ప్రాణాలతో బయటపడ్డ హర్షవర్ధన్
రాయికల్:(జగిత్యాల): ‘మీకు పెద్దపులిని చూపిస్త.. నాతో రండి’అని ఓ తల్లి తన ఇద్దరు కుమారులను గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడ పిల్లలతో కలసి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, పెద్దకుమారుడు మృతిచెందగా, చిన్నకుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేటలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కిష్టంపేటకు చెందిన కస్తూరి సంపత్, లావణ్య(25) భార్యాభర్తలు. వీరికి గణేశ్(8), హర్షవర్ధన్ (6) అనే కుమారులు ఉన్నారు. పదేళ్ల క్రితం స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి ఉపాధి కోసం కిష్టంపేట గ్రామానికి వచ్చారు. ఇక్కడే కూలీ పనిచేసుకుంటూ బతుకుతున్నారు.
శుక్రవారం భార్యాభర్తలు అల్లీపూర్ గ్రామంలోని ఓ మేస్త్రీ వద్ద కూలీ పనిచేసి ఇంటికి తిరిగి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత లావణ్య.. పెద్దపులిని చూపిస్తానంటూ తన ఇద్దరు కుమారులతో కలసి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావివద్దకు వెళ్లింది. తర్వాత ఇద్దరు కుమారులను పట్టుకుని బావిలో దూకింది. అయితే, ఈ ప్రయత్నంలో తల్లి, పెద్దకుమారుడు బావిలో పడిపోగా హర్షవర్ధన్ బావిగట్టువద్దే ఉండిపోయాడు. వెంటనే బాలుడు అక్కడ ఉన్నవారికి ఈ విషయం చెప్పగా, వారు బావి వద్దకు చేరుకుని లావణ్య, గణేశ్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు నీటిలో మునిగి చనిపోయారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే లావణ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
అమ్మతో కలసి కేక్ కట్ చేసిన
నిన్న నా పుట్టినరోజు. అమ్మా, నాన్న, అన్నయ్యతో కలసి కేక్ కట్ చేసిన. అందరికీ మిఠాయిలు పంచిన. రాత్రి అందరం బాగానే ఉన్నం. పొద్దునే అమ్మ, నాన్న కలసి పనికి పోయిండ్రు. నాకు పెద్దపులిని చూపిస్తనని అమ్మ నన్ను బాయికాడికి తీసుకెళ్లింది. నన్ను, అన్నను తీసుకుని బావిలో దూకింది. నేను బావిగట్టు వద్దే పడిపోయా.
– హర్షవర్ధన్, చిన్నకుమారుడు
Comments
Please login to add a commentAdd a comment