
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/యాదాద్రి: రాష్ట్రవ్యాప్తంగా 3 వేల కి.మీ. రోడ్లు ధ్వంసమయ్యాయని, మరమ్మతుల కోసం నియోజకవర్గానికి రూ.6 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా రూ.714 కోట్లు కావాలంటూ సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. ‘రోడ్లకు రోగం’శీర్షికన ‘సాక్షి’వార్తాపత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. మూడున్నరేళ్లుగా సాగుతున్న మోత్కూరు రాయగిరి రోడ్డుపనులపై వచ్చిన వార్తా కథనాన్ని జత చేస్తూ సీఎం కేసీఆర్‌కు ట్వీట్ కూడా చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి నుంచి ఆత్మకూర్(ఎం) మండలం రాయిపల్లికి వెళ్లే రోడ్డు మరీ అధ్వానంగా ఉందని, 5 కి.మీ. ఈ రోడ్డుపై వెళ్లే వాహనదారులకు నరకం కనిపిస్తోందని, అధికారుల నిర్లక్ష్యంతో గతుకుల రోడ్లపై ప్రతిరోజూ కనీసం ఒకటి, రెండు ప్రాణాలు బలవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ‘నేనేమో ఒక ఎంపీగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ, ప్రజల కోసం హైవేలు వేయిస్తుంటే.. మీ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది’అని విమర్శించారు.