట్లు లేవు. నేరుగా రెడ్‌లైట్ పడిపోతోంది. మరికొన్ని చోట్ల వాహనాలు రోడ్డు మధ్యలో ఉండగానే రెడ్‌సిగ్నల్ పడిపోతోంది. అదే సమయంలో వేరే వైపు నుంచి వచ్చే వాహనాలు బయల్దేరడం, ఒకరికి ఒకరు ఎదురుపడటంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. అర్థంలేని నిర్ణయాలతో హడావుడా..! బందరురోడ్డులోని డీవీ మనార్ నుంచి స్వీట్ మ్యాజిక్ వైపునకు వెళ్లే వాహనాల సంఖ్య ఇటీవల పెరిగింది. గతంలో ఇక్కడ బందర్‌రోడ్డు క్రాస్ చేసేందుకు 15 సెకన్ల సిగ్నల్ సమయాన్ని మాత్రమే ఇచ్చేవారు. దీనిని కనీసం 30 సెకన్లకు పెంచితే ట్రాఫిక్ తగ్గేది. ఇదంతా ఎందుకనుకున్న ట్రాఫిక్ పోలీసులు ఏకంగా డీవీ మనార్, పీవీపీ వద్ద రోడ్డు క్రాసింగ్ రద్దుచేశారు. తాజా నిర్ణయంతో డీవీ మనార్ నుంచి స్వీట్ మ్యాజిక్ వైపునకు రావాలంటే బెంజిసర్కిల్ వరకు వెళ్లి తిరిగి రావాలి. స్వీట్ మ్యాజిక్ నుంచి డీవీ మానర్‌కు వెళ్లాలంటే పీవీపీ వద్దకు వెళ్లి రోడ్డు క్రాస్ చేసి రావాలి. 20 సెకన్లలో రోడ్డు దాటే పద్ధతికి స్వస్తిచెప్పి ఏకంగా ఐదు నిమిషాల పాటు కిలోమీటరున్నర తిరిగొచ్చేలా అధికారులు నిర్ణయించారు. దీంతో బిజీ సమయంలో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. వన్‌వేలు, నో పార్కింగ్లు ఎక్కడ సార్? ♦ నగరంలో వన్‌వేలు, నో పార్కింగ్ స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. మచ్చుకైన హెచ్చరిక బోర్డులు కనిపించవు. నగరానికి కొత్తగా వచ్చిన వారైతే ఎటు వెళ్లాలో కూడా సమాచారం ఉండదు. ♦ ఇంతా జరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం కెమెరాలు పట్టుకుని ఫొటోలు తీసేస్తూ తమ పని తాము చేసుకుంటున్నారు. హెచ్చరికల బోర్డులు లేనపుడు ఫొటోలు తీసి జరిమానాలు ఎలా విధిస్తారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. తప్పొకరిది.. జరిమానా వేరొకరికా..? వాహనదారుడి స్నేహితుడు కావచ్చు.. బంధువు కావచ్చు.. తెలిసిన మరెవరైనా కావచ్చు. ఏదైనా పనిమీద అర్జెంటుగా వెళ్లాల్సి రావచ్చు. అటువంటి సమయాల్లో పక్కవారి వాహనాలు వాడుకోవడం కొత్తేమీ కాదు. నగర పోలీసుల కొత్త చట్టం ప్రకారం వాహనం ఎవరు నడిపినా శిక్ష మాత్రం వాహన యజమానికే చలానా రూపంలో వెళ్లిపోతోంది. ఇది ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. 150 కెమెరాలు, 26 వీడియో కెమెరాలు నగరంలో ఏఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయివారు ఫొటోలు తీసే కార్యక్రమాన్ని చేపట్టారు. సీఐ స్థాయి నుంచి పైఅధికారులతో పోలీస్ కమిషనర్ వీడియో కెమెరాల బృందాలను ఏర్పాటుచేశారు. వీరంతా నగరంలోని 26 ప్రాంతాల్లో వీడియోలు తీయడం, జరిమానాలు విధించడం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చెప్పాల్సిన అధికారులు ఇలా తిరుగుతుండటంతో జనం నవ్వుకుంటున్నారు. బందరురోడ్డుపై ఆంక్షలు ఎవరి కోసం..? బందరురోడ్డులో ఇటీవల అమలుచేస్తున్న ట్రాఫిక్ నిబంధనలు స్వామిభక్తి కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డును నేరుగా దాటే కార్యక్రమానికి స్వస్తిచెప్పి ఊరంతా తిరిగొచ్చేలా పోలీసులు ప్లాన్ వేసి అమలుచేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు పోరంకిలో నివాస గృహం నిర్మితం కానుంది. ముందు నుంచే జనానికి ట్రాఫిక్ ఆంక్షలు అలవాటు చేసేందుకు పోలీసులు తీసుకున్న నిర్ణయాల్లో భాగమే ఇదని వాహనదారులు పేర్కొంటున్నారు. ఖజానా నింపుకొనేందుకేనా? పోలీసులు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే పనుల్లో భాగమే ఈ ట్రాఫిక్ చర్యలని సమాచారం. నెలకు కోటి రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు జమ చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలీసులు ఫొటోలు, వీడియోల ద్వారా రోజుకు కనీసంగా 500 మంది నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. -
ఇక ‘నగదు రహిత చలానా’
కొత్త విధానాన్ని ప్రారంభించిన హోంమంత్రి మూడు చలాన్లు పెండింగ్ ఉంటే నోటీసులు స్పందించకపోతే జైలు రూ.80 కోట్ల బకాయిలు సిటీబ్యూరో: ‘ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులు ప్రభుత్వానికి జరిమానా రూపంలో సుమారు రూ.80 కోట్లు బకాయి పడ్డారు. మీ వాహనంపై మూడు చలానాలు ఉంటే వెంటనే జరిమానా చెల్లించండి. లేదంటే జైలే’ అంటున్నారు నగర ట్రాఫిక్ పోలీసులు. ఇందులో భాగంగా మొండి బకాయిదారులకు బుధవారం నుంచి నోటీసులు జారీ చేస్తారు. వీటికి స్పందించకపోతే చార్జీషీట్ వేసి కోర్టులో హాజరుపరుస్తామని చెబుతున్నారు. ఇలాంటి మొండి బకాయిదారులు నగరంలో సుమారు 60 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా వారం రోజుల్లో పెండింగ్ చలానాలు చెల్లించాల్సిందే. లేదంటే అంతే సంగతులు. అంతేకాదు... ట్రాఫిక్ సిబ్బంది లేరని ఉల్లంఘనకు పాల్పడ్డారో పప్పులో కాలేసినట్లే. నగరంలోని 355 కూడళ్లలో ఉల్లంఘనులను నిఘా కెమెరాలు పసిగడుతుంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఇందులో భాగంగానే ట్రాఫిక్ విధులు, చలానా విధానం పారదర్శకంగా ఉండేలా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆంనంద్లతోకలిసి ‘నగదు రహిత ట్రాఫిక్ చలాన్’ విధానాన్ని మంగళవారం నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కొత్త విధానం వల్ల వాహనదారుడు జరిమానాను విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు నగదు రూపంలో చెల్లించనక్కర్లేదు. డెబిట్, క్రేడిట్, ఈ-సేవ, మీసేవ, ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్, బ్యాంకులలో చెల్లించాల్సి ఉంటుంది. నిజాయితీగా విధి నిర్వహణ: హోం మంత్రి కొత్త విధానం వల్ల ట్రాఫిక్ సిబ్బంది నీతి, నిజాయితీలతో విధులు నిర్వహిస్తారని, ఎలాంటి ఆరోపణలకూ ఆస్కారం ఉండదని హోం మంత్రి అన్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణతోనేఅభివృద్ది సాధ్యమని చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ లేనివిధంగా చేసేందుకు ప్రత్యేక నిపుణులతో అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇందుకోసం అవసరమైన చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోందన్నారు. పోలీసు సేవలు ప్రజలు ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్న జంట పోలీసు కమిషనర్లను ఆయన అభినందించారు. డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఠాణాలకు వారం రోజుల్లో కొత్త వాహనాలు అందిస్తున్నట్లు ప్రకటించారు. రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ నగర ట్రాఫిక్ పోలీసుల ప్రయోగాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. రాంగ్ పార్కింగ్ చేసే వాహనాలను తీసుకెళ్లే ట్రాఫిక్ క్రేన్లకు వెనక, ముందు వైపు సీసీ కెమెరాలను అమర్చి సరికొత్తగా రూపొందించారు. వాటిని హోం మంత్రి ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలిసింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగదు రూపంలో పెండింగ్ చలానాలు గతంలో రోజుకు రెండు వేల మంది చెల్లించేవారని... ప్రయోగాత్మకంగా చేపట్టిన నగదు రహిత చలాన్ విధానంతో పెండింగ్ చలానాదారులు రోజుకు 8 నుంచి 9 వేల మంది చెల్లిస్తున్నారని తెలిపారు. వాహనదారుడు ఉల్లంఘనకు పాల్పడితే చలాన్ రసీదు మాత్రమే ఇస్తామన్నారు. నగదు వసూలు చేయబోమన్నారు. మంచి ఫలితాలు రావడంతో ఈ విధానాన్ని నేటి నుంచి అధికారికంగా ప్రారంభించామన్నారు. -
పోస్టాఫీసుల్లోనూ...
* ట్రాఫిక్ ఈ-చలాన్ చెల్లించే సదుపాయం * నేటి నుంచి అందుబాటులోకి... సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి.. ఈ-చలాన్ బారిన పడిన వాహనదారులు ఇక నుంచి పోస్టాఫీసుల్లోను డబ్బులు చెల్లించవచ్చు. ఈ మేరకు పోస్టల్, ట్రాఫిక్ శాఖ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. నగరంలోని 250 పోస్టాఫీసుల్లో పెండింగ్ చలాన్ రుసుం చెల్లించే అవకాశాన్ని ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ కల్పించారు. సోమవారం నుంచి ఈ సదుపాయం అందు బాటులోకి తెస్తున్నారు. నగరంలో సుమారు 40 లక్షల పెండింగ్ చలానాలున్నాయి. వీరి నుంచి సుమారు రూ.80 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉంది. ఇటీవలే నగదు రహిత చలాన్ విధానాన్ని ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు నగదు చెల్లించనవసరం లేదు. తమకు నగదు చెల్లించమని ట్రా ఫిక్ సిబ్బంది లేదా ఏ అధికారైనా అడిగితే 9010203626 నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. చలాన్లను సెల్ఫోన్ల ద్వారా చెల్లించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా యాప్‌ను సైతం రూపొందించారు. ఈ యాప్‌ను ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఈ-చలాన్ తెలంగాణ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్ ద్వారా మీ వాహనంపై ఏమైనా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయా ? అనే విషయాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించే వారు ఠీఠీఠీ.జ్టిఞ.జౌఠి.జీ వెబ్సైట్ తెరచి, అందులో ఈ-చలాన్ స్టాటస్పై క్లిక్ చేయాలి. చలాన్ ఇలా కూడా చెల్లించవచ్చు... * డెబిట్, క్రెడిట్ కార్డులు, ఎస్బీహెచ్, ఐసీఐసీఐ,ఆంధ్రబ్యాంక్ ద్వారా. * ఈ-సేవా, మీ-సేవా సెంటర్లు * ఏపీ ఆల్‌లైన్ సెంటర్లు * పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ * కంపౌండింగ్ బూత్ నెట్ బ్యాంకింగ్ ... -
‘జరిమానా’ సొమ్ములో సగం మాకివ్వండి..
ప్రభుత్వానికి ట్రాఫిక్ విభాగం విజ్ఞప్తి సాక్షి, ముంబై : తమ విభాగం గత ఏడాది వాహనదారుల నుంచి వసూలు చేసిన సొమ్ములో సగం డబ్బును తమకు ఇవ్వాల్సిందిగా ట్రాఫిక్ విభాగం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసింది. గత ఏడాది ముంబై ట్రాఫిక్ విభాగం దాదాపు రూ. 20 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది. ఇందులో సగం డబ్బు తమకు ఇస్తే బ్రీత్ అనలైజర్లు, స్పీడ్గన్లు, క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ (సీసీటీవీ) తదితర మెరుగైన సౌకర్యాలను సమకూర్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ట్రాఫిక్ విభాగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిని పరీక్షించేందుకు సరిపడినంత పరికరాలు కొరవడ్డాయన్నారు. గత ఏడాది ట్రాఫిక్ విభాగం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 16 బ్రీత్ అనలైజర్లను అందుకుంది. అవేకాకుండా మొత్తంగా 90 బ్రీత్ అనలైజర్లు ఉన్నాయనీ, అయితే ఇవి సరిపడినంతగా లేవని అధికారి తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం ‘జరిమానా’ సొమ్ములో సగం తమ విభాగానికి బదలాయించేందుకు అంగీకరిస్తే, తాము నిబంధనలను మరింత కఠినంగా అమలుచేసి ఆదాయం పెంపునకు కృషిచేసేందుకు వీలుపడుతుందని ట్రాఫిక్ విభాగ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డాక్టర్.బి.కె.ఉపాధ్యాయ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనకు అనుమతి లభిస్తే ట్రాఫిక్ విభాగానికి ఎంతో లాభపడుతోందన్నారు. ఇతర నిధులను ఆశించకుండా ఉండేందుకు ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ట్రాఫిక్‌ను పర్యవేక్షించేందుకు తమకు అత్యవసరంగా చాలా పరికరాలు అవసరం ఉంటాయని ఆయన వివరించారు. ఈ-చలాన్‌తో ‘ట్రాఫిక్’కు పనిభారం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-చలాన్ వ్యవస్థ ట్రాఫిక్ విభాగానికి మరింత పని భారాన్ని తెచ్చిపెట్టింది. నవీముంబై ట్రాఫిక్ విభాగం రాష్ట్రంలోనే మొదటిసారిగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు ఈ-చలాన్ వ్యవస్థను గత ఏడాది ప్రారంభించింది. అయితే ట్రాఫిక్ విభాగం సమయం ఆదా చేసేందుకు ఈ-చలాన్ వ్యవస్థను ప్రారంభించినప్పుటీ తమకు పని భారం ఎక్కువవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. నగరంలో 15 ట్రాఫిక్ యూనిట్లు ఉన్నాయి. వీటికి ఈ-చలాన్ పరికరాన్ని అందజేశారు. 30 మంది ట్రాఫిక్ సిబ్బందికి ఈ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో శిక్షణ కూడా ఇచ్చారు. కొత్త ఈ-చలాన్ వ్యవస్థలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారి పూర్తి సమచారాన్ని ఘటనా స్థలంలోనే ఫీడ్ చేసి ప్రింట్ అవుట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఒకోసారి కొత్త ఈ-చలాన్ వ్యవస్థ పనిచేయకుంటే తిరిగి వీరి వివరాలను మాన్యువల్‌గానే చేయాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో కొత్త ఈ-చలాన్ వ్యవస్థలో వాహనదారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండడంతో ఇది కొంత మేర సులభంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి ఈ పరికరాలు పని చేయకుంటే పాత వ్యవస్థనే ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో దీనిని తీసివేయవద్దని ట్రాఫిక్ విభాగం కోరుతోంది. అయితే ఒక వేళ ట్రాఫిక్ పోలీసులు ఒకేసారి 20 మంది వాహన దారులను పట్టుకున్నట్లుయితే వీరి వివరాలను వేర్వేరు రిజిస్టర్లలో నమోదు చేయాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీస్ తెలిపారు. దీంతో తమకు మరింత పని భారం పెరుగుతోందని ట్రాఫిక్ అధికారి తెలిపారు.