తీవ్రగాయాలపాలైన సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన విద్యార్థిని మల్లెల ప్రవన్న (ఫైల్)ఏఆర్ కానిస్టేబుల్ మద్యం మత్తులో బైకు నడిపి ఢీకొనడంతో మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మైత్రి తేజస్విని (ఫైల్)
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : హెల్మెట్ లేకుండా బైకు నడపడమే కాదు రోడ్డుపైకి వచ్చేటప్పుడు కూడా హెల్మెట్‌ను ధరించాల్సిన రోజులొచ్చేలా ఉన్నాయి. రోడ్డుపై నడిచే సమయంలో వాహనాలపై దూసుకొచ్చే మందుబాబులు, ఆకతాయిల నుంచి మన ప్రాణాలకు రక్షణ కరువవుతోంది. ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే రోడ్డుపై నడవాలంటేనే జనం భయపడిపోయే పరిస్థితులు దాపురించాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టంవచ్చినట్లు బైకులు నడిపే ఆకతాయిల వల్ల రోడ్లపై రాకపోకలు చేసే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, గాయాలపాలవ్వడం సింగ్‌నగర్, పాయకాపురం పరిసర ప్రాంతాల్లో నిత్యకృత్యంగా మారింది.
తప్పొకరిది.. శిక్ష మరొకరికా..?
మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. అయితే ఇది మన నగర వాసులకు మాత్రం మిన‘హాయి’ంపుగా మారినట్లు కనిపిస్తోంది. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నెలాఖరుకోసారో, ప్రధాన సంఘటనలు జరిగిన రోజుల్లో తప్ప మిగిలిన సమయంలో ఎవరూ పట్టించుకోరనే నమ్మకం ప్రజల్లో ఉండడంతో ఆకతాయిలు, మందుబాబులు తమకు ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు నడిపేస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు చదువుకున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇదేవిధంగా వాహనాలు నడుపుతుండటం వల్ల ఎంతోమంది జీవితాలు, వారి కుటుంబ సభ్యుల జీవితాలు అంధకారంగా మారుతున్నాయి.
ఇటీవల జరిగిన సంఘటనలు ఇవిగో..
♦ సింగ్‌నగర్ వడ్డెర కాలనీ ప్రాంతానికి చెందిన మల్లెల ప్రవన్న (15) బందరురోడ్డులోని బిషప్ హజరయ్య స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ మంగళవారం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు రేడియో స్టేషన్ వద్ద రోడ్డు దాటుతుండగా ముగ్గురు యువకులు మద్యం సేవించి ఒకే బైకుపై మితిమీరిన వేగంతో వచ్చి ఆమెను ఢీకొన్నారు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి కోమాలోకి వెళ్లిపోయింది. దగ్గరే ఉన్న పోలీసులు చొరవచూపి ఆస్పత్రికి తరలించడం, రక్తదానం చేయడంతో ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది.
♦ రెండు నెలల క్రితం వాంబే కాలనీకి చెందిన ఓ యువకుడు బైకుపై గుణదలకు వెళ్తుండగా మద్యం మత్తులో బైకు నడుపుతున్న ఓ వ్యక్తి సింగ్‌నగర్ ఫ్లైఓవర్‌పై అతన్ని బలంగా ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
♦ నాలుగు నెలల క్రితం సింగ్‌నగర్ ఎల్‌బీఎస్ నగర్‌లో ఓ ఆకతాయి మితిమీరిన వేగంతో బైకు నడపడం వల్ల రోడ్డుపై నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడడంతో పాటు, పక్కనే ఉన్న దుకాణంలో అద్దాలు, సామాన్లు పగిలిపోయాయి. సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, కండ్రిక ప్రాంతాల్లో తరచూ ఇదే విధంగా ప్రమాదాలు జరగడం, పలువురు గాయాలపాలవడం ఇక్కడ పరిపాటిగా మారిపోయింది. సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, పాయకాపురం, కండ్రిక, న్యూరాజరాజేశ్వరీపేట, వాంబేకాలనీ రోడ్లలో మందుబాబులు, ఆకతాయిలు ఆగడాలు అధికంగా ఉంటున్నాయి.
స్పీడ్ బ్రేకర్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి
స్కూల్ పిల్లలు కూడా పెద్దపెద్ద బైకులు నడిపేస్తున్నారు. జనాలు తిరిగే ఈ రోడ్లపై మితిమీరిన వేగంతో రయ్‌మంటూ దూసుకువచ్చేస్తున్నారు. వీటివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, కండ్రిక ప్రాంతాల్లోని ప్రధాన రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు, బారికేడ్లను ఏర్పాటు చేస్తే ఈ అతివేగాలకు కొంతవరకు కళ్లెం వేయవచ్చు. – కృష్ణ, స్థానికుడు
అవగాహన సదస్సులు, కౌన్సెలింగ్‌లు పెట్టాలి
రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు, వారిని కోల్పోవడం వల్ల వారి కుటుంబ సభ్యులు పడుతున్న బాధలను చూపిస్తూ పాఠశాలలు, కళాశాలలు, మద్యం దుకాణాల వద్ద, రోడ్లపై స్క్రీన్ ద్వారా అవగాహన సదస్సులు పెట్టాలి. నిబంధనలు పట్టని వాహనచోదకులను గుర్తించి కౌన్సెలింగ్ చేస్తే బాగుంటుంది. – ఎండీ హఫీజుల్లా, స్థానికుడు
Comments
Please login to add a commentAdd a comment