సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరుతున్న సమయంలో ఆయనను అరెస్ట్ చేశారు. ముందస్తు చర్యలలో భాగంగా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అయితే, ఇటీవల శ్రీరామనవమి సందర్బంగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, పోలీసులు రాజాసింగ్‌పై కేసు కూడా నమోదు చేశారు.
ఈ క్రమంలోనే హనుమాన్ జయంతి సందర్భంగా ముందస్తుగా రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది నేను హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బైక్ ర్యాలీలో పాల్గొంటాను. కానీ, ఈసారి మాత్రమే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పాలని ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ తర్వాత జరిగినే విధ్వంసాలు, అనర్థాలకు నేను మాత్రం బాధ్యుడిని కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇక, గౌలిగూడ టు తాడ్‌బండ్ హనుమాన్ జయంతి విజయ యాత్రకు ప్రత్యేకమైన బందోబస్తుతో ఎవరికీ ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ అడిషినల్ సీపీ జి.సుధీర్‌బాబు తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందితో పాటు శాంతిభద్రతల సిబ్బంది సైతం ట్రాఫిక్ డ్యూటీలో ఉంటున్నట్లు తెలిపారు. యాత్ర సాగే రూట్‌లో ట్రాఫిక్ డైవర్షన్లు చేస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలను సైతం సూచిస్తున్నామన్నారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల సమయంలో సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ వెళ్లేవారి కోసం రూట్‌ని కూడా సూచిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు, వాహనదారులకు ఏమైనా అర్థం కాకపోయినా, సమస్యలున్నా నేరుగా 040–27852482, 9010203626 నంబర్లకు ఫోన్ చేయొచ్చన్నారు. ట్రాఫిక్ ఏర్పాట్లపై అడిషినల్ సీపీ సుధీర్‌బాబు బుధవారం మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. గౌలిగూడ యత్ర ప్రారంభం నుంచి తాడ్‌బండ్ వరకు 12 కి.మీ.మేర యాత్ర కొనసాగనుంది. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కోఠి, సుల్తాన్‌బజార్, కాచిగూడ ఎక్స్‌రోడ్డు, నారాయణగూడ, కవాడిగూడ, బన్సీలాల్‌పేట్, మహంకాళి టెంపుల్, ప్యారడైజ్ ఎక్స్‌రోడ్డు మీదుగా తాడ్‌బన్ హనుమాన్ టెంపుల్ వరకు సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment