సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అనేక అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఈ రంగాల్లో భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం మంగళవారం నిర్వహించిన ఓ వెబినార్‌లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కేవలం ఔషధ తయారీకే పరిమితం కాక భవిష్యత్తులో డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటామన్నారు. ఐటీ రంగానికి చెందిన ఐదు దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదేరీతిలో నోవార్టిస్ వంటి ఫార్మా దిగ్గజ కంపెనీలూ హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేశాయన్నారు.
డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా: వరల్డ్ ఎకనమిక్ ఫోరం భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. అపోలో, వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో కలిసి ‘మెడిసిన్స్ ఫ్రం ది స్కై’ కార్యక్రమంలో భాగంగా అత్యవసర వేళల్లో డ్రోన్ల ద్వారా ఔషధాలను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మా రంగంలో సంస్థల నడుమ పోటీయే కాకుండా భాగస్వామ్యానికి కూడా అవకాశముందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో హైదరాబాద్ ఫార్మా రంగం మరోమారు తన బలాన్ని చాటుకుందన్నారు. జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైజెస్ పార్కు, ఫార్మాసిటీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామి ఫార్మా డెస్టినేషన్‌గా నిలదొక్కుకుందన్నారు.
30 శాతం వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే..
ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న వ్యాక్సిన్లలో హైదరాబాద్ నుంచి 30 శాతం మేర ఉత్పత్తి అవుతున్నాయని, భారత్ బయోటెక్ వంటి కంపెనీలు వ్యాక్సిన్ల తయారీలో ముందున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలు స్థానికంగా మరింత విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఐటీ రంగం తరహాలో ఈ రంగాలూ లక్షలాది మందికి ఉపాధి కల్పించే వాతావరణం ఉందని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment