ఇక ‘నగదు రహిత చలానా’
కొత్త విధానాన్ని ప్రారంభించిన హోంమంత్రి
మూడు చలాన్‌లు పెండింగ్ ఉంటే నోటీసులు
స్పందించకపోతే జైలు రూ.80 కోట్ల బకాయిలు
సిటీబ్యూరో: ‘ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులు ప్రభుత్వానికి జరిమానా రూపంలో సుమారు రూ.80 కోట్లు బకాయి పడ్డారు. మీ వాహనంపై మూడు చలానాలు ఉంటే వెంటనే జరిమానా చెల్లించండి. లేదంటే జైలే’ అంటున్నారు నగర ట్రాఫిక్ పోలీసులు. ఇందులో భాగంగా మొండి బకాయిదారులకు బుధవారం నుంచి నోటీసులు జారీ చేస్తారు. వీటికి స్పందించకపోతే చార్జీషీట్ వేసి కోర్టులో హాజరుపరుస్తామని చెబుతున్నారు. ఇలాంటి మొండి బకాయిదారులు నగరంలో సుమారు 60 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా వారం రోజుల్లో పెండింగ్ చలానాలు చెల్లించాల్సిందే. లేదంటే అంతే సంగతులు. అంతేకాదు... ట్రాఫిక్ సిబ్బంది లేరని ఉల్లంఘనకు పాల్పడ్డారో పప్పులో కాలేసినట్లే. నగరంలోని 355 కూడళ్లలో ఉల్లంఘనులను నిఘా కెమెరాలు పసిగడుతుంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఇందులో భాగంగానే ట్రాఫిక్ విధులు, చలానా విధానం పారదర్శకంగా ఉండేలా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆంనంద్‌లతోకలిసి ‘నగదు రహిత ట్రాఫిక్ చలాన్’ విధానాన్ని మంగళవారం నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కొత్త విధానం వల్ల వాహనదారుడు జరిమానాను విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు నగదు రూపంలో చెల్లించనక్కర్లేదు. డెబిట్, క్రేడిట్, ఈ-సేవ, మీసేవ, ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్, బ్యాంకులలో చెల్లించాల్సి ఉంటుంది.
నిజాయితీగా విధి నిర్వహణ: హోం మంత్రి
కొత్త విధానం వల్ల ట్రాఫిక్ సిబ్బంది నీతి, నిజాయితీలతో విధులు నిర్వహిస్తారని, ఎలాంటి ఆరోపణలకూ ఆస్కారం ఉండదని హోం మంత్రి అన్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణతోనేఅభివృద్ది సాధ్యమని చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ లేనివిధంగా చేసేందుకు ప్రత్యేక నిపుణులతో అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇందుకోసం అవసరమైన చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోందన్నారు. పోలీసు సేవలు ప్రజలు ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్న జంట పోలీసు కమిషనర్లను ఆయన అభినందించారు. డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఠాణాలకు వారం రోజుల్లో కొత్త వాహనాలు అందిస్తున్నట్లు ప్రకటించారు. రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ నగర ట్రాఫిక్ పోలీసుల ప్రయోగాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. రాంగ్ పార్కింగ్ చేసే వాహనాలను తీసుకెళ్లే ట్రాఫిక్ క్రేన్‌లకు వెనక, ముందు వైపు సీసీ కెమెరాలను అమర్చి సరికొత్తగా రూపొందించారు. వాటిని హోం మంత్రి ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలిసింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగదు రూపంలో పెండింగ్ చలానాలు గతంలో రోజుకు రెండు వేల మంది చెల్లించేవారని... ప్రయోగాత్మకంగా చేపట్టిన నగదు రహిత చలాన్ విధానంతో పెండింగ్ చలానాదారులు రోజుకు 8 నుంచి 9 వేల మంది చెల్లిస్తున్నారని తెలిపారు. వాహనదారుడు ఉల్లంఘనకు పాల్పడితే చలాన్ రసీదు మాత్రమే ఇస్తామన్నారు. నగదు వసూలు చేయబోమన్నారు. మంచి ఫలితాలు రావడంతో ఈ విధానాన్ని నేటి నుంచి అధికారికంగా ప్రారంభించామన్నారు.