సాక్షి, అమరావతి: దేశంలో అతివేగం వల్లే అత్యధిక రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. 2020తో పోల్చితే 2021లో అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ మేరకు 2021లో రాష్ట్రాల వారీగా రోడ్డు ప్రమాదాలపై కేంద్రం నివేదిక విడుదల చేసింది. దేశంలో ఆ ఏడాదిలో మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 71.7 శాతం ప్రమాదాలు అతివేగం వల్లే జరిగాయి.
అంతేకాకుండా 2020తో పోల్చితే ఇవి 11.4 శాతం పెరిగాయి. రోడ్డు ప్రమాదాల మొత్తం మరణాల్లో అతివేగం వల్ల ఏకంగా 69.6 శాతం మృతి చెందగా 72.9 శాతం గాయపడ్డట్టు నివేదిక పేర్కొంది. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల 2.2 శాతం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల 1.6 శాతం రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో కూడా జాతీయ రహదారులపై అతివేగం కారణంగా 2021లో 5,167 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 2,155 మంది మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది. అలాగే రాష్ట్రంలో మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల జాతీయ రహదారులపై 113 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 13 మంది మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment