అవార్డులు అందజేస్తున్న కేటీఆర్, సోనూసూద్
సాక్షి, హైదరాబాద్, మాదాపూర్: ఎన్ని అటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా సమాజ సేవలు చేసే వారికే గుర్తింపు లభిస్తుందని మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలో సోనూసూద్ సేవాభావాన్ని చాటుకుని.. నిజజీవిత హీరోగా నిలిచారన్నారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో సోమవారం టీఎస్‌ఐజీ (తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్) ఆధ్వర్యంలో కరోనా సమయంలో ఉత్తమ సేవలందించిన ఐటీ, స్వచ్ఛంద సంస్థలతో పాటు కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు అవార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, నటుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త సోనూసూద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచి పనులు చేసే వారిపై నిందలు సహజమేనన్నారు. కరోనా సమయంలో సమాజ సేవ చేయడంలో సోనూసూద్ తమవంతు బాధ్యతగా ఎన్నో గొప్ప పనులు చేశారని ప్రశంసించారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శ చేయడం సులభమని, కానీ బాధ్యతగా సేవ చేసేవారికి తెలుసు దాని విలువేమిటో అని పేర్కొన్నారు. విమర్శలు వచ్చినా సోనూసూద్ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే దుష్ప్రచారం చేశారని చెప్పారు.
స్వచ్ఛంద సేవా సంస్థలే స్ఫూర్తి...: సామాజిక బాధ్యతలను విధిగా నిర్వర్తించే కేటీఆర్‌లాంటి నాయకుడు ఉంటే తనలాంటి సేవకుల అవసరం ఎక్కువగా ఉండదని సోనూసూద్ అన్నారు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టామని, కానీ తెలంగాణ నుంచి మాత్రం మంచి స్పందన లభించిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం కేటీఆర్‌కు సోషల్ మీడియాలో ట్యాగ్ చేయగానే వెంటనే స్పందించారని అన్నారు.
ఇంకా తన బాధ్యత పూర్తవ్వలేదని, సేవలు కొనసాగుతాయని చెప్పారు. స్వచ్ఛంద సేవా సంస్థలు తనకు ఆదర్శమని, వారి నుంచి ఎల్లప్పుడూ స్ఫూర్తి పొందుతానని సోనూ వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ రాష్ట్ర కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఉత్తమ సేవలను అందించిన 12 కార్పొరేట్ సంస్థలు, 26 ఎన్‌జీవోలు, 6 సమన్వయ సంస్థలు, 22 మంది అసాధారణ వ్యక్తులకు ఈ–సర్టిఫికెట్ ద్వారా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment