
సాక్షి, హైదరాబాద్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో శాసనసభ వానాకాలం సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. బీఏసీ సూచన మేరకు ఈ నెల ఏడో తేదీ నుంచి 28 వరకు సభ నిర్వహించాలని అనుకున్నా సభ్యులు, ఇతరుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమావేశాలను కుదించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బుధవారం వానాకాలం ఎనిమిదో రోజు సమావేశాలు ముగిసిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
‘రాష్ట్రంలో అమలవుతున్న అన్ని కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించాలనే ఉద్దేశంతో సమావేశాలు ప్రారంభించాం. ముఖ్యమైన రెవెన్యూ బిల్లులతో పాటు మొత్తం12 బిల్లును ఆమోదించుకున్నాం. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌తో పాటు విద్యుత్, కరోనా, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలపై లఘు చర్చ జరిగింది. సభ సజావుగా సాగుతున్నా.. రోజూ 1,200 మంది సమావేశాలకు వస్తున్నారు. వీరి క్షేమం కోసమే వాయిదా వేస్తున్నాం’అని స్పీకర్ ప్రకటించారు.
ఇద్దరు శాసనసభ్యులకు కరోనా..
‘భౌతిక దూరం పాటిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నా.. ఇటీవల జరిపిన కరోనా పరీక్షల్లో ఇద్దరు శాసనసభ్యులతో పాటు పలువురు పోలీసులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎవరు ఎలా కరోనా బారిన పడతారో... అనే సంశయాన్ని సభ్యులు వ్యక్తం చేశారు. వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని శాసనసభ వానాకాలం సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నా’అని స్పీకర్ పోచారం ప్రకటించారు.
మండలి కూడా...
శాసనసభ తరహాలోనే మండలి సమావేశాలను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. కాగా, అసెంబ్లీ ఉభయ సభల నిర్వహణకు సంబంధించి బుధవారం ఉదయం స్పీకర్ చాంబర్‌లో పోచారం, గుత్తా భేటీ అయ్యారు. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులతోనూ సభ కొనసాగింపుపై చర్చించారు.
అర్ధవంతంగా సమావేశాలు...
కరోనా నేపథ్యంలో ఈ నెల 7న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 8 రోజుల పాటు అర్ధవంతంగా, హుందాగా సాగాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సమావేశాలు వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్‌లో మీడియాతో మాట్లాడారు. కరోనా పరిస్థితుల్లో అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ సమవేశాలు 5 రోజులకు మించి జరగలేదని, సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే.. స్పీకర్, మండలి చైర్మన్ సమావేశాలను కుదించాలని నిర్ణయించారన్నారు. నిర్మాణాత్మక చర్చలకు ప్రతిపక్షాలు ప్రాధాన్యత ఇచ్చాయని, సమయభావం వల్లే పాలక సభ్యులకు మాట్లాడే అవకాశం లభించలేదని మంత్రి వివరణ ఇచ్చారు. మీడియా సమావేశంలో చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment