
సాక్షి,సనత్‌నగర్: న్యూస్ రాసే జర్నలిస్టులు కోర్ (క్రెడిబిలిటీ, ఆబ్జెక్టివిటీ, రెస్పాన్సిబిలిటీ, ఎథిక్స్) విలువలను పాటించడం ద్వారానే వార్తకు సంపూర్ణత చేకూరుతుందని, సమాజంలో వారికి గౌరవం పెరుగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి కొత్తగా నిర్మించే సెక్రటేరియట్‌లో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గదిని కేటాయించేలా కృషి చేస్తానని ఆమె హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో రెండు రోజుల పాటు జరిగిన మహిళా జర్నలిస్టుల వర్క్‌షాప్ ఆదివారం ముగిసింది.
సమావేశానికి ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌తో మాట్లాడి మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించే కమిటీలు వేయించేందుకు ప్రయత్నిస్తానన్నారు. మహిళా జర్నలిస్టులు ఎవరైనా గొంతెత్తితే ఆపేందుకు ‘టెక్ ఫాక్స్’ద్వారా వ్యతిరేకంగా లక్షల కొద్దీ ట్వీట్స్ చేసి వారిని అణచడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది దురదృష్టకరమని అన్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ పత్రిక రంగంలోని అన్ని పాత్రలను తానే పోషించి కాకతీయ అనే పత్రికను నడిపారని ఎమ్మెల్సీ వాణీదేవి గుర్తు చేశారు. జనాన్ని జాగృతం చేయగలిగే సత్తా ఒక్క జర్నలిస్టులకే ఉందన్నారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే నాయకులు మారుతీసాగర్, రమణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment