దుమ్ముగూడెం: తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఒకరిపైకి ఒకరు దూసుకురావడంతో పాటు గల్లాలు పట్టుకునేందుకు రెడీ అయ్యారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో అక్కడే ఉన్న కలెక్టర్, ఎస్పీ, అటవీ అధికారులు సర్దిచెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకపాడులో బుధవారం తునికాకు బోనస్ చెక్కుల పంపిణీకి సమావేశం ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విప్ కాంతారావు, ఎమ్మెల్యే వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ మూడో సారి కూడా కేసీఆర్ సీఎం అవుతారని, రాబోయే ఎన్నికల్లో భద్రాచలం నుంచి గెలిచేది బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థేనంటూ తన ప్రసంగం కొనసాగించారు. దీనికి వేదికపై ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య(కాంగ్రెస్) జోక్యం చేసుకుని ఇది ప్రభుత్వ కార్యక్రమమని..ఇక్కడ రాజకీయాలెందుకంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కాంతారావు మరింత దూకుడుగా ప్రసంగం కొనసాగిస్తూ ప్రతిపక్షాలనుద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ప్రసంగం ముగించి తన సీట్లో కూర్చునే సమయంలోనూ ప్రభుత్వ పథకాల గురించి చెబుతుంటే బాధెందుకు అంటూ పోదెంను ఉద్దేశించి అన్నారు. ఇందుకు వీరయ్య ‘నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి ఇష్టం వచ్చి నట్టు మాట్లాడితే కుదరదంటూ’హెచ్చు స్వరంతో బదులిచ్చారు. దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నీకు మైండ్ ఉందా అంటూ పోదెం అనగా.. నువ్వు నోర్మూసుకో అంటూ విప్ అన్నారు.
ఇలా అభ్యంతరకమైన పదాలతో దూషించుకుంటూనే ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు. వేదికపై ప్రసంగించేందుకు సిద్ధమైన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిశ్చేషు్టడై చూస్తుండిపోయారు. ఇద్దరూ భౌతికదాడులకు దిగే విధంగా పరిస్థితి నెలకొనడంతో అక్కడే ఉన్న కలెక్టర్ అనుదీప్, పీసీసీఎఫ్ డోబ్రియల్ కల్పించుకుని రేగా చేయి పట్టుకుని వెనక్కి తీసుకెళ్లి కూర్చోబెట్టగా ఎస్పీ వినీత్ ఎమ్మెల్యే పొదెంను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment