మద్యం మత్తులో ప్రాణాలు చిత్తు | special story on drunk and drive cases | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ప్రాణాలు చిత్తు

Published Mon, Jan 22 2018 9:24 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

special story on drunk and drive cases - Sakshi

చిత్రంలో తలతెగి మొండెం కలిగిన బైక్‌ చూశారా.. మద్యం మత్తులో హెల్మెట్‌ పెట్టుకోకుండా ఎన్‌.బంగారయ్య (24) అనే యువకుడు ఈ నెల 16న ఆర్టీవో కార్యాలయం సమీపంలో నేరుగా విద్యుత్‌ స్తంభానికి బైక్‌తో ఢీకొట్టాడు. తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ ప్రమాదంలోనే బైక్‌ ఇలా రెండు ముక్కలైంది. దీనినే ట్రాఫిక్‌ పోలీసులు ప్రజలందరికీ తెలిసేలా ఒక పోస్టర్‌లో మృతుడి ఫొటోతో పాటూ బైక్‌ను
ప్రదర్శించి,  వాహనచోదకుల్లో అవగాహన కల్పిస్తున్నారు.

విజయనగరం టౌన్‌: ఆ ప్రమాదమే కాదు.. ఇప్పుడు చాలా ప్రమాదాలు మద్యం మత్తులోనే జరుగుతున్నట్టు పోస్టు మార్టం నివేదికలు తేల్చి చెబుతున్నాయి. మద్యం మత్తులో ఊగుతూ.. జోగుతూ మోటార్‌ బైక్‌లు నడపుతూ ఎదుటివారిని గుర్తించకుండా.. తామేమైపోతున్నామో తెలియని స్థితిలో ఏ చెట్టుకో, స్తంభానికో, లేక ఎదురుగా వస్తున్నా వారికో ఢీకొట్టి ప్రాణాలు విడుస్తున్నారు. అవతలవారి ప్రాణాలు తీస్తున్నారు. ఇరువైపుల కుటుంబాల్లోనూ విషాదం నింపుతున్నారు. మద్యం మత్తులో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారే ప్రమాదాలకు కారకులవుతుండడం పోలీసులను కలవర పరుస్తోంది.

వేగంగా నడుపుతూ...
మద్యం మత్తుతో పాటు యువకులు బైక్‌లను వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. సాధారణంగా డిగ్రీ, ఇంజనీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు బైక్‌లపై దూసుకుపోతూ ఎదుటివారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కొన్నిసార్లు అదుపుతప్పి డివైడర్లకు ఢీకొట్టి ప్రాణాలు విడుస్తున్నారు. నూతన సంవత్సరం రోజున అతివేగమే నలుగురు యువత ప్రాణాలను తీసినట్టు పోలీస్‌ రికార్డులు చెబుతున్నాయి.

తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత
కుడుకు డిగ్రీకెళ్తే చాలు తల్లిదండ్రులు బైక్‌లు కొనిస్తున్నారు. డ్రైవింగ్‌ వచ్చా.. లైసెన్స్‌ ఉందా.. లేదా అన్న విషయాలు పట్టించుకోవడంలేదు. ఈ నిర్లక్ష్యమే వారి ప్రాణాలను తోడేస్తోందని పోలీసులు హెచ్చరిస్తున్నా స్పందించేవారు కరువయ్యారు.

పోలీస్‌ కేసులు ఇలా...
2017లో ఒక వాహనం ఒకటి కన్నా ఎక్కువసార్లు ప్రమాదానికి గురైనవి 1779 వరకూ ఉన్నాయి.  ప్రమాదానికి కారకులైన  210 మంది  డ్రైవింగ్‌ లైసెన్సులను పోలీసులు రద్దుచేశారు.
 హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్‌ చేసిన వారిపై 2016లో 72,371 మందిపై కేసులు నమోదు చేయగా.. 2017లో 88,722 మంది ఉన్నారు.
డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా ప్రయాణాలు చేసే వారి సంఖ్య  2016లో 17,178 మంది ఉండగా, 2017లో అలాంటి వారిపై 12,508 పై కేసులు నమోదు చేశారు.
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు  2016లో 4021 నమోదుకాగా, 2017లో 5,165 నమోదయ్యాయి.  సెల్‌ ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తున్న వారిపై  2016లో 625 కేసులు నమోదు చేయగా, 2017లో 1797 కేసులు నమోదుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement