హెల్మెట్ లేకుంటే జరిమానా | Fine if without Helmet | Sakshi
Sakshi News home page

హెల్మెట్ లేకుంటే జరిమానా

Published Tue, Mar 1 2016 12:22 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

హెల్మెట్ లేకుంటే జరిమానా - Sakshi

హెల్మెట్ లేకుంటే జరిమానా

సాక్షి, హైదరాబాద్: నగర వ్యాప్తంగా మంగళవారం నుంచి హెల్మెట్ తప్పనిసరి కానుంది. అలాగే బుధవారం నుంచి డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై న్యాయస్థానాల్లో చార్జ్‌షీట్లు దాఖలు చేయనున్నారు. వీటికి సంబంధించి ప్రత్యేకంగా డేటాబేస్‌లు సైతం రూపొందిస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ-2 ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నిబంధనలన్నీ మోటారు వాహనాల చట్టంలో సుదీర్ఘ కాలంగా ఉన్నాయని, సుప్రీం కోర్టు నియమిత కమిటీ సిఫార్సుల మేరకు పక్కాగా వీటిని అమలు చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ఇకపై రోడ్లపైకి వచ్చే ద్విచక్ర వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనన్నారు. ఉల్లంఘించిన వారికి రూ.100 జరిమానా విధిస్తారు. మరోసారి ఉల్లంఘనకు పాల్పడితే రూ.300 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లోనే హెల్మెట్‌పై స్పెషల్ డ్రైవ్‌లు చేస్తూ రోజుకు 1500 కేసులు నమోదు చేస్తున్నారు. నేటి నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.
 
 డ్రైవింగ్ లెసైన్స్ లేకుంటే జైలుకే..

 డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ చిక్కితే వారికి జరిమానాతో పాటు వాహన యజమాని, ఉల్లంఘనుడి పైన న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేస్తారు. కోర్టులో నేరం నిరూపితమైతే కనిష్టంగా ఒకరోజు నుంచి గరిష్టంగా వారం రోజుల వరకు ఊచలు లెక్కపెట్టాల్సిందే. బుధవారం నుంచి దీన్ని అమల్లో పెడుతున్నారు. లెసైన్స్ లేకుండా వాహనం నడుపుతూ పదేపదే చిక్కే ఆటోడ్రైవర్ల పర్మిట్ రద్దుకూ సిఫార్సు చేయాలని నిర్ణయించారు.

నగరంలో ట్రాఫిక్ వయోలేషన్స్‌కు సంబంధించిన చలాన్లు ఇప్పటి వరకు వాహన నంబర్ ఆధారంగానే జారీ అవుతున్నాయి. ఇకపై వాహనం నడిపినవారి డ్రైవింగ్ లెసైన్స్, ఆధార్, ఓటర్ ఐడీల్ని కూడా నమోదు చేయడం తప్పనిసరి చేయనున్నారు. దీనివల్ల ఓ వ్యక్తి ఎన్ని రకాలైన వాహనాలు మార్చి ఉల్లంఘనలకు పాల్పడ్డాడో తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఈ వివరాలన్నింటినీ డేటాబేస్‌గా రూపొందిస్తున్నారు. తద్వారా పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి డ్రైవింగ్ లెసైన్స్ రద్దుకు సిఫార్సు చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి మంగళవారం ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ట్రాఫిక్ విభాగంలోని అధికారులకు శిక్షణ ఇస్తారు.
 
 సుప్రీం సిఫార్సుల మేరకే చర్యలు
 రోడ్డు ప్రమాదాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల్ని సిఫార్సు చేయడానికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సాధికారిక కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నాం. మోటారు వాహనాల చట్టంలో ఉన్న అంశాలనే కమిటీ పునరుద్ఘాటించింది. చార్జ్‌షీట్స్ దాఖలు అనేవి ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కిన రిపీటెడ్ వయోలేటర్స్‌కు మాత్రమే అమలు చేస్తాం. ప్రస్తుతం అన్నీ ఆన్‌లైన్ చేయడంతో వాహన చోదకుల వివరాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు పీడీఏ మిషన్ల సాయంతో సరిచూసుకోవచ్చు.
 - ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ-2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement