‘స్పాట్‌’ పెడతారు! | Longer penalty points for traffic violations | Sakshi
Sakshi News home page

‘స్పాట్‌’ పెడతారు!

Published Tue, Apr 25 2017 3:06 AM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

‘స్పాట్‌’ పెడతారు!

‘స్పాట్‌’ పెడతారు!

ట్రాఫిక్‌ ఉల్లంఘనులకు ఇక పెనాల్టీ పాయింట్స్‌
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రెండేళ్లలో 12 పెనాల్టీ పాయింట్లు వస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు
ప్రాథమికంగా ‘స్పాట్‌ చలాన్‌’కే పరిమితం


సిటీబ్యూరో: హెల్మెట్‌ లేకుండా రాంగ్‌ సైడ్‌లో దూసుకుపోతున్నాం... ట్రాఫిక్‌ పోలీసులు ఆపితే విధించిన చలాన్‌ చెల్లించేద్దాం... అక్కడితో కథ ముగిసిపోతుందని అనుకుంటున్నారా..! ఇకపై అలా కుదరదు. జరిమానాతో పాటు మీరు చేసిన రెండు ఉల్లంఘనలకు సంబంధించి మూడు పెనాల్టీ పాయింట్లు మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌లోకి చేరతాయి. ఇలా పాయింట్లు పడటం ప్రారంభమైన నాటి నుంచి 24 నెలల్లో మీ స్కోర్‌ 12 దాటితే సీన్‌ మారిపోతుంది. మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రెండేళ్ల పాటు సస్పెండ్‌ చేయడం ద్వారా వాహనం నడిపే చాన్స్‌ లేకుండా చేయనున్నారు. దీనికి సంబంధించిన కీలక ఉత్తర్వుల్ని ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. మంగళవారం నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. భవిష్యత్తులో పెనాల్టీ పాయింట్స్‌ విధింపు విధానాన్ని మరింత విస్తరించే ఆస్కారం ఉందని ట్రాఫిక్‌ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతానికి మూడు కమిషనరేట్లకే...
ఈ పెనాల్టీ పాయింట్స్‌ విధానం పూర్తిగా కంప్యూటర్, సాఫ్ట్‌వేర్, సర్వర్‌ ఆధారంగా జరుగుతుంది. రాష్ట్రంలో రాజధానిలో ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు మినహా మిగిలిన చోట్ల ఉల్లంఘనల నమోదు ఆన్‌లైన్‌లో జరగట్లేదు. పీడీఏ మెషిన్లు, సర్వర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేని నేపథ్యంలోనే మిగిలిన కమిషనరేట్లు, జిల్లాల్లో పెనాల్టీ పాయింట్స్‌ విధానం ప్రస్తుతానికి అమలుకాదని ట్రాఫిక్‌ పోలీసులు చెప్తున్నారు. భవిష్యత్తులో ఏఏ కమిషనరేట్లు, జిల్లాలు అప్‌డేట్‌ అయితే ఆయా ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేయడానికి అనువుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ఇప్పటికైతే స్పాట్‌ చలాన్‌లకే...
ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఉల్లం«ఘనులకు రెండు రకాలుగా జరిమానాలు విధిస్తుంటారు. పాయింట్‌ డ్యూటీలుగా పిలిచే క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు రోడ్లపై వాహనాలను ఆపి పీడీఏ మిషన్ల ద్వారా విధించడం మొదటి రకం. వాహనచోదకుడి పరోక్షంలో ఉల్లంఘనల్ని కెమెరాల ద్వారా షూట్‌ చేసి, ఆర్టీఏ డేటాబేస్‌లో ఉన్న చిరునామా ఆధారంగా ఈ–చలాన్‌ పంప డం రెండో రకం. పెనాల్టీ పాయింట్స్‌ విధానం మొత్తం వాహనచోదకుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా జరుగుతుంది. పోలీసులు పట్టుకున్నప్పుడు అతడి లైసెన్స్‌ నెంబర్‌ సేకరించడం ద్వారా పాయింట్స్‌ దానిపై నమోదయ్యేలా చూ స్తారు. ఈ–చలాన్‌ విధానంలో ఈ అవకాశం లేకపోవడంతో ప్రస్తుతానికి పెనాల్టీ పాయిం ట్స్‌ను స్పాట్‌ చలాన్‌లకే వర్తింపజేస్తున్నారు.

ఆ ఇబ్బందులకు ఆస్కారం లేకుండా...
ప్రస్తుతం పెనాల్టీ పాయింట్స్‌ విధానాన్ని స్పాట్‌ చలాన్లకే పరిమితం చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఓ వ్యక్తికి చెందిన వాహనాన్ని మరొకరు తీసుకువెళ్ళి ఉల్లంఘనకు పాల్పడ్డాడనుకుందాం. ఈ–చలాన్‌ విధానంలోనూ పెనాల్టీ పాయింట్స్‌ విధిస్తే ఆ పాయింట్స్‌ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తికి కాకుండా, వాహనం యజమానికి చేరతాయి. మరోపక్క ప్రస్తుతం సిటీలో తిరుగుతున్న వాహనాల్లో అత్యధికం రిజిస్ట్రేషన్లు మారనివే. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలను ఖరీదు చేస్తున్న వారు వాటి రిజిస్ట్రేషన్లను తమ పేరిట మార్చుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లోనూ వాహనం నెంబర్‌ ఆధారంగా పెనాల్టీ పాయింట్స్‌ విధిస్తే అవి దాని పాత యజమానికి వర్తిస్తాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం స్పాట్‌ చలాన్‌ విధానంలోనే ఈ పాయింట్లు వర్తింపజేయాలని నిర్ణయించారు.

తీవ్రమైన వాటికే తొలి ప్రాధాన్యం...
ట్రాఫిక్‌ పోలీసులు వాహనచోదకుల్ని పట్టుకున్నప్పుడు, ఫొటో ద్వారా బంధించినప్పుడు వారి పాల్పడిన ఉల్లంఘన ఆధారంగా జరిమానా విధిస్తుంటారు. ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీసు విభాగం హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్‌ చేయడం నుంచి క్యాబ్‌ రిజిస్ట్రేషన్‌ లేకపోవడం వరకు మొత్తం 101 రకాలైన ఉల్లంఘనలకు జరిమానా విధిస్తున్నారు. అయితే తొలిదశలో పెనాల్టీ పాయింట్‌ విధానాన్ని ఎంవీ యాక్ట్‌లో ఉన్న ఎనిమిది సెక్షన్ల కిందికి వచ్చే 17 ఉల్లంఘనలకే వర్తింపజేస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ఉల్లంఘనల్ని ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పు కలిగించేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వారికీ ముప్పు కలిగించేవి. అత్యంత ప్రమాదకరంగా పరిగణించే ఈ మూడో తరహా ఉల్లంఘనల పైనే ప్రస్తుతానికి పెనాల్టీ పాయింట్స్‌ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో ఆటోలో ముందు భాగంలో ఎక్కువ మంది ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం నుంచి మద్యం తాగి వాహనం నడపడం వరకు ఉన్నాయి.

డ్రైవింగ్‌ లైసెన్స్‌లో గోల్‌మాల్‌ చేస్తే జైలుకే...
ఈ ఉత్తర్వులు జారీ చేసింది ట్రాన్స్‌పోర్ట్‌ విభాగమైనా... అత్యధికంగా అమలు చేసేది మాత్రం ట్రాఫిక్‌ పోలీసులే. నిర్ణీత కాలంలో పరిమితికి మించి పెనాల్టీ పాయింట్స్‌ పొందిన వాహనచోదకుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను పోలీసు విభాగం సిఫార్సుల ఆధారంగా ఆర్టీఏ విభాగం సస్పెండ్‌ చేస్తుంది. ఈ వివరాలను ఆర్టీఏ డేటాబేస్‌లో పొందుపరుస్తుంది. ట్రాఫిక్‌ విభాగం అధికారుల వద్ద ఉండే పీడీఏ మిషన్లు ఈ సర్వర్‌తోనూ అనుసంధానించి ఉంటాయి. దీంతో ఎవరైనా వ్యక్తి సస్పెండ్‌ అయిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ వినియోగించి వాహనం నడుపుతుంటే ఆ విషయాన్ని పోలీసులు తేలిగ్గా గుర్తిస్తారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటూ అరెస్టు చేయించేందుకు ఆస్కారం ఉంది. సస్పెండ్‌ అయింది కదా అని లైసెన్స్‌ విడిచిపెట్టి, అసలు లేదంటూ వాహనం నడిపినా జైలుకు వెళ్ళడం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. నగరంలో వాహనాలు వినియోగించి అనేక నేరాలకు పాల్పడిన వారు ఎందరో ఉంటున్నారు. ఇలాంటి వారిపై ఇప్పటి వరకు ప్రత్యేకమైన చర్యలకంటూ ఆస్కారం లేదు.

ఫలితంగానే స్నాచర్లు వంటి వాళ్ళు పదేపదే వాహనాలపై తిరుగుతూ నేరాలు చేస్తున్నారు. తనిఖీల్లో పోలీసులు ఆపితే... తమ దగ్గరున్న పత్రాలు చూపించి తప్పించుకుంటున్నారు. అయితే పెనాల్టీ పాయింట్స్‌ వి«ధింపులో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఇలాంటి వారికీ చెక్‌ పడనుంది. ఈ విధానంలో కేవలం ట్రాఫిక్‌ ఉల్లంఘనలే కాదు.. ప్రమాదాలకు కారకులైనా, వాహనాన్ని వినియోగించి స్నాచింగ్, దోపిడీ వంటి నేరాలు చేసినా.. వారిపై కేసుతో పాటు వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌పై అత్యధిక పెనాల్టీ పాయింట్లు పడేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పదేపదే వాహనాలు వినియోగిస్తూ నేరాలు చేసే వాళ్ళ డ్రైవింగ్‌ లైసెన్సులు సైతం సస్పెండ్‌ అవుతాయి. ఈ డేటాబేస్‌ సాయంతోనూ పాత నేరగాళ్ళను గుర్తించడంతో పాటు వారికి చెక్‌ చెప్పడానికి ఆస్కారం ఏర్పడనుంది.

కొన్నాళ్ళ పాటు అవగాహన కల్పిస్తాం
ఈ పెనాల్టీ పాయింట్స్‌ విధింపు విషయంలో వాహనచోదకులకు కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించాం. నిర్ణీత కాలం వరకు వివిధ మాధ్యమాల ద్వారా వాహనచోదకుల్లో ఈ పాయింట్స్‌పై అవగాహన కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. మీడియాతో పాటు ఫేస్‌బుక్, ట్విటర్‌ వంటి సోషల్‌మీడియాలు, ప్రధాన కూడళ్ళలో ఉన్న బోర్డులు, ట్రాఫిక్‌ పోలీసుల పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం, పోలీసుస్టేషన్ల వారీగా కరపత్రాల పంపిణీ ద్వారా విస్తృతస్థాయిలో అవగాహనకు కృషి చేస్తాం. ఆపై ఆర్టీఏ అధికారుల సాయంతో రంగంలోకి దిగి పాయింట్స్‌ విధానం పక్కాగా అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– డాక్టర్‌ వి.రవీందర్, ట్రాఫిక్‌ చీఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement